పల్నాటి యుద్ధంలో బ్రహ్మన్న చిట్టిమల్లు పుంజు పానగల్లదే..
‘పల్నాటి యుద్ధం’ అనంగనే తెలుగు తేజం, పల్నాటి పౌరుషం, బ్రహ్మనాయని ఉదాత్తత, బాలచంవూదుని శౌర్యవూపతాపాలు, నాయకురాలు నాగమ్మ కుటిలత్వం, కపట నీతి వంటివి ఎన్నో మన మనసుల్లో మెదిలేటట్టు, నరనరాన ప్రవహించేటట్టు కవులు, గాయకులు మనల్ని తయారు చేశారు. శ్రీనాథుడు, కొండయ్య, మల్లయ్యలు రాసినట్టుగా చెప్పబడుతూ, పింగళి లక్ష్మీకాంతంచే పరిష్కరింపబడ్డ ‘పల్నాటి వీరచరిత్ర’ మొదలుకొని, పల్నాటిగాధపై తెలుగు సాహిత్యంలో యక్షగానం తప్ప మిగిలిన అన్ని ప్రక్రియల్లో కథ, నవల, కావ్యం, బుర్రకథ- వంటివి శతాధిక రచనలు వచ్చాయి. 160వ దశకంలో ముదిగొండ వీరభద్ర కవి ‘పల్నాటి వీరభాగవతం’ రచించారు.
దానిని నాజర్ బుర్రకథగా గానం చేశారు. ఇటీవలే డా॥ కోడూరి ప్రభాకర్‌డ్డి ‘పల్నాటి వీరభారతం’ పద్య కావ్యాన్ని రచించారు. ఈ కథ తెలుగు వెండితెర మీద దశాబ్దకాలం రెండుసార్లు చిత్రీకృతమై, అద్భుతంగా ఆడి ‘కపూక్షన్ల’ని, తెలుగు వాళ్ళ మనసుల్ని దోచుకున్నది. అయితే, ఏ ప్రక్రియలో వచ్చినా, ‘పల్నాటి యుద్ధం’ కథాంశం మౌలికంగా ఒకటే.
ఉత్తర భారతదేశం నుండి (ఖబల్‌పూర్ అని చెప్తారు) ఆంధ్రదేశానికి వచ్చిన అలుగురాజు (అనుగురాజు) వెలమ కులస్థులు. ఆంధ్రవూపాంతలో (మేటుపల్లి దగ్గర) స్థిరపడి, ముగ్గురు భార్యల ద్వారా బహు సంతానాన్ని పొందుతాడు. భార్యకి అరణంగా వచ్చిన పల్నాడు ప్రాంతాన్ని (గురజాల) పాలిస్తూ, జిట్టగామాలపాడుకి చెందిన నాగమ్మకు ఆమె కోరిన సమయంలో కొన్ని ఘడియలు మంత్రిగా ఉండేటట్లు పత్రం రాసిస్తాడు. ఈ నాగమ్మ మన కరీంనగర్ జిల్లా ఆర కోడలని శ్రీనాథుని రచన.
అనుగు మరణానంతరం నలగాముడు రాజు, బ్రహ్మనాయుడు మంత్రి అవుతారు. ఆ సమయంలో నాగమ్మ అనుగు రాసిచ్చిన పత్రాన్ని చూసి, మంత్రి పదవి చేపట్టి, బ్రహ్మనాయుడు, వారి బంధుమివూతుల ఇళ్ళపై సైనిక సోదాలు చేయిస్తుంది. రాజు బొక్కసానికి జమ చేయకుండా వారు దాచిన ప్రజాధనాన్ని బయటపెట్టి, నలుగాముని అభిమానాన్ని, శాశ్వత మంత్రి పదవిని పొందుతుంది.
నలగామరాజు సవతి సోదరుడు మలిదేవ రాజుకు మాచర్ల రాజ్యాన్ని పంచింపచేసి, బ్రహ్మనాయుడు మలిదేవునికి మంత్రిగా మారతాడు. పల్నాడు రాజ్యం మొత్తం కోసం నలగామున్ని, నాగమ్మను లక్ష్యంగా ప్రయత్నాలు సాగిస్తాడు. నాగమ్మకు బ్రహ్మనాయుడికి స్పర్థ పెరిగిపోతుంది. అది నలగాముడికి, మలిదేవుడికి, గురజాలకు, మాచెర్లకు మధ్య రాజ్యాధికారానికై యుద్ధంగా పరిణమించి, భారతంలో అన్నదమ్ముల మధ్య యుద్ధం లాగా మారుతుంది.
మలిదేవుని వివాహానికి నలగాముడు పోకపోవడంతో అతడికి కట్న కానుకలు ఇవ్వడానికి బ్రహ్మనాయుడు మాచెర్ల నుండి గురజాలకు వచ్చి ఒకరోజు బస చేస్తాడు. ఆ సమయంలో నాగమ్మ బ్రహ్మనాయుడి బస ఎదురుగా ‘కోళ్ళ పోరు’ ఏర్పాటు చేయిస్తుంది. బ్రహ్మనాయుడుకి కోడిపందేలు ఒక వ్యసనం. తన బసముందు జరుగుతున్న ‘కోడిపోరు’ను అత్యంత ఉత్సాహంతో, తన్మయత్మంతో చూస్తుంటాడు. కోళ్ళ పందెం చూస్తున్న గుంపులో కొందరు అందులో ఒక కోడి గురజాలదని, మరో కోడి మాచెర్లదని అరుస్తూ బ్రహ్మన్నను కవ్విస్తారు. ఇంతలో ఒక కోడి పోరులో ఓడి పారిపోవడం మొదపూడుతుంది. ‘మాచెర్ల కోడి ఓడి పారిపోతోందని, బ్రహ్మనాయుడి కోడి ఓడి పారిపోతోందని’ అరుస్తారు. అది విన్న బ్రహ్మన్న ఆవేశపరుడై, మనసులో చెన్నకేశవుడిని తలుస్తాడట. దాంతో పారిపోతున్న కోడి తిరిగి వచ్చి రెండో కోడిని ఓడిస్తుంది. దీంతో నాగమ్మ ‘ఇది వుత్తుత్తి కోడిపోరే! నిజమైన కోడిపోరు ఏర్పాటు చేసి రాజ్యాన్ని పణంగా పెడదామని’ బ్రహ్మనాయుణ్ణి రెచ్చగొడుతుంది. దానికి బ్రహ్మన్న ఒప్పుకొని, గురజాల నుండి మాచెర్లకి తిరిగి వస్తాడు.
మలిదేవుని రాజ కొలువులో రాజు, సుంకరివారు, రేచూరి వారు, పోతుల వారు, రేచర్ల వారు, పాలపర్తి వారు, సూర్నీడు, పెద్ద బాదరాజు, పేర్నీడు, గండుకన్న మనీడు, కన్నమనీడు మొదలైన వారంతా తీరి ఉన్నప్పుడు బ్రహ్మనాయుడు నాగమ్మ సవాలును, కోళ్ళ పందెం గురించి చెప్తాడు. సభలో వున్నవారంతా పందేనికి ‘సై’ అంటారు. కానీ, నాయకురాలి కోడిని గెల్వడానికి సరైన ‘పుంజు’ కావాలి. ‘ప్రథమ ఏకాదశి బందె మెప్పితిని పయనమై పోవలె పందె మార్పుటకు. పోరున గెల్చెడు పుంజునెట్లయిన వెదికి తేవలయు వేగంబె మీరు’ (పేజి 62 ‘పల్నాటి వీర చరిత్ర’) అని బ్రహ్మనాయుడంటాడు. అంటే గొప్పగా పందెం కాసివచ్చిన బ్రహ్మనాయుడి దగ్గర కోడే లేదు.
అపుడు బ్రహ్మనాయుడి అన్న పెద్దన బాదరాజు బ్రహ్మనాయునితో ‘నాగమ్మ కోడిని గెలవాలంటే మామూలు కోడి పనికి రాదు. మహిమ గల గొప్ప కోడి కావాలి. అలాంటి కోడి జాడ నేను చెప్తా. పానగల్లుపురం పడమటి దిక్కున శనైశ్వరుడను చెట్టు కింద చిత్రమైన కోడిని నేను చూశాను. దాని పేరు చిట్టి మల్లుడు. దాన్ని తెప్పించు’ అంటాడు.
దాంతో వీర పడవాలు అనే వాడు సాయుధుడై, కొద్ది సైన్య సమేతుడై మాచెర్ల నుండి బయల్దేరి, కృష్ణ ఎగువకు పోయి, ‘చి దగ్గర (చిట్యాల) కృష్ణను దాటి, పరుగు పరుగున పానగల్లు చేరుతాడు. (పేజి 63 ‘పల్నాటి వీర చరిత్ర’) అక్కడ కాపలా ఉన్నవారు ‘ఎవరు మీరు? ఎందుకొస్తున్నారు? ఇక్కడి నుండి వెళ్ళిపోండి. లేకుంటే ప్రాణాలు దక్కవని’ హెచ్చరిస్తారు.
దానికి వీర పడవాలు పెద్దగా నవ్వి ‘పల్నాటి వారితో పందేపూందుకు? మమ్మల్ని ఎదిరించి, నిల్చి, గెల్చిన వారెవరూ లేరు’ అంటూ వారిపై బడి వారిని చంపి పెద్దన బాదరాజు చెప్పిన పానగల్లు పడమటి పొలిమేరలో ఉన్న రావిచెట్టు దగ్గరకు చేరి, చెట్టుపై మంత్రాక్షతలు చల్లి ‘చిట్టి మల్లు రా’ అని కోడిని పిలుస్తాడు. చిట్టి మల్లు మెడ సారించి, ‘కొక్కరో కో’ అంటూ భీకరంగా అరుస్తూ రాతిచట్టును (పరుపు బండ) పగుల కొట్టుకుంటూ వచ్చి వీర పడవాలు భుజంపై వాలుతుంది. పడవాలు దాన్ని నిమిరి, చంకలో పెట్టుకొని, పానగల్లు పురవీధుల నుండి పరుగెడుతుంటే రాజభటులు అడ్డగిస్తారు. పడవాలు రాజభటులను చంపి, మళ్ళీ చిట్టేల రేవు దగ్గర కృష్ణను దాటి మహదేవి చెర్ల (మాచెర్ల) చేరి, కోడి పుంజు చిట్టి మల్లున్ని బ్రహ్మనాయునికి ఇస్తాడు.
బ్రహ్మనాయుడు ‘చిట్టి మల్లు’ అదే మన పానగల్లు నుండి దొంగిలించుకెళ్ళిన కోడి పుంజును ప్రేమతో చంకలో పెట్టుకొని, దాని ఈకలు ప్రేమతో నిమురుతూ ‘చిట్టి మల్లా! నాయకురాలి కోడిని నువ్వు గెలవాలి. మేమంతా నీ మీదే ఆశలు, నమ్మకం పెట్టుకున్నాం! ఏదీ ఒకసారి మనకి జయం చేకూరాలని ఎలుగెత్తి చాటు’ అంటాడు.
వెంటనే చిట్టి మల్లు దిక్కులు పిక్కటిల్లేటట్టు ‘కొక్కొరోకో’ అన్నది. మలిదేవరాజు ‘భూమండలంలో ఇలాంటి కోడిని ఎక్కడా చూడలే’దంటాడు. బ్రహ్మన్న రెట్టించిన ఉత్సాహంతో మరొకసారి కూయమంటాడు. కానీ, ఈసారీ చిట్టిమల్లు అతిహీన స్వరంతో ‘కొ..క్కొ..రొ..కో’ అంటది. దాంతో బ్రహ్మన్న ఆశ్చర్యపడగా, శకునజ్ఞులు, ‘ఈ కోడి మొదటిసారి మాత్రమే పందెం గెలుస్తుందని, మారు పందెంలో ఓడిపోతుందని చెప్తారు. అయినా, లెక్క చేయక బ్రహ్మన్న దాంతోనే పందేనికి పోతాడు.
మొదటి పోరులో పానగల్లు చిట్టి మల్లు గెలుస్తుంది. మారు పందెంలో ఓడి చనిపోతుంది. ఆ తర్వాత పల్నాటి యుద్ధంలో అనేక మలుపులు, బ్రహ్మనాయుడు అండ్ కోలు ఓడిపోవడం, నాయకులు గెలిచి, నలగాముడే పల్నాటి రాజు కావడం జరిగింది. ఓడిన బ్రహ్మనాయుడు గొప్పగా ధీరోదాత్తుడుగా, దైవాంశ సంభూతుడుగా కీర్తింపబడటం, బ్రహ్మన్నను ఎదిరించి, నిల్చి, గెల్చిన నాగమ్మ కుట్రదారుగా, కపటిగా, నెగెటివ్ పాత్రగా చరివూతలో నిల్చిపోవడం జరిగింది. (ఇదంతా వేరే విషయం.)
పై విషయాలు గమనిస్తే ‘బహ్మనాయుడి పోరుకోడిది మన పానగల్లు. అది నల్లగొండ జిల్లా పానగల్లులో దొంగిలించబడ్డది అనడం అసత్యం కాదు. ఇదంత విన్ననూ చరిత్ర సంఘ సభ్యుడు డా॥ వెంక ‘‘అసలు పానగల్లు దాకావచ్చి కోడిని దొంగిలించాల్సిన అవసరం బ్రహ్మనాయుడికే మొచ్చింది? మాచెర్ల చుట్టు పక్కల కోళ్ళే లేవా?’’ అన్నాడు. దీనికి సమాధానం మనకి ఇతర గ్రంథాల్లో దొరుకుతుంది.
‘నాయకురాలి కోడిని గెలవాలంటే అత్యంత బలమైన కోడి కావాలి. అది పానగల్లులో ఉందని’ బాదరాజు బ్రహ్మనాయుడితో అనడం ఒక కారణమైతే, మాచెర్ల చుట్టు పక్కల గ్రామాల్లో కోళ్ళనన్నింటినీ నాయకురాలు ముందుగా కొనుగోలు చేసి పెట్టి బ్రహ్మనాయుడుకి కోడి దొరకకుండా చేసినట్లు ఇతర గ్రంథాల్లో చిత్రీకరించారు.
‘‘అసలు ఆ పానగుల్లు మీ నల్లగొండ పానగల్లేనా?’’ అని మరో మిత్రుడి అనుమానం. (తెలంగాణ గొప్పదనం చేప్తే చాలామందికి అనుమానాలు సహజం! అసహనం కూడా అత్యంత సహజం.) నిజమే! మన రాష్ట్రంలో పానగల్లు లేక పానగల్లులు చాలా ఉన్నాయి. ఉత్తర తీరాంవూధలో ఒక పానగల్లుంది. ఆ పానగల్లు రాజావారు ఆంధ్ర విశ్వకళా పరిషత్ స్థాపన, నిర్వహణలో ప్రముఖ పాత్ర వహించారు.
మహబూబ్‌నగర్‌లో మరో పానగల్లు ఉంది. కథా రంగం పల్నాడు ప్రాంతం కృష్ణ దాటడం. కాబట్టి తీరాంధ్ర పానగల్లు కావడానికి ఆస్కారమే లేదు. ‘పల్నాటి వీర చరిత్ర’ ప్రకారం వీర పడవాలు కోడి కోసం మాచెర్ల నుండి బయల్దేరి కృష్ణా నదిని ‘చి దగ్గర దాటాడు. ఈ చిట్టేల మన నల్లగొండ జిల్లాలోని కృష్ణా తీర ప్రాంత రేవు పట్టణం. చిట్టేల, ముది మాణిక్యాలు 19వ శతాబ్ది దాకా రవాణా రేవులుగా నల్లగొండ జిల్లాలో ప్రముఖంగా ఉపయోగింపబడినట్లుగా ఇంగ్లీషు వారి రికార్డుల్లో ఉన్నాయని డా॥ రామచంవూదాడ్డి, డా॥ మనోహర్‌లు తమ ‘తెలంగాణ ఇన్ 19 సెంచురీ’ పుస్తకంలో పేర్కొన్నారు. కాబట్టి, ఆ పానగల్లు మన పానగల్లే! నల్లగొండ జిల్లా పానగల్లే!! (పోతన ఒంటిమిట్ట పంచాయితీ లాంటిది గాదు.)
ఈ కోడిని గురించి ముదిగొండ వీరభవూదకవి తన ‘పల్నాటి వీరభాగవతం’లో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు రాశాడు. ‘గౌతమ ముని శాపం వల్ల ముగ్గురు దొంగలు కోడి గుడ్లుగా మారి అడవిలో పడతారట. (ఈ గౌతముడే అహల్యను రాయిగా మార్చినవాడు. ఇప్పుడు దొంగల్ని కోడిగుడ్లుగా మార్చాడు.) ఒక ఆటవిక చెంచురాజు వీటిని తన ఇంటికి తీస్కొని పోయి పొదగేస్తాడు. అందులో ఒక గుడ్డు నుండి వచ్చిందే ‘చిట్టిమల్లు’ అనే కోడి. మరొక గుడ్డు నుండి వచ్చినవాడే మందాడి రాజైన బాలగోపన్న. ఒకసారి అడవిలో వేటకి వచ్చిన 66 మంది రాజకుమారులు చిట్టిమల్లుని చూసి వేటాడబోయారు. దాంతో కోపం వచ్చిన కోడి ‘చిట్టిమల్లు’ వారందరినీ భయంకరంగా హతమార్చింది. ఇది చూసిన చెంచురాజు చిట్టిమల్లు అంటేనే భయం పుట్టి అడవిలో ఒక చెట్టు తొర్రలో దాచేస్తాడు. చిట్టిమల్లు ఆ తొఱ్ఱలో నుండి భూసొరంగం తవ్వుకుంటూ వచ్చి పానగల్లులో చెట్టు కింద ఒక రాతి చట్టు కింద నివాసం ఏర్పరచుకుంటుందన్నది కథనం.
‘అసలు పానగల్లులో ఇంత బ్రహాండమైన కోడి ఉన్నదని బ్రహ్మన్నకి చెప్పిన బాదరాజు పెద్దనకు ఈ విషయం ఎట్లా తెలుసు?’ అన్న సంశయానికి సమాధానం రోఘిర్ రాసిన ‘ఎపిక్ ఆఫ్ పల్నాడు’లో దొరుకుతుంది. పాశ్చాత్యుడైన రోఘిర్ వేల్చూరి నారాయణరావుగారి సూచన మేరకు ‘పల్నాటి వీర చరివూత’పై చాలా కృషి చేశాడు. పల్నాడు ప్రాంతమంతా తిరిగి వీర విద్యావంతుడైన గాలయ్యతో ‘పల్నాటి వీర చరిత్ర’ గానం చేయించుకొని, ‘ఎపిక్ ఆఫ్ పల్నాడు’గా వెలువరించాడు. మన పానగల్లుకి కూడా వచ్చి, ‘నాళం వారి చెల్కలో ఈ చట్టు ఉండేదని’ రాశాడు. ఆయన రాసిన దాని ప్రకారం పెద్దన బాదరాజు వెలమ కులంలో పుట్టి క్షత్రియులచే పెంచబడ్డాడు. అతడి భార్య పేరు ముత్యాల కొమ్మ. అతడి గుఱ్ఱం పేరు కారు బొల్లడు. ఇది దేవతా గుర్రం. అనేక యుద్ధాల్లో గెలిచిన పెద్దన బాదరాజు తన భార్య ముత్యాల కొమ్మతో కారు బొల్లడి నెక్కి తమ సొంత నగరమైన పాలమాచాపురికి తిరిగిపోతూ చీకటి పడే వేళకి పానగల్లుకి చేరతాడు. రాత్రి బస పానగల్లులో చేయదలచి పెద్ద చట్టు (stone slab) మీద ముత్యాల కొమ్మ కూర్చుంటే, ఆమె కుడితొడపై తల మోపి విశ్రమిస్తాడు.
పక్కనే దివ్య శక్తులున్న కారు బొల్లడు ఆ రాతి చెట్టుపై గిట్టలతో ‘ఫటాఫటా’ కొడుతుంది. సరిగ్గా అదే రాతి చట్టు కింద ఉన్న మన చిట్టిమల్లు, ‘‘ఎవరది? నా నెత్తి మీద అలా బాదుతున్నారు. నేను బైటికి వస్తే మీ ప్రాణాలు దక్కవు’’ అని అరుస్తుంది. అప్పుడా గుఱ్ఱం, ‘‘నేను బాదరాజు గుర్రాన్ని. పేరు కారుబొల్లడు. మీరెవరు? అంత భీకరంగా అరుస్తున్నారు?’’ అన్నది. ‘‘నా పేరు చిట్టిమల్లు! అటనాల చిట్టిమల్లుడు. నేను 66 మంది రాజుల్ని సంహరించిన వాణ్ణి! బైటకి వస్తే నిన్ను కూడా సంహరించగలను’’ అని కోడి సమాధానమిచ్చింది. మగత నిద్రలో ఉన్న బాదరాజు పెద్దన ఇదంతా విని మిన్నకుండి మర్నాడు ఉదయం పాలమాబాపురికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఇదుగో, ఈ విధంగా పెద్దనకి మన పానగల్లు కోడి జాడ తెల్సింది. అదే విషయం బ్రహ్మనాయుడికి చెప్పాడు.
పానగల్లు రాతిచట్టు కోడి గురించి ‘పండితారాధ్య చరివూతం’లో మరొక ఆసక్తికరమైన కథ కన్పిస్తుంది. 12వ శతాబ్ది కాలంలో పానగల్లుని ఉదయన రాజు పరిపాలిస్తున్నాడు. జైనుడైన ఉదయనుడు పెట్టే క్రూర చిత్రహింసలు భరించలేక నామయ్య అనే వీరశైవ మతస్తుడు ఆత్మహత్య చేసుకుంటాడని, ఆ తర్వాత మల్లికార్జున పండితారాధ్యుడు ఉదయన రాజుని, పానగల్లును శపిస్తూ ‘‘కాదింకనీ పానుగంటి పురమ్మున నుండుగను…’’ అంటూ ‘‘కల్‌కోడి హోయగా, కల్ పొన్న పూయగా పానుగల్లు నాశన మౌతుందని’’ శపిస్తాడు. నిజానికి 13వ శతాబ్ది తర్వాత పానుగల్లు ప్రాముఖ్యం తగ్గిందనే చెప్పాలి.
చరివూతకారుల అభివూపాయంలో పల్నాటి యుద్ధం క్రీ.శ.110-1195 మధ్య కాలంలో జరిగింది. అప్పటికి తెలంగాణ ఉద్యమం లేదు. కానీ, తెలంగాణ ప్రాంతం ఉంది, ప్రజలు ఉన్నారు. అద్భుతమైన ఆవాసాలు, నగరాలు, వ్యవసాయం ఉన్నాయి. పల్నాటి యుద్ధకాలానికి పల్నాటి ప్రదేశం పూర్తిగా మెట్ట ప్రాంతం. వర్షాభావ ప్రాంతం. జొన్నలు, రాగులు వంటివి ముఖ్య పంటలు. అదే సమయంలో కృష్ణకు ఉత్తరాన ఉన్న నల్లగొండ, తెలంగాణ ప్రాంతం సుసంపన్న క్షేత్రం. ‘కోతలకి సిద్ధంగా ఉండి, తలలు వేలాడేసిన వరి మళ్ళు బంగారం కరిగించి పోసిన అచ్చుల్లా’ ఉన్నాయని అప్పటి శాసనాల్లో వర్ణించబడ్డది. వ్యవసాయం సుసంపన్నమైతే బలవర్ధకమైన పశు సంపద ఉంటుంది. బహుశా అలా బలమైనదే మన చిట్టిమల్లు పానుగల్లు కోడి.
~ డి.సూర్యకుమార్
No comments:
Post a Comment