Wednesday, 26 November 2014

రక్తాక్షర చరిత్ర పల్నాటి యుద్ధం



రక్తాక్షర చరిత్ర పల్నాటి యుద్ధం

పల్నాటి యుద్ధంలో ముఖ్య భూమిక పోషించిన బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ ఇరువురు ఇరు రాజ్యాల్లో మంత్రులే. బ్రహ్మనాయుడు మాచర్లను పాలించిన మలిదేవరాజు వద్ద, గురజాలను పాలించిన నలగాముని వద్ద నాగ మ్మ మంత్రులుగా పనిచేశారు. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి మహిళా మంత్రి నాగమ్మే కావటం గమనార్హం.

యుద్ధానికి దారి తీసిన పరిస్థితులు
బ్రహ్మనాయుడు వైష్ణవ సంభూతుడు. నాగమ్మ శివ భక్తురాలు. అనాదిగా శివ , వైష్ణవుల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. ఎవరి మత ప్రచారం వారు చేసుకున్నా ఆధిపత్య పోరు వెంటాడుతూనే ఉంది. బ్రహ్మనాయుడు కారంపూడి , మార్కాపురం, మాచర్లలో చెన్నకేశవ ఆలయాలను నిర్మించి తన విష్ణుభక్తిని చాటుకున్నాడు. నాగమ్మ శివ క్షేత్రాలను నిర్మించి తన శైలిని వెలిబుచ్చింది.

బ్రహ్మనాయుడు దళితులకు ఆశ్రయం కల్పించి దేవాలయాల ప్రవేశం గావించాడు. చాపకూటితో సహపంక్తి భోజనాలను ఏర్పాటుచేశాడు. మాల కన్నమదాసును దత్తత పొంది మాచర్ల రాజ్యానికి సర్వసైన్యాధ్యక్షుడిగా చేసి అశేష జన నీరాజనాలను అందుకున్నాడు. ఈ పరిస్థితిని నాగమ్మ సహించలేకపోయింది. అగ్రవర్ణాలలో అధిక భాగం నాగమ్మ చెంతన చేరటంతో కుట్రలకు, కుయుక్తులకు తెరలేచింది.

గెలిచినా 'కోడిపోరులో' ఓడిన బ్రహ్మన్న
కోడిపోరులో పాల్గొనేందుకని బ్రహ్మనాయుడు మాచర్ల నుండి తన ప్రముఖులతో కలిసి కోడేరుగుట్టల వద్దకు ( ప్రస్తుతం ఈ ప్రాంతం రెంటచింతల మండలంలోని పాల్వాయి వద్ద ఉన్నది) చేరుకుంటాడు. పోరులో పాల్గొనటానికి చిట్టెమల్లు అనబడే కోడిని తీసుకొని బ్రహ్మనాయుడు అక్కడకు వస్తారు. ఆ ప్రదేశానికి చేరుకోగానే బ్రహ్మనాయుడు చేతుల్లోని చిట్టెమల్లు పెద్దగా కూత కూయటంతో ఆ కూత శబ్దానికి దరిదాపుల్లోని కోళ్లన్నీ చనిపోయినట్లుగా చరిత్ర చెబుతుంది. నాగమ్మ కూడా సివంగిడేగ అను పేరుగల కోడిని తెప్పించి పందానికి సిద్ధమయ్యింది.

ఒకవేళ ఏదన్నా అద్భుతం జరిగి తను ఓడిపోయిన పక్షంలో బ్రహ్మనాయుడిని, అతనితో వచ్చిన వారిని అంతమొందించేందుకు కూడా నాగమ్మ కుట్ర పన్నినట్లుగా చెబుతారు. కోడిపోరు జరిగే ప్రదేశంలో ఒక తమకము తవ్వించి అందులో బల్లాలు, శూలాలు, విచ్చు కత్తులు ఉంచి పైన పందిరి ఏర్పాటుచేసి దానిపై వేదిక అమర్చినట్లుగా చెబుతారు. ఆ వేదికపై బ్రహ్మనాయుడిని, అతనితోపాటు వచ్చిన ప్రముఖులను కూర్చుండబెట్టి హతమార్చవచ్చునన్న ఆలోచనతో నాగమ్మ వ్యూహరచన చేశారు. కోడిపోరు ఆరంభం కాగా మొదటి రెండు పందాల్లోనూ బ్రహ్మనాయుడు తీసుకువచ్చిన చిట్టెమల్లు గెలవటంతో బ్రహ్మనాయుడు వర్గం ఆనందంతో ఈలలు, కేకలతో ఉత్సాహభరితంగా ఉంటుంది.

ఈ పరిణామంతో గురజాల రాజ్యానికి చెందిన వారి ముఖాన నెత్తుటి చుక్క ఉండదు. అయినప్పటికీ నిరుత్సాహాన్ని ఏ మాత్రం తన కళ్లలో కనపడనీయకుండా జాగ్రత్తపడిన నాగమ్మ బ్రహ్మనాయుడు వద్దకు వచ్చి మూడవ పందెం పెట్టేందుకు సిద్ధపడమని ప్రోత్సహిస్తుంది. మూడవ పందెంలో ఓడిన వారు రాజ్యాన్ని వదలి ఏడేళ్ల పాటు వనవాసం చేయాలని షరతు విధిస్తుంది.

అయితే అప్పటికే విజయోత్సాహంలో ఉన్న బ్రహ్మన్న చిట్టెమల్లుపై ఉన్న విశ్వాసంతో పందానికి సరేనని ఒప్పుకుంటాడు. అయితే అప్పటికే చిట్టెమల్లును కట్టడి చేసేందుకు మంత్రతంత్రగాడైన కట్టుపోతుల వాడిని రంగంలోకి దింపిన నాగమ్మ బ్రహ్మనాయుడు దృష్టి మరల్చేందుకు కుంకుడుకాయ రసాన్ని చీరపై పోసుకొని బహిష్టయినట్లుగా నాటకమాడుతుంది. విష్ణుసంభూతుడైన బ్రహ్మనాయుడు బహిష్టయిన ఆడవారి ముఖాన్ని చూడకూడదన్న నియమం ఉన్నందున దృష్టిని పక్కకు మరల్చుతాడు. దాంతో చిట్టెమల్లుపై కట్టుపోతుల వారు మంత్రాక్షతలు ప్రయోగించటంతో నాగమ్మ సివంగిడేగ విజయం సాధిస్తుంది.

రాజ్యం అప్పగించని నాగమ్మ
కోడిపోరులో ఓడిపోయిన బ్రహ్మనాయుడు, మలిదేవులతో కలిసి ఏడేళ్లు అరణ్యవాసంకు వెళతారు. నాగమ్మ మాచర్ల రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటుంది. నిర్ధేశిత ఏడు సంవత్సరాలు అరణ్యవాసం పూర్తయిన పిమ్మట తన రాజ్యం తనకిమ్మని బ్రహ్మనాయుడు చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చి దూతగా వచ్చిన నలగాముని అల్లుడైన అలరాజును చర్లగుడిపాడు వద్ద రహస్యంగా చంపిస్తుంది నాగమ్మ. ధర్మబద్దంగా తమకు రావలసిన రాజ్యభాగం కోసం పోరాడవలసిన సమయం ఆసన్నమైనదని బ్రహ్మన్నవర్గం తలచింది. పల్నాటి యుద్ధం అనివార్యమైంది.

కారంపూడే కదనరంగం
దాయాదుల రాజ్యభాగం తిరిగి ఇవ్వటానికి నలగాముడు తిరస్కరించటంతో పల్నాటి యుద్ధానికి ఇరువర్గాలు సన్నద్ధమయ్యాయి. పలనాటి రణక్షేత్రంగా సుప్రసిద్ధమైన కారంపూడిని ఎంచుకున్నారు. బ్రహ్మనాయుడు సేనలను మాచర్ల వరకు రానివ్వకుండా ముందుగానే అడ్డుకునేందుకు కారంపూడి పాలిస్తున్న తన సామంతరాజును నాగమ్మ ఎంచుకుంది. కారంపూడిలోనే బ్రహ్మనాయుడిని అంతమొందిస్తానని నాగమ్మ వద్ద ఆ సామంతరాజు మంతనాలు జరిపాడు. పల్నాడు నైసర్గిక స్వరూపాన్ని పరిశీలిస్తే నాగరికల్లు నుంచి ఈశాన్యాన ధరణికోట, దక్షిణాన నాయకురాలు కనుమ, పశ్చిమోత్తరాలుగా ప్రవహిస్తున్న కృష్ణానది , నాగార్జున కొండ లోయలోని విజయపురి వరకు వ్యాపించి ఉంది.

మేడపి నుంచి వచ్చే బ్రహ్మన్న సైన్యాన్ని, గురజాల నుంచి వచ్చే నాగమ్మ సైన్యానికి మధ్యలో కారంపూడి రణక్షేత్రంగా నిర్మించటం ఉభయులకు ఆమోదయోగ్యమని యుద్ధ పరిశీలకులు వెలిబుచ్చారు. అత్యంత పవిత్రమైన మహిమాన్విత గంగధార మడుగు ( కాశీలోని మణికర్ణికానదితో సమానమైనది ) ఒడ్డును యుద్ధభూమిగా నిర్ణయం కావటం, తను నిర్మించిన చెన్నకేశవ ఆలయం, తన విజయాన్ని కాంక్షించే అంకాళమ్మ తల్లి కారంపూడిలో కొలువై ఉండటం బ్రహ్మనాయుడుకి అనుకూలించే అంశాలు కావటంతో యుద్ధభూమి కారంపూడి ఎన్నుకోవటానికి ముందుగా సుముఖత వ్యక్తంచేశారు.

నాయకురాలు నాగమ్మ పరంగా చూస్తే ఆనాడు కార్యమపూడి పరిసర పరగణాలన్నీ గురజాల నలగామరాజు అధీనంలోనే ఉన్నాయి. చుట్టుపక్కల ఉన్న మండలాధీశులు, సామంతరాజులందరూ అనుకూలంగా ఉండటం నాగమ్మ కారంపూడి వైపే మొగ్గుచూపింది. ప్రత్యేకంగా కారంపూడిని పాలిస్తున్న సామంతరాజు తనకు అత్యంత అనుకూలుడైన ఆప్తుడు కావటంతో నాగమ్మ అంగీకారానికి కలిసొచ్చే అంశమైంది. ఈవిధంగా ఇరువర్గాలు తమ అనుకూల వాతావరణంలోనే కారంపూడిని రణక్షేత్రంగా నిర్ణయించుకొని పలనాటి యుద్ధానికి నాగులేటి ఒడ్డునే శ్రీకారం చుట్టారు. దీంతో చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిన కథనసీమ కారంపూడి వాసికెక్కింది.

బ్రహ్మనాయుడు ఆశయం నెరవేరిందా ?
పల్నాటిలో సర్వమత సమానత్వం తేవాలనే బ్రహ్మనాయుడి ఆశయం పూర్తిస్థాయిలో నెరవేరక ముందే యుద్ధం ముగిసింది. యుద్ధంలో చనిపోయిన 66మంది వీర నాయకులకు లింగ ప్రతిష్టచేసి వీరారాధన ఉత్సవాలు జరిపించాలని పిడుగు వంశం వారిని వంశ పారంపార్యంగా ఏర్పరచి జరిగిన నెత్తుటి నేలను చూసి చలించి గుత్తికొండ బిలానికి తపస్సుకై వెళతాడు. వైష్ణవ సంభూతుడుగా పేరొందిన బ్రహ్మనాయుడుకు మరణం లేనందున ఇప్పటికీ గుత్తికొండ బిలం లోపలి గుహల్లో సజీవుడుగా ఉన్నాడని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు.

అత్యంత రాజ్యకాంక్షతో పల్నాటి యుద్ధానికి రంగంలోకి దిగిన నాగమ్మ యుద్ధానంతరం మనసు మార్చుకొని చేసిన తప్పిదం గుర్తించి ఆధ్యాత్మికంగా దిట్టగామాలపాడులోని శైవ క్షేత్రంలోకి పయనించింది. ఇలా జరిగిన పల్నాటి యుద్ధంలో మృతిచెందిన వీరుల ఆత్మలు కార్తీక అమావాస్యనుండి ఐదురోజుల పాటు కారంపూడిలోని మరుభూమిలో అదృశ్యంగా విలపిస్తుంటాయని చరిత్ర తెలుపుతుంది.

అందుకే బ్రహ్మనాయుడు కోరిక మేరకు కార్తీక అమావాస్య నుంచి ఐదురోజుల పాటు రాచగావు, రాయభారం, మందపోరు, కోడిపోరు, కల్లిపాడు పేరుతో వీరారాధన ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం వీరాచారం పాటిస్తున్న 12 జిల్లాల వీరాచారవంతులు ఆనాటి కొణతములను ( ఆయుధాలను) నిధి మీదకు తీసుకువచ్చి పూజలు అందుకుంటారు. ప్రస్తుతం పిడుగువంశ వారసుడు తరుణ్‌ చెన్నకేశవ అయ్యవార్‌ పీఠాధిపతిగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వంశ పారంపర్యంగా వస్తున్న ఈ ఆధిపత్యం చిన్న వయసులోనే అందిపుచ్చుకోవటంతో నిర్వహణను విజయకుమార్‌ అయ్యవార్‌ పర్యవేక్షిస్తూ నిరాటంకంగా ఇప్పటికీ నిర్వహిస్తుండటం గమనార్హం.

No comments:

Post a Comment