Wednesday, 26 November 2014

పసిడి పల్నాడు....వై.హెచ్‌.కె. వెూహన్‌రావు

పసిడి పల్నాడు
ప: శ్వేత వర్ణపు గర్భ
శౌర్య కథలకు దొడ్డ
పల్లెసీమలనేలు పలనాడు
పాడిపంటల మేలు వెలనాడు

చ: శిరము నాగార్జునము
సిగన నందికొండ
శిరసెత్తి ఆడితే చంద్రవంక
చినబోయి నిలిచేను నెలవంక

చ: ఎత్తిపోతల ఎగువ
నాగులేరే దిగువ
నాజూకు కృష్ణమ్మ నడుము సింగారమై
నడిచింది నాతల్లి కొంగు బంగారమై

చ: దైద శ్రీ లింగన్న
అమ్మ అంకాళమ్మ
ఆశీస్సులందించగా, చరితకే
చుక్కాని అయ్యిందిరో!

చ: ఆర్య నాగార్జునుని
కార్య సాధనలోన
బుద్ధమే విలసిల్లెను! ఈ నేల
గణిత జ్యోతులు వెలిగెను

చ: నారీలోకపు భేరి
నాయకీ నాగమ్మ
విశ్వాస తొలిమంత్రిణి! మగువలకు
మరువని మంత్రాక్షరి

చ: కన్నెగంటి హనుమంతు
కదిలివచ్చే కడలి
తెల్లగుండెలు అదిరెను! ఆ తెగువ

తెల్లగుండ్లకు వొరిగెను

చ: స్వాతంత్ర సమరాన
దిట్ట మట్టపల్లి
పల్నాటి గాంధీ అతడే! ఈ సీమ
వెలనాటి వెలుగాయలే

చ: ఉమ్మడి కమ్యూనిస్టు
ఉద్యమాలను నాటి
అరుణ కాంతులు విరియబూసింది
ఎఱ్ఱజెండనే ఎగురవేసింది

చ: పౌరుషాలకు కోట
ప్రేమ విరిసినతోట
ప్రాణాల నొడ్డిందిరో! పలనాడు
త్యాగల పుట్టిల్లురో!
వై.హెచ్‌.కె. వెూహన్‌రావు 

No comments:

Post a Comment