Showing posts with label సిద్దేశ్వర స్వామి ఆలయం. Show all posts
Showing posts with label సిద్దేశ్వర స్వామి ఆలయం. Show all posts

Saturday, 12 November 2016

తేరాల సిద్దేశ్వరస్వామి ( Sidheswara Swamy, Terala )

తేరాల సిద్దేశ్వరస్వామి ( Sidheswara Swamy, Terala )



దుర్గి  మండలంలోని తేరాల గ్రామంలో  భ్రమరాంబ సమేత సిద్దేశ్వర స్వామి ఆలయం ఉంది.      కోరిన కోర్కెలు తీర్చే చల్లని దైవంగా ప్రసిద్ధి చెందిన సిద్దేశ్వరస్వామి ఆలయానికి ఎంతో పురాతన చరిత్ర ఉంది. గంగవల్లి, మల్నాయుడు, నవీననాయుడు, దేవ ర్నాయుడు, సోమనాధ దేవరరాజదీ షులు ఈ ఆలయాన్ని క్రీశ 675 సంవత్సరంలో భాద్రపద బహుళ సూర్యగ్రహణ కాలంలో నిర్మించినట్లు ఇక్కడి శిలాశాసనంలో ఉంది.





పరుశు రాముడు ఈ ఆలయ ప్రాంతంలో తపస్సు చేసి ఇక్కడ గుడి కట్టించాలని సంకల్పం చేశాడు. శివలింగం కోసం వెళ్ళి వచ్చే లోపే సాక్షాత్తు పరమేశ్వ రుడే ఇక్కడ లింగరూపంలో ఆవిర్భివిం చాడని స్ధల పురాణం చెబుతుంది. అంతట పరుశురాముడు శివుడే స్వయం భూ అయిన వైనాన్ని తలుచు కొని ఇది దైవ సంకల్పమని భావించి, పక్కనే తాను తెచ్చిన లింగాకారాన్ని కూడా ప్రతిష్టించి పూజలు చేశాడు. ఇప్పటికీ ఈ ప్రాంత ప్రజలు ఈ దేవా లయంలో శివలింగాలలో ఒక దానిని పుట్టుడు లింగమని, మరొక దానిని పెట్టుడు లింగమని చెప్పుకుంటారు. ఆలయానికి తూర్పు దిశగా వాయు లింగేశ్వరస్వామి, పడమర దిశగా రుద్ర గుండం, దక్షణ దిక్కున తేరాల గ్రామం, ఉత్తరం గో గర్భం అనుస్ధాన గుండం ఉన్నాయి. ప్రస్తుతం తేరాలగా పిలవబడుతున్న పూర్వం బ్రాహ్మణ అగ్రహారంగా పిలుస్తారు. ఇక్కడి బ్రహ్మాణులు నలంద, తక్షశిల వంటి ప్రసిద్ధి పొందిన విశ్వవిద్యాలయాలలో ఆచార్యులుగా పనిచేసినట్లు ఇక్కడి శిలాఫలకం ద్వారా తెలుస్తొంది.



ఈ దేవాలయానికి ఎదురుగా కోనేరు ఉంది. ప్రకృతి సిద్దంగా నీరు ఊరి ప్రవహించే ఐదు బుగ్గలు కలసిన జలం ఈ కోనేరులోకి ఉబికి రావటం విశేషం. ఇది విబూది కోనేరుగా ప్రసిద్ది చెందింది. కోనేరు అడుగు బాగంలో సుద్దతో తయారైన విబూది ఉండలు సహజ సిద్దంగా ఏర్పడుతుంటాయి. ఈ విబూది వుండలను భక్తులు పరమ పవిత్రం భావించి తీసుకెళ్తూ ఉండటం జరుగుతుంది. ఆలయానికి పక్కన గో గర్భము అను సన్నని మార్గముంది. ఈ మార్గమునకు పొడవు, వెడల్పు ఒక అడుగుకు మించి కూడా వుండదు. అయినప్పటికీ పవిత్రమైన మనస్సుతో శివుని స్మరిస్తూ ఎంతటి స్ధూలకాయు లైన ఈ మార్గం ద్వారా తేలికగా వెళ్ళి స్వామి వారిని దర్శించుకొని రావచ్చు. ఈ దారి గుండా దైవ దర్శననాకి వెళ్ళి వస్తే కోరిన కోర్కెలు తీరుతాయని, సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాబ విశ్వాసం.



మాచర్ల మండలం రాయవరం  గ్రామ ప్రజలు శ్రీ భ్రమ రాంబ దేవి విగ్రహాన్ని తీసుకొచ్చి సిద్దేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి ష్టించి ఇలవేల్పుగా కొలుస్తూ ప్రతి సం వత్సరం శివరాత్రి పర్వదినాన ఆమెకు పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు, తలంబ్రాలు తీసుకొని భజనలు, కోలా టాలతో గుడి వద్దకు చేరుకుంటారు. శివరాత్రి రోజు నిర్వమించే శ్రీ భ్రమ రాంబ సమేత సిద్దేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలకు పల్నాడు ప్రాంతం నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. 

Friday, 13 February 2015

తేరాల సిద్దేశ్వరస్వామి ( Sidheswara Swamy, Terala )

తేరాల సిద్దేశ్వరస్వామి
సాధారణంగా ఏ శైవ క్షేత్రంలోనైనా గర్భాలయంలో ఒకే శివలింగం దర్శనమిస్తుంది. చాలా అరుదుగా .. అక్కడి స్థలమహాత్మ్యాన్ని బట్టి రెండు శివలింగాలు కనిపిస్తూ ఉంటాయి. అలా రెండు ఉన్న శివలింగాలు ... ఒకదాని పక్కనే మరొకటిగా కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా ఒకే గర్భాలయంలో ఒక శివలింగం వెనుక మరొక శివలింగం ఉండటం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 

అలాంటి ఆశ్చర్యానికి గురిచేసే క్షేత్రం గుంటూరు జిల్లా దుర్గి మండలం పరిధిలో దర్శనమిస్తుంది. సిద్ధేశ్వరుడుగా స్వామివారు పూజలు అందుకునే ఈ క్షేత్రం, 'తేరాల' గ్రామానికి సమీపంలో అలరారుతోంది. ఇక్కడి గర్భాలయంలో రెండు శివలింగాలు ఒకదాని వెనుక మరొకటి కనిపిస్తూ పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాయి. ఈ రెండింటిలో ముందుగా కనుపించేది స్వయంభువు శివలింగమనీ, దాని వెనుక కనిపించేది పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగమని స్థలపురాణం చెబుతోంది.

క్షత్రియ సంహారం వలన కలిగిన పాపాల నుంచి విముక్తిని పొందడానికిగాను పరశురాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి వస్తాడు. ఆయన సంకల్పానికి తన అనుగ్రహాన్ని అందిస్తూ శివుడు స్వయంభువుగా ఆవిర్భవిస్తాడు. అందుకు ఆనందాన్ని వ్యక్తం చేసిన పరశురాముడు, తాను తీసుకు వచ్చిన శివలింగాన్ని దాని వెనుకన ప్రతిష్ఠిస్తాడు. ఈ కారణంగానే ఇక్కడి శివలింగాలు ఒకదాని వెనుక ఒకటిగా దర్శనమిస్తుంటాయి.

పాపాలను హరించడం కోసం పరమశివుడు స్వయంభువుగా ఆవిర్భవించాడు కనుక ఈ క్షేత్రం మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. అరుదైన క్షేత్రం కనుక కార్తీకమాసంలో ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శిస్తూ వుంటారు. ప్రశాంతతకు ప్రతీకగా కనిపించే ఈ క్షేత్రం వనభోజనాలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అందువలన భక్తులు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుని మరీ ఇక్కడికి వస్తుంటారు. స్వామి సన్నిధిలో ఆధ్యాత్మిక పరమైన అనుభూతిని సొంతం చేసుకుని వెళుతుంటారు.