Friday, 9 January 2015

Kanneganti Hanumanthu/ కన్నెగంటి హనుమంతు/

పుల్లరి ఉద్యమం - కన్నెగంటి హనుమంతు

కన్నెగంటి హనుమంతు కోర మీసము దువ్వి
పలనాటి ప్రజలచే పన్నులెగ గొట్టించె
బలి ఇచ్చె హనుమంతు నూ

పలనాడు! పర ప్రభుత్వము గుండ్లకు ! అని  పులుపుల శివయ్య అంటే..

మిణుగురులు లేచె బెడదవు
శౌర్యాగ్నిశిఖలు మాంచాలపురిన్
హనుమంతుడన వీరుడు

తెల్ల దొరల నేదిరించెన్. అని గుర్రం ఝాషువా అన్నారు.






 'పుల్లరి ఉద్యమం' తెలుసా..భారత స్వాతంత్ర్య ఉద్యమం..విద్యుత్ ఉద్యమం..తదితర ఉద్యమాలు తెలుసు..ఈ పుల్లరి ఉద్యమం ఏంటో అని ఆశ్చర్యపడుతున్నారా ? అయితే ఈ  పుల్లరి ఉద్యమం గురించి...
మించాలంపాడు...ఈ ప్రాంతం పేరు వింటే 'పుల్లరి ఉద్యమం' గుర్తుకొస్తుంది. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన వారిలో కన్నెగంటి హనుమంతు  పుట్టిన పురిటి గడ్డ. ఆయన నడిపిన ఉద్యమాలకు చూసి ఆనాటి తెల్లదొరలు గడగడలాడారు. ఆనాటి 'అడవి పుల్లరి' ఉద్యమం ఎందరికో స్పూర్తినిచ్చింది. 

కన్నెగంటి హనుమంతు జాతి జనుల విముక్తి కోసం తన లేలేత గుండె నెత్తుటిని తల్లి భారతి పాదాలకు పారాణిగా పూసిన నిష్కళంక దేశభక్తుడు, త్యాగధనుడు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం పై పిడికిలి బిగించిన తొలితరం వీర విప్లవ సేనాని కన్నెగంటి హనుమంతు .తన దేశ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు సాధించడం కోసం మృత్యువుకు కేవలం వెంట్రుక వాసిలో సంచరించిన సాహసి. తెలుగువారి ప్రతః స్మరణీయుడు కన్నెగంటి హనుమంతు. పల్నాడు సీమలో అరుణారుణ కాంతులతో ప్రభవించిన ప్రభాత సూర్యుడు కన్నెగంటి హనుమంతు 


గుంటూరు జిల్లా దుర్గి మండలం పరిధిలోని మించాల పాడు గ్రామంలో సామాన్య కాపు కుటుంబంలో వెంకటప్పయ్య, అచ్చమ్మ అనే పుణ్య దంపతులకు పుట్టిన అసమాన స్వాతంత్ర్య సమర యోధుడు కన్నెగంటి హనుమంతు . కన్నెగంటి హనుమంతు గాంధేయవాది. అహింసా మార్గాన స్వాతంత్ర్యం కోసం పోరాడిన దేశభక్తుడు.
పుల్లరి ఉద్యమం ఈ ప్రాంత ప్రత్యేకత... పల్నాడు సీమలో అడవుల్లో పుల్లలు ఏరుకోవడం పై, పసువులను మేపడం పై బ్రిటిష్ పాలకులు ఆంక్షలు విధించారు.పశువుకు రెండు రూపాయలు శిస్తుగా పుల్లరి కట్టాలని ఆదేశించారు. మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరనోధ్యమానికి ఉతేజితుడైన కన్నెగంటి హనుమంతు పుల్లరి ఆంక్షలను తీవ్రంగా వ్యతిరేకించాడు. అత్యంత శక్తివంతమైన బ్రిటిష్ పాలనా వ్యవస్థ పై తన ధిక్కార స్వరం వినిపించాడు. ``ఈ చెట్టు నువ్వు పెట్టావా ? విత్తు నువ్వు పెట్టావా? నారు నువ్వు పోశావా? నీరు నువ్వు పెట్టావా? మా జీవగడ్డ పై నీకేక్కడి నుంచి వచ్చింది పెత్తనం? `` అనే పిడుగుల్లాంటి ప్రశ్నలతో కన్నెగంటి ఘర్జించాడు.``బ్రిటిష్ నిరంకుశ పాలనలో భారతీయులు అనుభావిస్తున్న అవస్థలను, అవమానాలను చూసి రగిలి పోయిన కన్నెగంటి హనుమంతు పోరుబాట పట్టాడు.అనేక మంది యువకులను కలుపుకొని ఒక దండుగా కదిలాడు. తెల్లవారి పై దండయాత్ర చేసాడు. ఉడుకు రక్తం యువకులు ఆయన వెంట నడిచారు. పెద్దతరం నిండు మనసుతో కన్నెగంటి నాయకత్వాన్ని అంగీకరించారు. ఆశీర్వదించారు. మహిళలు, వృద్దులు నైతిక మద్దతు ఇచ్చారు. పలనాడు సీమలో కన్నెగంటి ప్రతాపం ప్రారంభమైంది. బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడ గడ లాడించాడు.తెల్ల వారి సైన్యం తెల్ల మొఖం వేసింది. వారి కుయుక్తులు కన్నెగంటి సాహసం నిబద్దత ముందు తుత్తునీయలు అయ్యాయి. అయితే... బ్రిటిష్ జనరల్ టి. జి. రుదర్ ఫర్డ్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ వెర్నర్ కొంత మంది స్థానిక వంచకులను చేరదీసాడు. ఎప్పటికప్పుడు కన్నెగంటి కదలికలు తెలుసుకొని ఆయనను మట్టు బెట్టాలని ప్రయత్నాలు చేసాడు. తమ వీరబిడ్డడు కన్నెగంటిని ప్రజలే కాపాడు కొన్నారు. దాంతో బ్రిటిష్ జనరల్ టి. జి. రుదర్ ఫర్డ్ ఒక కుట్ర పన్నాడు. కన్నెగంటిని ప్రలోభాలతో లొంగ దీయాలని తలపోసాడు. కరణం ద్వారా వర్తమానం పంపాడు. దుర్గి ఫిర్కకు కన్నేగంటిని జమిందార్ గా చేస్తామన్నారు. ఇష్టం వచ్చినంత శిస్తు వసూలు చేసుకోవచ్చని ఆశ పెట్టారు. కానీ నిష్కళంక దేశభక్తుడైన కన్నెగంటి తాను తార్పుడు గాడిని కాననీ, నా తోటి భారతీయులను వంచించి నెత్తుటి కూడు తిననని తెగేసి చెప్పాడు. 1922 ఫిబ్రవరి 22 ఉదయం కొందరు అటవీ, రెవిన్యూ శాఖలకు చెందిన అధికారులు మించాల పాడు గ్రామానికి వచ్చి హనుమంతును కలిసి పుల్లరి కట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరించారు. ఆప్పటికే గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని విరమిస్తూ నిర్ణయం తీసుకొని వున్నారు కనుక పుల్లరి చెల్లించడానికి అభ్యంతరం లేదని కన్నెగంటి చెప్పారు. గ్రామస్తులందరి పుల్లరి కట్టడానికి తాను సిద్దంగా ఉన్నానని వారికీ చెప్పి పంపారు. అదే రోజు మధ్యాహ్నం మహాశివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకొని ముటుకూరు లింగం కోటయ్య అధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభ కోటప్ప కొండకు బయలుదేరింది . మించాల పాడు తోసహా చుట్టు పక్కల గ్రామాలలోని యువకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, కన్నెగంటి అనుచరులు, అభిమానులు కాంగ్రెస్ ప్రభతో కలసి వెళ్ళారు. గ్రామాల్లో మహిళలు, వృద్దులు మాత్రమే ఉన్నారు. అదే అదనుగా భావించిన బ్రిటిష్ సేనలు గ్రామాన్ని దిగ్భందం చేసాయి. పశువులను మందగా చేసి తోలుకు పోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అడ్డు వచ్చిన వారిని తుపాకి మడమలతో కొట్టి హింసించారు. విషయం తెలుసుకొని అధికారులతో మాట్లాడి పుల్లరి చెల్లించి రావడానికి కన్నెగంటి ఆ దిశగా వెళ్ళాడు. ఆగండి. ఎవరిని హింసించకండి. పుల్లరి చెల్లించడానికి మేము సిద్దం అని ఆయన సైగలు చేస్తున్నా వారు లక్ష్య పెట్టలేదు. కన్నెగంటి అతనే అని గుంటనక్క కరణం చుపించగానే ఎటువంటి మాటామంతి లేకుండా, ముందస్తు హెచ్చరిక లేకుండా కన్నెగంటిని బ్రిటిష్ సేనలు చుట్టు ముట్టాయి. శిస్తు కట్టడానికి మేము సిద్దం అని చెబుతున్నా వినకుండా కన్నెగంటిపై కాల్పులు జరిపారు. 26 తూటాలు కన్నెగంటి శరీరంలోకి దూసుకుపోయాయి. అయాన తోపాటే వున్న ఇంటి పాలేరు ఎల్లంపల్లి శేషయ్యను కూడా పాశవికంగా కాల్చి చంపారు. రక్ర్హం మడుగులలో పడి ఉన్న కన్నెగంటి చుట్టూ వలయంలా సేనలు నిలబడి గ్రామస్తులను దరిచేరనివ్వలేదు. కన్నెగంటి హాహాకారాలు చేస్తున్నా ఆసుపత్రికి తరలించ నివ్వలేదు. దాహం అని అరుస్తున్నా మంచి నీరు ఇవ్వలేదు. తమ ప్రియతమ నాయకుడికి గ్రామస్థులు మంచి నీరు ఇవ్వబోగా బ్రిటిష్ తొత్తులు అడ్డుకున్నారు. హనుమంతు భార్య గంగమ్మ తెచ్చిన నీటిని నేల పాల్జేశారు. ఈ దాష్టీకం సహించలేని గ్రామస్థులు కారం, బరిశలు, విల్లంబులతో తిరగబడ్డారు. కాని సర్కారు సేనల బలం ముందు నిలవలేక పోయారు. ఆ రాత్రంతా గ్రామం పైబడి దోచుకున్నారు.

సాయంకాలం 6 గంటలకు తుపాకి తూటాలకు గాయపడిన పల్నాడు సింహం కన్నెగంటి అర్థరాత్రి వరకు శక్తీ కూడదీసుకొని వందేమాతరం అని నినాదాలు చేస్తూనే ఉన్నాడు. అర్థరాత్రి దాటాక పల్నాటి వీరబిడ్డడు అమరుడయ్యాడు. పల్నాడు సీమలోని ప్రతి ఒక్కరు కన్నెగంటి మరణానికి కన్నీరు కార్చారు. కాక ఎక్కిపోయారు. ఆ మర్నాడు కోలగుంట్లలో హనుమంతు,మరో ఇద్దరి భౌతిక కాయాలను బ్రిటిష్ సేనలు పూడ్చి పెట్టి వెళ్ళాయి. ఇంతటి మహోన్నత సాహసం, పోరాటం కనబరచిన కన్నెగంటి హనుమంతు పేరును గుంటూరు జిల్లాకు పెట్టాలనే అభ్యర్ధన సర్వత్రా వినిపిస్తోంది. అదే ఆమేయమైన దేశ భక్తుడికీ, ఆయనను కన్న పురిటి గడ్డ గుంటూరుకి న్యాయం చేసినట్లవుతుందని ప్రజలు భావిస్తున్నారు. కన్నెగంటి కనబరచిన దేశభక్తిని విద్యార్థులకు బోధించాల్సి వుంది.కోలగుంట్ల లోని ఆయన సమాధిని వీరఘాట్ గా అభివృద్ధి పరచి విశేష ప్రాచుర్యం కల్పించవలసి ఉంది. ప్రతి ఏట కన్నెగంటి జయంతులు, వర్ధంతులు ప్రభుత్వ లాంచనాలతో జరిపించమని కోరుతున్నాము. గుంటూరు జిల్లాను కన్నెగంటి హనుమంతు జిల్లాగా పిలవడమే అంతటి స్వాతంత్ర్య సమర యోధుడికి, నిష్కళంక దేశభక్తుడు,, వీర విప్లవ వేగుచుక్కకి మనం ఇవ్వగల నిజమైన నివాళి.

No comments:

Post a Comment