Wednesday, 7 January 2015

కాంతులు చిందించే సంక్రాంతి





సంక్రాంతి... పేరులోనే ఉంది కాంతి. నిజంగా ఇది కాంతులొలికే పండుగ. సంబరాల పండుగ. వాకిట్లో రంగురంగుల రంగవల్లికలు, ఆకాశంలో అంతకంటే అందమైన గాలిపటాలతో మహా శోభాయమానమైన పండుగిది. ఇది ఒకరోజు పండుగ కాదు. నెలరోజులపాటు సంబరాలు చేసుకునే వైభవం. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఒకసారి విశేషాలు తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రంలో మేషం, వృషభం - ఇలా పన్నెండు రాశులున్నాయి. సూర్యుడు ఒక్కో నెలలొ ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు మేషరాశిలో సూర్యుడు ప్రవేశిస్తే అది మేష సంక్రమణం. అలా ఏ రాశిలో సంచరిస్తే ఆ రాశి సంక్రమణంగా వ్యవహరిస్తారు. సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించింది మొదలు మకరరాశిలో ప్రవేశించడంవరకూ సంక్రాంతి పండుగ దినాలు. మకర రాశిలో ప్రవేశించిన రోజు మకర సంక్రాంతి. అప్పటివరకూ దక్షిణాయనంలో సంచరిస్తోన్న సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించిన పుణ్యదినం కూడా ఇది.
మకర సంక్రాంతికి ముందురోజు ''భోగి''. భోగి అంటే గోదాదేవి, శ్రీరంగనాథుని సేవించి కల్యాణ భోగం అనుభవించిన రోజు. మకర సంక్రాంతిలాగే భోగి కూడా పెద్ద పండుగే. ఆవేళ ఉదయాన్నే లేచి ''భోగిమంటలు'' వేస్తారు. భోగిమంటల్లో సూక్ష్మక్రిములను నశింపచేసే పిడకలు, విరిగిపోయి ఇళ్ళలో అడ్డంగా అనిపించే చెక్క సామాను, ఔషధప్రాయమైన వేప తదితర కలపతో వేస్తారు. ఇవి కేవలం చలి కాచుకోడానికే గాక ఆరోగ్యరీత్యా మంచిది. క్రిమికీటకాలు నశిస్తాయి. వాతావరణ కాలుష్యం పోతుంది.  
అభ్యంగన స్నానం, కొత్తబట్టలు, పూజలు, పిండి వంటలు, బంధుమిత్రుల సమాగమం లాంటి కార్యక్రమాలతో ఇల్లిల్లూ సందడిగా, సంతోషంగా కనిపిస్తుంది. చిన్నారులున్న ఇళ్ళలో రేగిపళ్ళలో పప్పుబెల్లాలు, పూవులు, డబ్బులు జోడించి ''భోగిపళ్లు'' పోస్తారు. రేగిపళ్ళు సూర్యునికి ప్రీతికరమైనవి. పిల్లల తలపై భోగిపళ్లు పోయడంవల్ల సూర్యుని ఆశీస్సు లభిస్తుంది.
భోగిపళ్లు అంటే రేగిపళ్ళే. బదరీఫలం అనే పదం నుండి భోగిపండు వచ్చింది. బదరికావనంలో నరనారాయణులు తపస్సు ఆచరించే సమయంలో బదరీ ఫలాలను తిన్నారట. అందుకే భోగిపళ్లు పోయడమంటే నరనారాయణుల ఆశీస్సులు పండడం. రేగిపళ్ళు ఆరోగ్యరీత్యా కూడా చాలా మేలు చేస్తాయి. వాటిని శరీరం మీద పోయడంవల్ల అనారోగ్యాలు నయమౌతాయి. ఇవి తింటే దృష్టి దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. ఉదర సంబంధ జబ్బులు కుదురుతాయి. ఆహారం చక్కగా జీర్ణమౌతుంది. భోగిపళ్ల వేడుక ముగిసిన తర్వాత ఈ పళ్ళను కూడా పంచిపెడతారు. అవి తిని ఆరోగ్యంగా ఉండాలనేది పరమార్థం.
ఇక మకర సంక్రాంతి మరుసటిరోజు కనుమ. ఇది రైతులకు ముఖ్యమైన పండుగ. వ్యవసాయ కుటుంబాల్లో తెల్లవారుజామున లేచి పనులు మొదలుపెడతారు. పాడి పశువులను కడిగి, కుంకుమ, పూసల గొలుసులు, మువ్వలు, పట్టెడలతో అలంకరిస్తారు. నెల పొడుగునా వాకిళ్ళలో పెట్టిన గొబ్బెమ్మలను పొయ్యికింద పెట్టి పాయసం చేసి మొదట సూర్యునికి, ఆపైన దేవుడి మందిరంలో, తర్వాత పశువుల కొట్టంలో నైవేద్యం పెడతారు. పొలంలో, పశువులశాలలో గుమ్మడికాయ పగలగొట్టి దిష్టి తీస్తారు. గంగానమ్మ, పోలేరమ్మ లాంటి గ్రామదేవతలకు గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు.

సంక్రాంతి నెల మహా సందడిగా ఉంటుంది. ఒణికించే చలిలో కూడా అర్ధరాత్రివరకూ మెలకువగా ఉండి వాకిళ్ళలో కళ్ళాపి జల్లి, రంగవల్లులు తీర్చిదిద్దుతుంటారు. లేదా తెల్లవారుజామునే లేచి ముగ్గులు వేస్తారు. అవకాశం ఉన్నవారు నదీ స్నానం చేస్తారు. పుణ్య నదుల్లో స్నానం చేస్తే అజ్ఞానం అనే చీకటి తొలగిపోయి, జ్ఞాననేత్రం తెరచుకుంటుంది. నదిలో మునిగి, సూర్యునికి అర్ఘ్యం వదులుతారు. మకర రాశిలో ప్రవేశించిన సూర్యునికి నమస్కరిస్తారు. పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు.
ఇళ్ళముందు సంక్రాంతి ముగ్గుల మధ్య గొబ్బెమ్మలు, పూలు, పసుపుకుంకుమలు జల్లి వాకిళ్ళను కళాత్మకంగా రూపొందిస్తారు. గుమ్మాలు మావిడాకులు, బంతిపూల తోరణాలతో అలరారుతూ అందాలు చిందిస్తాయి. గ్రామాల్లో అప్పుడే కోతలు ముగిసి ధాన్యం ఇంటికి రాగా, ఏడాది అంతా చేసిన శ్రమ మాయమై కొత్త ఉత్సాహం ముఖాల్లో వెల్లివిరుస్తుంది.

No comments:

Post a Comment