Showing posts with label palnati yudham. Show all posts
Showing posts with label palnati yudham. Show all posts

Sunday, 13 November 2016

నాయకురాలు నాగమ్మ ( Nayakuralu Nagmma )

నాయకురాలు నాగమ్మ ( Nayakuralu Nagmma )

సమకాలీన శాసనాలు, సాహిత్యం, జానపద సాహిత్య ఆధారాలనూ సమన్వయ పరచి అధ్యయనం చేసినప్పుడు నాయకురాలు నాగమ్మ అనే భారతదేశపు ప్రప్రథమ మంత్రిణి కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం ఆరెవెల్లి గ్రామస్తురాలని, ఆమె కాలం నుండే తెలంగాణాలో “రెడ్డి” అనే కులం ప్రవేశించిందని అర్థమవుతుంది. ఇవి ఇప్పటి వరకు తెలంగాణా చరిత్రకు కొత్త విషయాలు కాబట్టి వీటిని విపులీకరించే ప్రయత్నమే ఈ వ్యాస ఉద్దేశ్యం

శ్రీనాథుడు తన “పల్నాటి యుద్ధం” కావ్యంలో నాగమ్మను

“పంటరెడ్డివారి పణతి యనంగ

ఎలమి జగ్గారెడ్డి వేడుక పుత్రి

మేకపోతుల రెడ్డి మేనకోడలును

ఆరవెల్లి వారింటి అమర కోడలును”

అంటూ వర్ణించాడు. నాగమ్మది .పంటరెడ్డి కుటుంబం. అంటే ఆమె కులపు ప్రధాన వృత్తి పంటలు పండించడం అనేది సుస్పష్టం. ఆమె చేసిన పల్నాటి యుద్ధానికి మూలాలు పంటలకు సంబంధించినవి అనేది ఆమె రాజు నలగామరాజు తండ్రి అనుగురాజు పూర్వ చరిత్ర ద్వారా తెలుస్తుంది. అనుగురాజు ఉత్తర దేశపు బాలమాచాపురి లేదా జంభూపురి (నేటి జబల్పూర్) నుంచి దక్షిణ దేశ యాత్రకు వచ్చి గుంటూరు జిల్లాలోని పల్నాడులోని గురజాలలో స్థిరపడి అక్కడి నుండే రాజ్యపాలన చేస్తుంటాడు. అతని (రాజ్యపు) పశువులకు పశుగ్రాసం అవసరమయ్యి” అతని సేనాపతి తెప్పలినాయుని ఆధ్వర్యంలో భటులు నేటి కరీంనగర్ ఉత్తర ప్రాంతానికి వస్తారు. ఆ రోజుల్లో (ఈ రోజుల్లో కూడా) ప్రధాన పశుగ్రాసం చొప్ప. ఈ జొన్నచొప్ప దండిగా దొరికే ప్రాంతం చొప్పదండి. ఇది కరీంనగర్ కు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. తెప్పలినాయుని మందీమార్బలం తమకు కావలసినంత పశుగ్రాసాన్ని సేకరించాక ఆ జొన్న చొప్ప కంకులను చూసి మురిసిపోయి ఒక పంట రెడ్డిని వాటి విత్తనాలను తమకు ఇవ్వుమంటారు- తమ ప్రాంతంలో ఆ పంటను, పశుగ్రాసాన్ని పండించుకోవడానికి. అందుకు ఆ రెడ్డి నిరాకరించడంతో అనుగురాజు సైన్యానికి, స్థానిక Nagamma Sరాజు ఊరకోట ప్రభువు పేరమరాజు సైన్యానికి మధ్య ఆరణిగండ్లలో పెద్ద యుద్ధం జరుగుతుంది. ఈ ఆరణిగండ్లనే నేడు ఆర్నగొండ అని పిలుస్తున్నారు. ఇది చొప్పదండికి ఉత్తరాన 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అర్నగొండ, గుండిల మధ్య యుద్ధ వ్యూహాలను రచించుకోవడానికి అనువైన కొండలు, గుండ్లు, మైదానాలు ఉన్నాయి. ఈ యుద్ధంలో పేరమరాజు చనిపోయాడు. ఈ పేరమరాజు, విత్తనాలు ఇవ్వడానికి నిరాకరించిన పంటరెడ్డి నాగమ్మకు ఏదో ఒక విధంగా బంధువులు అయ్యుంటారు. వారి మరణం / ఓటమికి కారణమైన తెప్పలి నాయుడు మీద నాగమ్మకు కోపం వచ్చింది. నాగమ్మ తండ్రి పేరు జగ్గారెడ్డి. ఈయన కాకతీయ రాజు మొదటి ప్రతాపరుద్రుడు చేతిలో క్రీ.శ. 1159లో ఓడిపోయిన పొలవాస దేశపాలకుడు రెండవ మేడ రాజు కొడుకు జగ్గదేవుడు అయ్యుంటాడు. ఈ జగ్గదేవుడు తనను శత్రురాజులు (ప్రతాపరుద్రుడితో సహా) ఎవరూ గుర్తు పట్టకుండా ఉండడం కోసం తన పేరును జగ్గారెడ్డిగా మార్చుకుని ఉంటాడు. ఇలా జరగడానికి అవకాశమున్నట్లు కరీంనగర్ జిల్లాలోనే మనకు రెండు శాసనాలు కన్పిస్తాయి. మహదేవపూర్‌లో ‘ప్రతాపగిరికోట’ను కట్టించిన ‘ముచ్చ నాయకుడు’ మనకు రామగుండం మండలం అడవిసోమనపల్లిలో “రామేశ్వరీ దేవరకు” నైవేద్యానకూ ముగ్గునకూ’ పన్నప (భూదానం) చేసినప్పుడు “ముచ్చరడ్డి”గా కన్పిస్తాడు. నిజానికి ఈ రడ్డిలు లేదా రెడ్డిలు మహారాష్ట్ర (మహారట్ట) నుంచి వచ్చినవారు. పలకడంలో రట్ట అనే పదంలట్ట కూడా అవుతుంది. అందుకే వీరి బిరుదుల్లో ఒకటి “లట్టలూరు పురవరాధీశ్వర” ఈ లట్టలూరు మహారాష్ట్రలోని లాతూరు. ఆ ప్రాంతం నుంచి వచ్చిన వారే రట్టలు, రడ్డిలు, రెడ్డిలు. వీరినే తిరెవారు అని కూడా అంటారు. వారి తిరె భాషలో మరాఠీ భాషనే ఎక్కువ వారి ఊర్లే కరీంనగర్ దగ్గరి తిరెపల్లి (5 కి.మీ.) తిరెవెల్లి (25 కి.మీ.) ఈ విధంగా తెలంగాణాలో రెడ్డి కులజులు ప్రవేశించారని అర్థమవుతుంది. ఇది మొదలు తెలంగాణాలో ( నిశాసనాల్లో) రెడ్డి కులస్థులు చాలా మంది కన్పిస్తారు.

Templeపేరమరాజు చనిపోయిన కొన్నాళ్ళకు అతని కొడుకు ఉత్తురుడు స్థానిక రాజులందరిని పోగు చేసి అనుగురాజు మీద యుద్ధానికి సన్నద్ధుడు అవుతాడు. మళ్ళీ యుద్ధం ఆరణిగండ్లలోనే జరుగుతుంది. ఈ ఆరణిగండ్ల (ఆర్మకుండ) క్రీ.శ.1005 నాటికే ఏడు వేల ద్రమ్మల (ఆనాటి కరెన్సీ) ఆదాయం కలిగిన నగరమని దగ్గర్లోని కడపర్తి శాసనంలో ఉంది. కాబట్టే ఇక్కడ స్థానిక రాజులందరూ కూడారు. కాని అనుగురాజు తరపున యుద్ధం చేసిన బ్రహ్మనాయుడి చేతిలో వీరందరూ ఓడిపోయి కప్పం కట్టడానికి ఒప్పుకున్నారు. అయితే యుద్ధం జరుగుతున్న సమయంలో వీరిలో ఎందరో చనిపోయారు కూడా. అలా చనిపోయినవారిలో నాగమ్మ భర్త (సింగారెడ్డి), తల్లిదండ్రులు, అత్తమామలు కూడా ఉన్నారు. అప్పటికి ఆమె పెళ్ళయి రెండు మూడు రోజులే అవుతుంది. ఈ ఘోరానికి కారణమైన బ్రహ్మనాయుడి మీద నాగమ్మకు ద్వేషం పెరిగింది. ఆమె తండ్రి జగ్గారెడ్డి భూమిలో బ్రహ్మనాయుడు బావి తవ్వించి, అందుకు వ్యతిరేకించినందుకు జగ్గారెడ్డిని చంపించాడని, అందుకే బ్రహ్మనాయుడిపై నాగమ్మకు ద్వేషం పుట్టిందని కొన్ని వాదనలున్నాయి. అదీగాక బ్రహ్మనాయుడు వైష్ణవాన్ని ప్రచారం చేశాడని, ఆయన బృందం వెలమలని, వాటికి వ్యతిరేకంగా నాగమ్మ వీరశైవాన్ని ప్రచారం చేసిందని, రెడ్డి కులస్థులను బలపర్చిందని, ఈ కారణాల నేపథ్యంలోనే పల్నాటియుద్ధం జరిగిందని చరిత్రకారులు నమ్ముతున్నారు. కవిబ్రహ్మ ఏటుకూరి వారి క్రింది పద్యంలో ఇందుకు ఆధారాలు కనిపిస్తున్నాయి నాగమ్మ “కట్టించినది కోట గడ్డలకెదురుగా జంగమ వృద్ధుల సత్రశాల…. సృష్టించినది వీరశివభక్తులకుగాను స్థావరమ్మున యందు శైవవీధి” అని చెప్పడంలో ఆమె వీర శైవమతాన్ని పోషించిన విషయం విదితమవుతుంది. పల్నాటి యుద్ధంలో (క్రీ.శ.1180 ప్రాంతంలో జరిగింది) ఎవరు రాజకీయంగా గెలిచినా సామాజికంగా అందరూ ఓడారు. అపార ధన, ప్రాణ నష్టం జరిగింది. అందుకు వెరసి నాగమ్మ తన ముసలితనంలో తన సొంతూరు ఆరెవెల్లికి వచ్చి ప్రజల యోగక్షేమాల సాధనకై కృషి చేసిందని గుర్రం చెన్నారెడ్డి తన ‘పల్నాటి చరిత్ర’లో వ్రాశాడు. అంతేకాదు. “కొండకోనల నివసించు కోయవారు బాటసారుల హింసించు బందిపోటు అక్రమంబగు చర్యల విక్రమింపనణచివేసె నాగమ్మ సాహసము చూపి” అని డా. కోడూరు ప్రభాకరరెడ్డి తన ‘పల్నాటి భారతం’ (పద్యం 85)లో రాయడంలో ఆమె దొంగల నుంచి ప్రజలనెలా రక్షించిందో తెలుస్తున్నది (నేటికీ ఆదిలాబాద్ జిల్లాలలో గొత్తికోయలు సీజనల్ దొంగతనాలను ఆశ్రయించడం గమనార్హం) అందుకే ఆమె దొంగలకు శత్రువుగా మారింది. ఆ సాంప్రదాయం ఎంతవరకు కొనసాగిందంటే, ఆమె తరువాత ఐదు వందల సంవత్సరాల తరువాత విజృభించిన కొండల్రాయుడు అనే గజదొంగ కూడా ఆమెను మాయలమారిగా తలంచాడని బుడిగ జంగాల కథలో చెప్తారు. నాగమ్మకు ‘నా’ అన్న వారు లేరు కాబట్టి “పల్లె ప్రగతికి ధన మెల్ల వ్యయముజేసె’నని సాహిత్యాధారాలు తెలుపుతున్నాయి. ‘ఆమె యొనసరించినట్టి నిస్వార్థసేవ సర్వజనులకు మిగుల హర్షమ్ముగూర్చె” కాబట్టి ఆమెను స్థానికులు దేవతగా కొల్చారు. కనుకనే ఆమెకు ఆమె ఊరు ఆరెవెల్లిలో గుడికట్టారు. అది ఇప్పటికీ ఉంది. ఇక్కడికి దగ్గరలో ఉన్న పొలవాసలో కూడా ఒక స్త్రీ శివలింగాన్ని పట్టుకున్నట్లుగ విగ్రహముంది. అది శివభక్తురాలు నాగమ్మదే అయ్యుంటుంది. పక్క జిల్లా నిజామాబాదు జిల్లా బాన్సువాడ దగ్గరి దుర్కి సోమేశ్వరాలయ గర్భగుడిలో కూడా నాగమ్మ విగ్రహముంది. శాసనాలున్నాయి. వాటిని చదివితే మరిన్ని ఆధారాలు లభించవచ్చు. ఆరెవెల్లిలోని గుడికి తూర్పున నాయకురాలి వాగు, నాయకురాలి మడుగు ఉన్నాయి. వాటిని ఆమె తవ్వించినందుకుగాని, లేదా ఆమె సంక్షేమ కార్యక్రమాలకు గుర్తుగా గాని నాయకురాలు నాగమ్మ పేరుతో పిలుస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా లక్షెట్టిపేట దగ్గరలోని కన్నెపల్లి గుడిల నాగమ్మ విధవలకు, విడిపోయినవారికి మళ్లీ వివాహం జరిపించే సాంప్రదాయాన్ని నెలకొల్పింది. అది ఇప్పటివరకూ కొనసాగుతున్నది. ఇలా నాగమ్మ వచ్చి మండలం అంతటా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఈ విధంగా నాయకురాలు నాగమ్మ తెలంగాణ అందించిన మొట్టమొదటి మహిళా మంత్రిణే కాకుండా, ఆమె ఉత్తర తెలంగాణలో రెడ్డి కులాన్ని, వీరశైవాన్ని ప్రవేశపెట్టినదిగా, దొంగలను, దోపిడీలను పారదోలి ప్రజాసంక్షేమానికి పాటుపడినదిగా చరిత్రలో గుర్తుండిపోతుంది.
 – ద్యావనపల్లి సత్యనారాయణ,
చరిత్రకారుడు, 9490957078.

Friday, 5 December 2014

పల్నాటి యుద్దం సినిమా

పల్నాటి యుద్ధం



కొత్త చిత్ర నిర్మాణ సంస్థలు ప్రారంభం కావడం, ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం పెంచిన వినోదపు పన్ను భారం అవుతోందని, నిర్మాణ వ్యయం కూడా పెరిగిపోయిందని భావించిన పాత నిర్మాణ సంస్థలు కొన్ని తెలుగు చిత్రాలు నిర్మించడం ఆపి, తమిళంలో చిత్రాలు నిర్మించడానికి సంకల్పించడం, రెండు స్టూడియోలను తెలుగువారు ప్రారంభించడం, విజయవాడలో నవయుగ ఫిలింస్‌ పంపిణీ సంస్థ ప్రారంభించడం 1947లోని ముఖ్యమైన విశేషాలు. ఈ ఏడాది పల్నాటియుద్ధం, యోగి వేమన, బ్రహ్మరథం, గొల్లభామ, రత్నమాల, రాధిక చిత్రాలు నిర్మించగా రత్నమాల తప్ప మిగతా చిత్రాలు విడుదల అయ్యాయి. వీటిలో యోగి వేమన పల్నాటి యుద్ధం, గొల్లభామ చిత్రాలకు పేరొచ్చింది. 1947 ఆగస్టు 15న మన దేశం బానిస శృంఖలాలనుండి విడివడి స్వతంత్రదేశంగా అవతరించడంతో దర్శక నిర్మాతలు సాంఘిక సమస్యలకు చిత్ర ఇతివృత్తాలు ప్రాధాన్యత యిచ్చే ప్రయత్నం వెంటనే ప్రారంభించారు.
చిత్ర దర్శకుడుగా తరువాత మారి మంచి చిత్రాలు రూపొందించిన వేదాంతం రాఘవయ్య ఈ ఏడాది విడుదలైన యోగివేమన, పల్నాటియుద్ధం చిత్రాలకు నృత్య దర్శకత్వం నిర్వహించడం విశేషం.
భానుమతి, రామకృష్ణ దంపతులకు జన్మించిన పుత్రుడు భరణి పేరున భరణి పిక్చర్స్‌ నిర్మాణ సంస్థను భానుమతి ప్రారంభించి 'రత్నమాల' చిత్రాన్ని భర్త రామకృష్ణ దర్శకత్వంలో చిత్ర నిర్మాణం ప్రారంభించారు.
పల్నాటి యుద్ధం
సహాయ సంపాదకుడుగా పనిచేసి, ప్రజామిత్రకు సంపాదకుడుగా వ్యవహరించిన గూడవల్లి రామబ్రహ్మం సినీరంగంలో ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌గా, పబ్లిసిటీలో సలహాలు యిచ్చేవానిగా వ్యవహరిస్తూ 'మాలపిల్ల' చిత్రానికి దర్శకులై, ఆ చిత్ర విజయంలో 'రైతుబిడ్డ' రూపొందించారు. 'రైతుబిడ్డ' కొందరు జమీందార్ల ఆగ్రహానికి బలి అయింది. తరువాత ఆ ధోరణి చిత్రాలు మాని 'ఇల్లాలు, అపవాదు, పత్ని, పంతులమ్మ, మాయాలోకం' చిత్రాలు రూపొందించారు. వీటిలో కొన్ని బయట సంస్థలు నిర్మించిన చిత్రాలు. 'పల్నాటియుద్ధం' రూపొందించాలనే కోరిక చాలా కాలంగా వుండేది. 'పల్నాటియుద్ధం' ప్రారంభించిన తరువాత అనారోగ్యం ఏర్పడింది. కొంత భాగం షూటింగ్‌ చేసాక ఈ చిత్రం పూర్తి చేసే బాధ్యతను ఎల్‌.వి.ప్రసాద్‌కి అప్పగించారు. గూడవల్లి రామబ్రహ్మం అక్టోబర్‌ 1946లో మరణించారు. మరణానంతరం 'పల్నాటియుద్ధం' సెప్టెంబర్‌ 47లో విడుదల అయింది. 'పల్నాటియుద్ధం' చిత్రం రూపొందించాలన్న ఆలోచన చాలా కాలం నుంచి గూడవల్లికి ఉన్నందున పల్నాటియుద్ధం బుర్రకథలను విని, అందుకు సంబంధించిన గ్రంథాలను చదివి, స్క్రిప్టు తయారు చేయించారు. బ్రహ్మనాయుడుగా డా. గోవిందరాజుల సుబ్బారావు, నలగామరాజుగా శ్రీవత్స వెంకటేశ్వరరావు, నరసింగరాజుగా లింగమూర్తి, బాలచంద్రుడుగా అక్కినేని నాగేశ్వరరావు, నాగమ్మగా కన్నాంబ, మాంచాలగా ఎస్‌.వరలక్ష్మి, కొమ్మరాజుగా గిడుగు సీతాపతి, మలిదేవరాజుగా సదాశివరావు, అలరాజుగా కోనేరు కుటుంబరావు, కన్నమదాసుగా వి. కోటేశ్వరరావు, సుబ్బన్నగా వంగర, రాజనర్తకిగా రాజబాల, పేరమ్మగా చంద్రకళ, ఐతాంబగా జి. విశ్వేశ్వరమ్మ నటించారు.
శ్రీ శారదా ప్రొడక్షన్స్‌ పతాకాన గూడవల్లి రామబ్రహ్మం నిర్మించి, కొంత చిత్రాన్ని దర్శకత్వం చేసి పక్షవాతం పాలవడంతో మిగతాది ఎల్‌.వి.ప్రసాద్‌ పూర్తి చేసారు. గూడవల్లి అనారోగ్యం కారణంగా బావమరిది కోగంటి వెంకట సుబ్బారావు నిర్మాణ బాధ్యతను చేబట్టారు. రామబ్రహ్మం, శారద దంపతులకు అంకితమిచ్చారు 24-9-47న విడుదల చేస్తూ.
బ్రహ్మనాయుడు వీరవైష్ణవుడు. నాగమ్మ వీర శైవ మతస్థురాలు. నాగమ్మ దురభిమానం 'పల్నాటియుద్ధం'కి కారణమౌతుంది.
పల్నాటిసీమ నలగామ రాజు పాలనలో వుంటుంది. నలగామరాజు సవితి తమ్ముళ్ళు నరసింగరాజు, మలి దేవరాజు. మలి దేవరాజుకు బ్రహ్మనాయుడు అంటే అపారమైన అభిమానం. పల్నాటి సీమలో అందరికీ బ్రహ్మనాయుడు అంటే అభిమానము అతని మాట వేదవాక్కు. బ్రహ్మనాయుడు మాచర్ల చెన్నకేశవ ఆలయంలో హరిజనులకు ప్రవేశం కల్పించడం, నిమ్నజాతికి చెందిన కన్నమదాసుని సైన్యాధికారుని చేయడంతో అగ్రవర్గాల లతో పాటు నాగమ్మకూడ కోపం వస్తుంది. బ్రహ్మనాయుడు మీద నాగమ్మ రాజసభలో ఆరోపణలు చేస్తే బ్రహ్మనాయుడు బదులివ్వక సభ వదలి వెళ్ళిపోతాడు. మలిదేవుడు బ్రహ్మనాయుడుతో వెళ్ళిపోతూ రాజ్యాన్ని పంచమనడంతో మాచెర్ల సీమను మలిదేవునికి ఇస్తాడు నలగామరాజు. మాచర్లను బ్రహ్మనాయుడు సహకారంతో పాలిస్తున్న మలిదేవుడుని చూసిన నాగమ్మకు కోపం తారాస్థాయికి చేరుతుంది. కోడిపందాలు పెట్టించి మలి దేవుణ్ణి ఓడిస్తుంది. ఫలితంగా ఏడేళ్ల వనవాసం చేయాల్సి వస్తుంది. వనవాసం అయ్యాక రాజ్యం కోరితే, నాగమ్మ ప్రేరణతో రాయబారి అలరాజు హత్యకు గురి అవుతాడు. యుద్ధం ప్రారంభమవుతుంది. బ్రహ్మనాయుడు కుమారుడు బాలచంద్రుడు భార్య మాటలతో యుద్ధరంగానికి వెళ్లి అలరాజుని చంపిన నరసింగరాజు తల నరుకుతాడు. ఇందులో సతీసహగమనం కూడా వుంది.
బాలచంద్రుడు మరణంతో బ్రహ్మనాయుడు చెలరేగిపోతాడు. పల్నాడు వల్లకాడుగా మారిపోవడంతో పశ్చాత్తాపం ఏర్పడుతుంది బ్రహ్మనాయుడు, నాగమ్మలకు.
'ఎవరవయా దేవా, తానా పంతము నాతోనా, ఝణఝణ కాలాంతకి', పాటలను కన్నాంబ, 'చందమామా ఓ చందమామా', 'ఈ కుహురాత్రి నా రాజు వేంచేయునా', 'రణములో తొడగొట్టి రాగోల బట్టి', 'రతిరాజ సుందరా, రణరంగ ధీరా' పాటలను ఎస్‌.వరలక్ష్మి మేత దారినబడ్డ మేలంపుటావ్‌, తీరిపోయనా... మాతా...' పాటలను ఘంటసాల, 'తెర తీయగా రాదా దేవా' పాటను ఘంటసాల, కన్నాంబ, 'చూతము రారయ్యా, చెన్నమ్మను' పాటను ఘంటసాల, అక్కినేని, వచ్చునటే రాజూ పాటను ఉడుతా సరోజిని, నేడే నిజమురా పాటను సుందరమ్మ ఓహో చారుశీలా పాటను అక్కినేని, ఎస్‌.వరలక్ష్మి ఆలపించారీ చారిత్రక చిత్రంలో.
మాటలు పాటలు సముద్రాల రాఘవాచార్య, సంగీతం గాలి పెంచల నరసింహారావు, ఛాయాగ్రహణం జితేన్‌ బెనర్జీ, సౌండ్‌ దిన్షా కె టెహ్రాని, కళ నాగూర్‌, ఎస్‌.వాళి సమకూర్చారు.
గొల్లభామ
మీర్జాపురం రాజా శ్రీ శోభనాచల గొల్లభామ సి. పుల్లయ్య దర్శకత్వంలో 'గొల్లభామ' చిత్రాన్ని నిర్మించారు. కృష్ణవేణి, ఈలపాట రఘురామయ్య ఈ చిత్రంలోని ముఖ్య పాత్రధారులు. దాసరి కోటిరత్నం, లీలాబాయి, సుందరమ్మ, గంగారత్నం, రామిరెడ్డి, వెల్లంకి, తీగల, రేలంగి, ఎ.వి.సుబ్బారావు, కోటేశ్వరరావు, మల్లికార్జునరావు, కె.వి.సుబ్బారావు, రామమూర్తి మిగతా పాత్రలు పోషించారు.
సంగీతం ఎస్‌.బి.దినకర్‌ రావు, ఛాయాగ్రహణం కొట్నిస్‌, కళ శర్మ, ప్రొడక్షన్‌ బి.ఎ.సుబ్బారావు నిర్వహించారు.
రాధిక
ఆర్‌. బాలసరస్వతి, పద్మనాభరావు ముఖ్యపాత్రలు పోషించిన 'రాధిక' చిత్రాన్ని శ్రీ ఛత్రపతి పతాకాన ఆర్‌.పార్థ సారథి నాయుడు నిర్మించారు. కాళ్ళకూరి సదాశివరావు ఈ చిత్రానికి దర్శకుడు. అంతకుముందు చింతామణి, కుచేల, సులోచన, లంకా దహనం చిత్రాలను డైరక్ట్‌ చేసారు కాళ్ళకూరి సదాశివరావు.
బ్రహ్మరథం
భక్త మార్కండేయ, మైరావణ, దక్షయజ్ఞం, భక్త ప్రహ్లాద, సంసారనారది చిత్రాలకు దర్శకత్వం నెరపిన చిత్రపునారాయణ మూర్తి దర్శకత్వంలో శ్రీ వెంకట్రామా పతాకాన 'బ్రహ్మరథం' చిత్రం నిర్మించారు. అద్దంకి, జయమ్మ ఈ చిత్రానికి ముఖ్య పాత్రధారులు.
సోర్స్- ఆంధ్రప్రభ న్యూస్,   వి.ఎస్‌.కేశవరావ్‌