Wednesday, 26 November 2014

తొలి మహామంత్రిణి నాయకురాలు నాగమ్మ

'తొలి మహామంత్రిణి నాయకురాలు నాగమ్మ'

సాహిత్యం కల్పనీకం కానీ చరిత్ర ఆధారభూరితం. చరిత్రను సాక్షాత్కరింపచేయాలంటే నిఘంటువుల వంటి ఆధారాలు ఆవశ్యం. అదీ సహస్రాబ్దినాటి పల్నాటి చరిత్రకు సంబంధించిన ప్రధానాం శం. అందునా తొలి నాలుగు శతాబ్దాల పాటు అక్షరరూపం. గ్రంధస్థంకు నోచుకోక పామరజనుల నోళ్ళలో జాలువారుతూ కాలం గడిపిన చరిత్ర తమకు అనుకూలంగా ఆయా కాలాలకు అనుగుణంగా వాస్తవ చరిత్రకు మెరుగులు దిద్దే ప్రక్రియలో ఒక వర్గం చీకటి కోణంలోకి నెట్టివేయడం జరిగిందని ఒక్క మాటలో చెప్పడం తొలుత రుచించకపోయినా తొలి మహామంత్రిణి నాయకురాలు నాగమ్మ గ్రంథంలో రచయిత వై.హెచ్‌.కె. మోహన్‌రావు చూపిన ప్రామాణికాలు ప్రతి ఒక్కరిలో సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తాయనడంలో సందేహం లేదు. ఆర్భాట ప్రచారాలు, పిడివాదం వంటి వాటితో బ్రహ్మనాయుడు అప్పట్లోనే గ్లోబల్‌ ప్రచారాలు అనే పదావికి నాంది పలికాడన్న మదిలో కలుగక తప్పదు. పల్నాటి చరిత్రపై పలువురు కవులు చరిత్రకారులు రచించారు. అందులో నూటికి తొంబైమంది మంత్రి బ్రహ్మనాయుని కీర్తించే దిశలో నాగమ్మ వర్గాన్ని చిన్నచూపు చూడడమే కాకుండా ప్రతి నాయకగా చూపడంలో పోటీపడ్డారని చెప్పక తప్పదు. 11వ శతాబ్ధకాలంలో ఆనాటి సామాజిక పరిస్థితుల్లో సామాన్య కుటుంబం నుండి వచ్చిన ఒక సాధారణ స్త్రీ అందునా బాల వితంతువు. మంత్రిస్థాయికి ఎదగడం, వ్యూహాలు, ప్రతివ్యూహాలతో సమర్ధపాలన యుద్ధనైపుణ్యాలతో స్త్రీజాతికే మణిదీపంలా బాసించింది. పల్నాటి చరిత్రలో వెలుగుచూడని అంశాలెన్నో వున్నాయి. చరిత్రలోని అంశాలను తమకు అనుగుణంగా మార్చుకోవడం కోసం ఏకంగా ప్రచారానికి వీర విద్యావంతుల పేరిట బ్రహ్మనాయుడు బృహత్తర ప్రచారశాఖనే ప్రారంభించారు. అలాగే మహిమలు, మహత్యాలు ఆవిష్కరించేలా కారంపూడిలో ఒక వీరాచార పీఠాన్ని ఏర్పరిచారు. అది కొనసాగేందుకు భారీగా భూసంతర్పణలు చేసారు. ఆనాటి శైవ వైష్ణవ మతాల మధ్య వైరుధ్యాలను తన రాజకీయంలో పాచికలు చేసుకున్నాడని నిరూపించడంలో రచయిత సఫలీకృతులయ్యారు. అనుగురాజు హత్యపై అల్లిన అవతారగాధ, పల్నాడును ముక్కలు చేసిన స్వార్ధచింతన, కోడిపోరు, వ్యూహా ప్రతివ్యూహాలు, కోడిపోరు ఓటమి నిబంధనలను తుంగలో తొక్కుతూ మండాది అడువుల్లో అరణ్యవాసం చేయడం, మందపోరులో పల్టీడుచు మట్టుపెట్టడం రాయబారిగా అల రాజును పంపడం వంటి బ్రహ్మనాయుని చర్యల వెనుక అతని పెద్దరికాన్ని సైతం ప్రశ్నించే నిజాలే దాగిఉన్నాయి. ధర్మం నాయకురాలి వైపు ఉందని బ్రహ్మన అనుచరులైన గోసంగులు అనడం ఇందుకు తార్కాణంగా పేర్కొనవచ్చు. బ్రహ్మనాయుడి యుద్ధాన్మాదమే పల్నాడను పీనుగుల గుట్టగా మార్చడానికి దారితీసింది. తుకు పరాజయాన్ని కూడా తన విజయంగా ప్రచారం చేసుకున్న బ్రహ్మన్న వర్గ ప్రచారాన్ని సశాస్త్రీయంగా సాక్ష్యా ధారాలతో గ్రంధకర్త ఆవిష్కరించ గలిగారు. ఇందుకోసం లెక్కకు మించిన గ్రంధాలను ఆశ్రయించారు. శ్రీనాధ మహాకవి వీరోచితమైన పలనాటి వీరచరిత్ర మొదలు చిట్టిబాబు 'పల్నాటి మహాభారతం' పింగళి లక్ష్మీకాంతం, పల్నాటి వీరచరిత్ర, చిలుకూరి వీరభద్రకవి నాయకురాలి దర్బం, ఆండ్ర శేషగిరిరావు ఆంధ్రనారీమణలు కపిలవాయి లింగమూర్తి, లల్లాదేవి నాయకురాలు డా||బి.ఎస్‌.ఎల్‌. హనుమంతరావు, ఆంధ్రుల చరిత్ర డా||తంగిరాల వెంకటసుబ్బారావు, తెలుగు వీరగాధా కవిత్వం-పల్నాటి వీరకధాచక్రం' గుర్రం చరిత్ర, వినుకొండ వల్లభరాయుడు క్రీడాబిరామం వంటి గ్రంధాలోని పలు అంశాలను ఆధారాలుగా చూపారు. విదేశీ చరిత్రకారుడు పి.డి.ఆచారి పల్నాటి వీరచరిత్ర స్వర్ణవాచస్పతి హైహయ రాజుల పాలనలో పల్నాటి చరిత్ర, వినుకొండ వల్లభరాయుడు క్రీడాభి రామం వంటి గ్రంధాలలోని పలు అంశాలను రచయిత ఆధారాలుగా చూపారు.

దేశ విదేశీ చరిత్రకారులతోపాటు శాసనాలు, సాహిత్యం, జానపాద గాధల నుండి సమాచారాన్ని సేకరించి విశ్లేషణ చేయటం ద్వారా పల్నాటి చరిత్రను సరికొత్త కోణంలో ఆవిష్కరించటంలో రచయిత వై.హెచ్‌.కె. సఫలీకృత మయ్యారు. రచయిత వై.హెచ్‌.కె.మోహన్‌రావు పల్నాడు రచయితల సంఘం అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. పిడుగురాళ్ళలోని 11-61/3, జె.పి.రోడ్డు, గుంటూరు జిల్లా చిరు నామాలో నాయకురాలు నాగమ్మ పుస్తకాలు లభిస్తాయని తెలిపారు. ఈ పుస్తకంపై ఆసక్తి ఉన్నవారు ఫోన్‌నెంబర్‌ 9440154114లో సంప్రదించవచ్చునని వై.హెచ్‌.కె.మోహన్‌రావు తెలిపారు.

No comments:

Post a Comment