వీరారాధనోత్సవాలు
మహాభారతం తీరునే దాయాదుల పోరుగా పల్నాటి యుద్ధం జరిగింది. నాటి రణానికి సాక్షీభూతంగా నిలిచిన కారంపూడిలో (కార్యమపూడి) శతాబ్దాల నుంచి యుద్ధంలో అమరులైన వీరులను స్మరిస్తూ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. పల్నాడు వీరారాధనోత్సవ పరిరక్షణ సమితి అధ్వర్యంలో కారంపూడిలో వీరారాధనోత్సవాలు జరుగుతున్నాయి. 11వ శతాబ్దంలో పల్నాటి యుద్ధం జరిగిందని చరిత్రకారుల నిర్ధారించారు. సమసమాజ స్థాపన కోసం బ్రహ్మనాయుడు హరిజన, గిరిజన ఆలయ ప్రవేశం చేయించారు. తన ఆశయ సాధనకు చెన్నకేశవాలయ అర్చకులుగా మాలదాసరులైన పిడుగు వంశీకులను, చాకలి, మంగలి, గొల్లలను సేవకులుగాను నియమించారు. కులాంతరవివాహాల ను ప్రోత్సహించారు.మాలకన్నమదాసును దత్తపుత్రునిగా స్వీకరించి సైన్యాధ్యక్షుడిగా చేశారు. ఉత్సవాల్లో మందపోరు రోజున చాపకూడు నిర్వహిస్తున్నారు. రాయబారం , మందపోరు , కోడిపోరు, కళ్ళిపాడులుగా అలనాటి చరిత్రను కథకులు గానం చేస్తుండగా అప్పటి సన్నివేశాలైన కోడిపోరు, లంకన్న ఒరుగు, కత్తిసేవలను నిర్వహిస్తారు. 11 జిల్లాల నుంచి ఆచారవంతులు తమ తమ కొణతాలతో ఉత్సవాలలో పాల్గొని మొక్కులు చెల్లించి కత్తిసేవచేసి వెళ్తుంటారు. కార్తీక అమావాస్య నాడు వీర్ల దేవాలయంపై ఎర్రజండా ఎగురవేసి పీఠాధిపతి ఉత్సవాలకు సిద్ధం కావాలని పిలుపునిస్తారు. ఆచారవంతులు అర్ధరాత్రి నుంచి తమ కొణతాలతో నిధి వీర్లదేవాలయం చేరతారు. బాలుడే పీఠాధిపతి: ప్రపంచంలో అమరవీరులకు ఆరాధనలు రోమ్ తరువాత కారంపూడిలోనే నిర్వహిస్తారు. ఇంతటి ఘనచరిత్రకు 12 ఏళ్ళ బాలుడైన పిడుగు తరుణ్ చెన్నకేశవ పీఠాధిపతి వంశపారంపర్యంగా వస్తున్న ఆచారాన్ని నిలబెడుతూ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. సంతానం కోరే మహిళలు ఉత్సవాల్లో వీర్ల కొణతాల జలదరింపు కోసం బారులు తీరుతారు. కొణతాల జలదరింపులో పూలరేకులు వడిలో పడితే వాటిని ఆరగిస్తే సంతానం కలుగుతుందని నమ్మకంతో వందలాదిగా మహిళలు వేచి ఉంటారు.
పల్నాటి చరిత్ర వీరగాధను 800 సంవత్సరాలుగా గానాభినయం చేస్తుండడం విశేషం. దాన్ని 30 రాత్రులు గానం చేసే విద్యావంతులు పది కులాల్లో ఉన్నారు. వీరిలో మాలదాసులది ప్రత్యేకం. 17వ శతాబ్ది మధ్యభాగంలో జీవించిన వీరభద్ర కవి పల్నాటి యుద్ధ చరిత్రను కావ్యంగా రాశారు. సి.పి. బ్రౌన్ వీరుల గాథను తాళపత్ర రూపంలో కొంత సేకరించారు. శ్రీనాధ విరచిత పల్నాటి చరిత్రను అక్కిరాజు ఉమాకాంతం 1911లో ప్రచురించారు. ఆ తర్వాత 1961లో పింగళి లక్ష్మీకాంతం శ్రీనాథ కావ్య మూలంగా పల్నాటి చరిత్ర ద్విపదను వెలువరించారు. ప్రేమ కోసం ప్రియుడితో కోటను వదిలి యుద్ధం చేసిన శివనాగరాణి గాధ ఆద్యంతం రసవత్తర ఘట్టం.
పిడుగురాళ్ల సమీపంలోని జానపాడుకు చెందిన అలిశెట్టి గాలెయ్యతో 30 రాత్రులు పాడించుకుని దాన్ని తెలుగు నుంచి ఇంగ్లీషులోకి జి.హెచ్. రొఘెయిర్ అనువదించారు. విస్కాన్సిన్ విశ్వవిద్యాలయ ఆచార్యుడైన వెల్చేరు నారాయణరావు ఆయనకు కొంతమేర సహకరించారు.
నాయకురాలు నాగమ్మ జన్మస్థలం గామాలపాడు నేటికీ ఉంది. అక్కడ నాగమ్మ కోట, శివాలయం ఉన్నాయి. వీరత్వం ఉప్పొంగి చనిపోయిన ఇద్దరు ముస్లిం సైనికుల సమాధులు సైతం వీరుల గుడిలో పూజలందుకోవడం విశేషం. శంకుతీర్థ మండపం నాగులేటి సమీపంలో ఉంది. వీరులు యుద్ధానికి వెళ్లే ముందు బ్రహ్మన్న ఇచ్చిన తీర్థం తాగిన వెంటనే వీరత్వం ఉప్పొంగేదని వీరగాధ చెపుతోంది.
ఆంధ్రుల_చరిత్రము_-_ప్రథమ_భాగము/ఏడవ_ప్రకరణము
No comments:
Post a Comment