పలనాడు వెలలేని మాగాణిరా....
credit by - సి.ఎస్.రావ్
స్వానుభవంలో ఎన్నిసార్లు గొంతెత్తి పాడుకున్నా తనివి తీరని గేయం పులుపుల శివయ్య గారి “పలనాడు వెలలేని మాగాణిరా”;దీనిని బాలడ్ గా భావించవచ్చు .శివయ్యగారి బాలడ్ లో అస్పష్టత గానీ,అన్వయకాఠిన్యం కానీ ఉండదు.గొప్ప రెమినిసెంట్ ఫెర్వర్ తో ఉజ్వలమైన చరిత్రని ఇవోక్ చేస్తుంది.
శివయ్య గారు (1910-1976) కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని మనసా, వాచా,కర్మణా నమ్మి గొప్ప నిబద్ధతతో తమ జీవితాల్ని మలచుకున్న వెనుక తరం కు చెందిన ఉద్యమకారులలో పేరెన్నిక గన్నవారు. గుంటూరు జిల్లా,వినుకొండ నుండి పేదలకు నిజమైన ప్రతినిధిగా ఎమ్మెల్యే గా ఎన్నుకోబడ్డ నిరాడంబర నాయకులు. ఇస్త్రీ చెయ్యని ముతక ఖద్దరు పంచె ,లాల్చీ ,పై పంచె తో సన్నగా,కొంచెం బట్తతలతొ ,ప్రశాంత వదనంతో ,చామనచాయ రంగులో,వివేకం,వినయం,అదొకరకమైన జాలితో నిండిన మెలంకలీ ఉట్టిపడే కళ్ళతో ఆకట్టుకునే మూర్తిత్వం వారిది.జగమెరిగిన నిస్వార్ధ సేవాతత్పరత ,సిద్ధాంత నిబద్ధత చూసేవారికి ఆయనపై అపారమైన గౌరవభావాన్ని కలిగిస్తవి.శివయ్య గారు ఎమ్మెస్సీ డిగ్రీ తీసుకున్నారు.ఆ రోజుల్లో శివయ్యగారి పేరు వింటే వావిలాల గోపాలకృష్ణయ్య గారు,గోపాలకృష్ణయ్య గారి పేరు వింటే శివయ్యగారు గుర్తుకొచ్చేవారు.
“పలనాడు వెలలేని మాగాణిరా” ను 1945 ప్రాంతంలో శివయ్య గారు వ్రాశారు.వ్రాసినదగ్గరనుండి పండితులు,సామాన్యులు అనే భేదం లేకుండా బహుళ జనాదరణ పొందిన రచనే అయినా ,అది అచ్చయ్యింది 1978 లో.శివయ్యగారు 1976 లో చనిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా శాఖ వారు.ఈ బాలడ్ టైటిల్ తో ,ఇదిగాక ఇంకా 17 గేయాలు వారు వ్రాసినవి కలిపి గ్రంధంగా ప్రచురించారు.తక్కిన 17 గేయాలలో కొన్ని శ్రీశ్రీ ఫక్కీలో వ్రాయబడ్డట్టు అనిపిస్తుంది.కానీ పలనాడు మీది ఈ బాలడ్ తన సొంతు గొంతుక నుండి హిమాలయ శృంగాల మీదుగా దూకిన గంగోత్రిలా కవితా రస ఝరియై ఎత్తుపల్లాల మీదుగా హుందాగా,అందంగా,నిండుగా ,మధురంగా సాగిన ప్రవాహంలా ఆద్యంతం ఆకట్టుకుంటుంది.భావావేశం,రసధార,ఔచిత్యశోభ,అబ్బురపరిచే నిర్మాణ రామణీయకత ,నిరలంకారమైన స్వచ్చమైన సౌందర్యం,ఒక్క వ్యర్ధ పదం,కూడా లేని సొగసైన పదాల కూర్పు చదువరులను తన్మయులని చేస్తాయి.బలీయమైన ఆవేశానికి లోను చేస్తాయి.ఒక మహా గొప్ప చేనేతకళాకారుడు నేసిన కలనేతపట్టు వస్త్రంలో ద్యోతకమయ్యె సౌందర్య నైపుణ్యం ఈ గేయ రచనలో కనబడుతుంది. కలనేతపట్టు వస్త్రం అని నేననడం యాదృచ్చికం కాదు.పలనాడు ప్రాంతపు నైసర్గికస్వరూపాన్ని ,చారిత్రకవైభవాన్ని ,పరంపరగా సాగి వస్తున్న సంస్కృతీ ,సంప్రదయాలని పలనాటి ప్రజల జీవలక్షణాల్ని దెనికి దానిని విడదీయరాని విధంగా సమ్మోహనంగా సమన్వయిస్తూ ,వీటన్నిటినీ మహా రసవత్తరంగా ప్రతిఫలింపచేస్తూ చేయబడ్డ రచన ఇది. ఈ ఒక్క బాలడ్ చాలు పులుపుల శివయ్యగారిని ఎంత గొప్ప కవుల సరసనైనా సగర్వంగా ఆసీనులని చేయటానికి.
ఈ బాలడ్ లో శివయ్యగారి రచనా శిల్ప సౌందర్యం,ఔచిత్యం ఆద్యంతం ప్రస్ఫుటంగా కనిపిస్తవి.పలనాటి ప్రజల ప్రధాన జీవ లక్షణం పౌరుషం.శివయ్యగారు దీనిని మొదటి చరణంలోనే ఆవిష్కరిస్తారు:
“శాతవాహన తెలుగు చక్రవర్తుల శౌర్య
మిదెబ్రాహ్మ్య మిదెక్షాత్ర మన్న గర్జా ఘోష
పులకలే యెత్తించెరా పలనాట
పౌరుషమ్మే పొంగెరా! “
ఆదిలోనే సువిశాలమైన సామ్రాజ్య నిర్మాతలుగా శాతవాహనుల నుదహరించటం తోనే,శౌర్యం,క్షాత్రం,పౌరుషం కీ నోట్ పదాలుగా పలనాటి ప్రజల మౌలికమైన జీవలక్షణాలుగా స్ఫురింపచేయటంలోనే ఈ బాలడ్ గొప్ప మొమెంటం తో ప్రారంభమవుతుంది.అలా ప్రభవించిన మొమెంటం పంక్తి పంక్తికీ చరణ,చరణానికీ,”ఇంతింతై వటుడింతై” అన్నట్లు బలోపేతమై వైభవంగా జైత్రయాత్ర సాగినట్లు సాగుతుంది.ఇది గొప్ప కవితా కళాత్మక ఎత్తుగడ.
పలనాడు ఆనాడే విశ్వవిఖ్యాతి గాంచిన శిల్పకళా విన్యాసానికి జీవగడ్డై వెలసింది.
” తొలిసంజ దీక్షతో తెలుగు శిల్పుల చేతి
పోగరలు మలచిన బుద్ధయుగ జీవితము
నవశిల్ప రతనంబు రా ,పలనాట
నాగార్జునుడి కొండరా !”
ఒక్క”తొలిసంజ దీక్షతో” అన్న పదబంధంతో తపస్సులా ,ఏకైక జీవితాదర్శంగా ,ఏకాగ్రతతో బుద్ధుడి జీవిత విశేషాల్ని కళాఖండాలుగా చెక్కే శిల్పులను చూపిస్తారు,వారి పోగరలు చేసే శబ్దాల్ని హృద్యంగా వినిపిస్తారు,కొండప్రాంతంలోని తొలిసంజ పిల్లతెమ్మెరలు తెచ్చే చల్లదనాన్ని ఇచ్చే హాయిని మన అనుభవం లోకి తెస్తారు.
బౌద్ధనాగార్జునిని బుద్ధవిజ్ఞాజ్యోతి
వరమహా యానమై వసుమతిని ప్రవహింప
హెచ్చుతగ్గులు సమసెరా పలనాట
విజ్ఞాన ప్రభ వెలిగెరా !”
ఆచార్య నాగార్జునిని ఆధ్వర్యంలో నాగార్జున కొండలో ప్రపంచప్రఖ్యాతి గాంచిన విశ్వవిద్యాలయం ఉండేదని వేలమంది విద్యార్ధులు దశదిశలనుండి జ్ఞాన సముపార్జనార్ధం వచ్చేవారనేది చారిత్రక సత్యం.అంతే కాదు,సంఘంలో అందరూ సమానులే అన్న గొప్ప మానవీయ విలువలు ప్రభవిల్లిన రోజులవి.
“వర్ణధర్మాలన్న ఉక్కుచట్రము పగిలి
మాల కన్నమదాసు మనసైన సుతుడుగా
వీరవైష్ణవ మొచ్చెరా ,పలనాట
బ్రహ్మన్న కలిగీతలో!”
వర్ణవ్యవస్థకు వ్యతిరేకంగా ,మానవీయతే మహా ధర్మంగా సమానత్వమే అసమానమైన నైతిక విలువగా బ్రహ్మనాయుడి నాయకత్వంలో గొప్ప సంఘసంస్కరణోద్యమం వచ్చింది. ముందుతరాల వారికి మార్గదర్శకమయింది.తానారాధించే శ్రీ చెన్నకేశవస్వామివారి సాక్షిగా సమానత్వం బ్రహ్మనాయునికి నిబద్ధతతో కూడిన మనోధర్మమయింది.”మాలకన్నమదాసు మనసైన సుతుడట” :సమానత్వాన్న్ని అంత సహజ గుణంగా,ప్రేమాస్పదం గా ,బ్రహ్మనాయుని తర్వాత ఆచరించిన మహనీయులెంతమంది ఉన్నారు ,ఇన్ని శతాబ్దాలలో ?
ఆతర్వాత యుద్ధం అనివార్యమయింది .
“మగువ నాగమ్మతో మాయ యుద్ధము వచ్చి
మగువ మాంచాల తా మగని రణమున కంప
వీరవనితలు పుట్టిరీ ,పలనాట
శౌర్యముగ్గులు పెట్టిరీ !’
ఆత్మగౌరవం కోసం,స్వాతంత్ర్యం కోసం ,ధర్మం కోసం త్యాగం చేసే మహోదాత్త గుణం చక్కగా చెప్పబడింది.
“బాలచంద్రుని కత్తి పదును మెరపులు మెరసి
తరలి కారంపూడి ధర్మరణరంగాన
వీరరక్తము చిందెరా,పలనాట
నాగులేరై పారెరా !”
బాలచంద్రుని కత్తి పదును మెరుపులు మెరవటం వీరావేశ ప్రధానమైన గొప్ప రసాత్మక ప్రయోగం.నాగులేరు కారంపూడి నుండి దాచేపల్లి మీదుగా ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంది.పల్నాటి యుద్ధంలో అది రక్తప్రవాహమయిపోయింది.ఎంతచక్కగా శివయ్యగారు చరిత్రను,నైసర్గికతను,యుద్ధభీభత్సాన్ని సమన్వయం చేసారు!
“బాలచంద్రుని కదన కౌశలము కధలల్లి
శ్రీనాధ కవిరాజు చంద్రవంకకు చెప్ప
ఎదకరిగి ప్రవహించెరా ,పలనాట
ఎత్తిపోతల దూకెరా !”
ప్రస్తుత స్థితిని దృష్టిలో ఉంచుకుని చూస్తే చంద్రవంక జన్మస్థలం మాచర్ల దగ్గర ఆత్మకూరు .ఈ
ఊరిలో చెరువు చాలా పెద్దది.దానికంటే పెద్దది ఒక కంభం చెరువే నంటారు. ఏడుకొండవాగులొచ్చి చెరువు ముంచెత్తుతవి.దాని పొర్లుకట్ట కిందనుండే చంద్రవంక ప్రారంభం.1901లో ఈ చెరువు నిర్మాణం జరిగిందని చెబుతారు. అంతకు పూర్వం చంద్రవంకగా పిలవబడేది పైన పేర్కొనబడిన ఏడు కొండవాగులు కలిసి పారే నది.చంద్రవంక ఎప్పుడూ సన్నగా పారే జీవనదే.వర్షాకాలం మాత్రం ప్రళయప్రవాహమైపోతుంది.మాచర్ల మీదుగా ప్రవహించి ఎత్తిపోతల కొండలమీదనుండి జలపాతమై నిర్లక్ష్యంగా దూకుతుంది. శ్రీనాధుడు పల్నాటివీరచరిత్ర వ్రాసారు.పల్నాటియుద్ధంలో బాలచంద్రుడి శౌర్యాన్ని, వీరమరణాన్ని శ్రీనాధుడు చెప్పగా విని పల్నాటిప్రజలచే మాతృమూర్తిగా చూడబడే చంద్రవంక స్త్రీ సహజమైన పుత్రప్రేమ,భరించలేని పుత్రశోకంగా మారి ఎదకరిగి దుఃఖావేశంతో కన్నీటిప్రవాహమై ప్రాణత్యాగంకోసమేమో నన్నట్లు ఎత్తిపోతలకొండలమీదనుండి దూకింది.ఎంతటి రమ్యమైన,అసమానమైన,కరుణరసప్రేరితమైన భావన ! చరిత్ర, నైసర్గికస్వరూపం, కరుణామయమానవ నైజం,శ్రీనాధుని గుండెలుపిండే కవితా శక్తి ఎంత అందంగా ,ఎంత శిల్పచాతుర్యంతో,ఎంతరసాత్మకంగా సమన్వయింపచేసారు శివయ్యగారు.
భట్టుమూర్తిగా పిలవబడే రామరాజ భూషణుడు శ్రీ కృష్ణదేవరాయల ఆస్థాన కవీశ్వరులలో ఒకరు.”రాయలవారి అష్టదిగ్గజాలలో భట్టుమూర్తి ఒకరని పండితలోకం చెప్పుకుంటుంది కానీ అందుకు ఆధారాలు తక్కువ” అని అంటారు ఆరుద్ర గారు తన “సమగ్రాంధ్రసాహిత్యం “లో రెండవ సంపుటిలో (పేజీ 322).ఏది ఏమైనా ఈ గేయం యొక్క సౌందర్యానికి వచ్చిన లోపం లేదు.భట్తుమూర్తి “హరిశ్చంద్ర నలోపాఖ్యానం” అనే గొప్ప ద్వ్యర్ధి కావ్యాన్ని వ్రాసారు.ఈ కావ్యంలోని ప్రతి పద్యం అటు హరిశ్చంద్ర చక్రవర్తి గాధకు,ఇటు నలమహారాజు గాధకు గొప్ప సమన్వయం కుదిరే విధంగా వ్రాయబడింది.ఇది మన భాషలో గొప్ప శ్లేషకావ్యం.ఇది సామాన్యమైన విషయం కాదు.సామాన్యమైన ప్రతిభ కాదు.అంతేకాదు ,ఆయన ఒక ఘటికలో నూరు శ్లోకాలు చెప్పగలిగేవారట. ఈ భట్టుమూర్తిగారి స్వగ్రామం పలనాడు లోని భట్టువారి పల్లె.ఈ విషయమై కూడా కొంత వివాదం ఉంది.ఆరుద్రగారి ప్రకారం కడప జిల్లాలోని పులివెందుల దగ్గరి భట్టుపల్లె భట్టుమూర్తిగారి స్వస్థలం అయిఉండవచ్చు అని అంటారు.
‘కృష్ణరాయల సభా కవిదిగ్గజాలలో
ఘటికాశతగ్రంధ కరణధుర్యుండైన
భట్టుమూర్తే వెలసెరా,పలనాట
ప్రౌఢ శ్లేషలు పల్కెరా!”
తరువాత ఆంగ్లేయులు ఈస్టిండియా పేరుతో భారతదేశానికి వ్యాపార నిమిత్తం రావడం,క్రమక్రమేణా,సంస్థానాధీశులమధ్య వైషమ్యాలు పెంచి అనైక్యతను పోషించి పరమ దుర్మార్గంగా భారతదేశాన్ని ఆక్రమించుకోవటం,స్వాతంత్ర్యపోరాటయోధులను,బందీలను చేయటం అందరికీ తెలిసినదే.
“కలిమి బలిమీ గల్గు కర్షకుల సీమలో
కానికాలం వచ్చి కలహములు చెలరేగ
కుంఫిణీ వాడొచ్చెరా ,పలనాట
ఖైదుకొట్టులు కట్టెరా “
“కుంఫిణీ వాడొచ్చెరా” అనడం మంచి అర్ధవంతమైన ప్రయోగం .గొప్ప ఇవొకేటివ్ పవర్ ఉన్న ప్రయోగం.ఏదో బూచివాడొచ్చినట్లు,దొంగవచ్చినట్లు,దుష్టమాంత్రికుడొచ్చినట్లు ,దుష్టశక్తి ఏదో దేశానికి అరిష్టంగా ప్రవేశించినట్లు ధ్వనింప చేస్తుంది. వారిమీద ఏహ్యభావాన్ని చక్కగా స్ఫురింప చేస్తుంది.అటువంటివాళ్ళు వచ్చీ రాగానే చేసే పని ఖైదుకొట్టులు కట్టడం.గొప్ప ఔచిత్యశోభ ఉంది,ఇలా చెప్పటంలో. బాలడ్ నిండా ఇలా ఔచిత్యానికి అంతు లేదు.
“దాస్యమూ దోపిడీ దారిద్ర్యమూ హెచ్చి
పాడిపంటల మేలి బంగారు నాతల్లి
కరువుకాటకమొచ్చెరా,పలనాడు
కంటనీరెట్టిందిరా !”
దేశదుస్థితిని ఆర్ద్రంగా చెప్పిన తీరు అమోఘం.చరణం నిండా జాతి దైన్యం,దేశభక్తి తొణికిసలాడుతుంటవి .
“ఒక్క సుముహూర్తాన ఉప్పొంగి భరతోర్వి
స్వాతంత్ర్య సమరాన సింహనాదం సేయ
మేరువైనిలచిందిరా,పలనాడు
ముందుండిపోరిందిరా !
కన్నెగంటి హనుమంతు కోరమీసము త్రిప్పి
పలనాటి ప్రజలచే పన్నులెగబెట్టించె
బలియిచ్చె హనుమంతునూ ,పలనాడు
పరప్రభుత్వపు గుండ్లకూ”
“ఉప్పొంగి భరతోర్వి “చాలా గొప్ప పదప్రయోగం.ఆ రెండు చిన్న మాటల్లో ఆసేతుహిమాచల పర్యంతం గొప్ప కర్మయోగి గాంధీ మహాత్ముని అనితరసాధ్యమైన నాయకత్వంలో భారతీయులందరూ స్వాతంత్ర్యపోరాటంలో సర్వత్యాగాలకూ సిద్ధమై ఒక మహా ప్రవాహవేగంతో ముందుకు దూసుకు పోవటాన్ని ఈ మాటలు స్ఫురింపచేస్తాయి.పలనాడు ఈ మహాపోరాటంలో మేరువై నిలిచింది.ముందుండి అవిశ్రాంతంగా పోరాడింది.ఆ రోజులలో అడవులలో పశువులను మేపుకుంటే బ్రిటిష్ వాళ్ళకు “ఫుల్లరీ” అనే పన్ను కట్టాలట.ఈ పన్నేగాక మరే ఇతర పన్నులను కన్నెగంటి హనుమంతు గారి నాయకత్వంలో పలనాటి ప్రజలు కట్టలేదు,శాసనోల్లంఘనస్ఫూర్తితో.దుర్గికి ఆరేడు మైళ్ళదూరంలో ఉన్న మించాలపాడు గ్రామ కాపురస్తులు హనుమంతు గారు.కొందరు దేశద్రోహులు ఆచూకీ అందిస్తే ,బ్రిటిష్ ప్రభుత్వం కన్నెగంటి హనుమంతు గారిని కనుగొని కాల్చి చంపింది. వీర హనుమంతు తనప్రాణ త్యాగంతో అమరులై బాలచంద్రుని సరసన పలనాటి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.మా చిన్నతనంలో కన్నెగంటి హనుమంతు అంటే మాకొక మహావీరుడు .ఆయన శారీరక బలాన్ని గురించి ,ధైర్యసాహసాలగురించి,ఉద్యమనిర్మాణ సామర్ధ్యం గురించి పెద్దలు కధలుకధలుగా చెప్పేవారు.నా చిన్నతనంలో వారి కుమార్తెను ఓబులేసునిపల్లెలో వాళ్ళ బజారుకు వెళ్ళినప్పుడల్లా దూరంగా నుంచుని చూసేవాణ్ణి. ఆమె వయస్సు అప్పుడు 45-50 సంవత్సరాల మధ్య ఉండవచ్చు.ఆమెను చూస్తే ఆమె తండ్రి వీర హనుమంతుగారిని చూసినట్లే ఉండేది.గర్వంగా ఉండేది.
“ఆనాటి పౌరుషాలానాటి విక్రమా
లానాటి వైభవాలానాటి సంస్కృతుల్
ఈనాటికీ చరితలోనా ,పలనాడు
వెలయించె బంగారుతో .
వెనుకతరములవారి వీరచరితల సిరులు
నార్వోసి త్యాగంబు నీర్వెట్టి పెంచరా !
విరిసి సుఖములు పండురా,పలనాడు
వెలలేని మాగాణిరా !”
మన పూర్వులు చేసిన త్యాగాలకు మనమెప్పుడూ ఋణపడే ఉంటాము.వారి ఆశయాలను ఇంకా ముందుకు తీసుకపోయే నైతికబాధ్యత మనది.ఎంతచక్కని మెటఫర్స్ తో ఈ నీతిని ప్రబోధిస్తూ ,ఈ బాలడ్ ను ఎంతో అందంగా ముగిస్తారు శివయ్య గారు.
సచ్ఛీలులైన గొప్పకవుల మాటలు ఊరక పోవు.శివయ్యగారు ఈ బాలడ్ వ్రాసినపుడు పల్నాడులో అక్కడక్కడ చెరువులక్రింద ఉండేమాగాణి మినహా తక్కిన దంతా వర్షాధారమైన మెట్టభూమి.ఈనాడు పలనాడు పాడిపంటల బంగారు తల్లి.శివయ్యగారు దీవించినట్లుగా నాగార్జునసాగర్ నీళ్ళతో పలనాడు నిజంగా వెలలేని మాగాణి!పలనాటి వీరులకు జోహార్లు!పులుపుల శివయ్యగారికి జోహార్లు!
credit by - సి.ఎస్.రావ్
No comments:
Post a Comment