పల్నాటి వీరుల ఉత్సవాలు
చిన్నచిన్న రాళ్ళు..చిల్లరదేవుళ్లు, నాగులేటి నీళ్ళు..నాపరాళ్ళు,
సజ్జసన్నసంగటి..తినలేను ఓచెన్నకేశవ అన్నాడు అనాటి మహాకవి శ్రీనాధుడు.
అలాంటి మహానీయుడు సంచరించిన ప్రాంతమే కార్యమపూడి. పల్నాటి రణభూమి కారంపూడి. వీరులగుడి వద్ద 11వ శతాబ్ధాంలో జరిగిన పల్నాటి యుద్ధంలో మృతి చెందిన 66మంది మృతవీరుల ఆత్మశాంతికోసం జరిగే ఉత్సవాలే పల్నాటి వీరుల మహోత్సవాలు, కుల, మత, వర్గ విభేదాలు లేకుండా సమ సమాజ స్థాపనకోసం కృషి చేసిన వ్యక్తి బ్రహ్మనాయుడు. మాల కన్నమదాసును సర్వసైన్యాధ్యక్షుడిగాచేసి, దళితులను ఆలయప్రవేశం చేయించి, సహపంక్తి భోజనాలను ఏర్పాటుచేసిన మహానీయుడు బ్రహ్మనాయుడు. తనదే పైచేయి, తను చెప్పిందే వేదంగా పాటించాలని శాసించే నాయకురాలు నాగమ్మ. బ్రహ్మనాయుడు-నాగమ్మల మధ్య జరిగిన యుద్ధమే పల్నాటియుద్ధం. కారంపూడి వేదికగా జరిగిన పల్నాటి యుద్ధం ప్రపంచ చరిత్రలో రక్తాక్షరాలతో పల్నాటి పౌరుషానికి వీరుల త్యాగబలానికి నిదర్శనంగా నిలిచింది. పల్నాటి యుద్ధానికి దారితీసిన పరిస్థితులు, ఆనాటి మహాభారత యుద్ధపరిస్థితులతో సరిపోల్చవచ్చు. నాటి పాచికలాటలో ఓడిన పాండవులు అరణ్యవాసం చేయగా, పల్నాటి వీరులు కోడిపందాల్లో ఓడి, రాజ్యాలను వీడి అడవిబాట పట్టారు. అందుకే పల్నాటి యుద్ధం కురుక్షేత్రంగా పేరొందింది. మాచర్లను పరిపాలించిన మలిదేవరాజువద్ద బ్రహ్మనాయుడు, గురజాలను పరిపాలించిన నలగామునివద్ద నాయకురాలు నాగమ్మలు మంత్రులుగా పనిచేశారు. ప్రపంచ చరిత్రలో తొలి మహిళా మంత్రి నాగమ్మకావడం పల్నాటిప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టం. వీరగంధం తెచ్చినమయ, వీరులెవరో లేచిరయండయ్యా అంటూ పల్నాటిప్రాంతం గురించి పాడుతుంటే వీరావేశంతో శరీరం గగురపొడుస్తుంది. పల్నాటి ప్రాంతంలో సర్వమత సమానత్వం తేవాలనే బ్రహ్మనాయుడి ఆశయం పూర్తిగా నెరవేరకముందే యుద్ధం ముగిసింది. యుద్ధంలో చనిపోయిన వీరనాయకులకు లింగప్రతిష్ఠ చేసి, వీరారాధనోత్సవాలను జరిపించాలని పిడుగువంశంవారిని వంశపారంపర్యంగా ఏర్పరచి, గుత్తికొండ బిలానికి తపస్సుకు వెళతాడు బ్రహ్మనాయుడు. నాగులేరు ఒడ్డున పల్నాటివీరులైన 66మంది వీరనాయకుల శిలలకు గుడిని నిర్మించి, యుద్ధంలో పాల్గొన్న వీరులకు ఈనాటికి వీరపూజలు చేస్తూనే ఉన్నారు. మృతవీరులకు ఆత్మశాంతి కలగాలని కారంపూడిలో ఐదురోజులపాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఈనెల రెండోతేదీన రాచగావు, మూడోతేదీన రాయభారం, నాలుగున మందపోరు, ఐదో తేదీన కోడిపోరు, ఆరున కల్లిపాడుతో ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలలనుండి వీరాచారవంతులు తమ కొణతములు (దైవాలు) తీసుకువస్తారు. నాగులేరు (గంగధారిమడుగు)లో స్నానం చేయించి తమ మొక్కులు తీర్చుకుంటారు. పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ అయ్యవారు ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు.
No comments:
Post a Comment