Thursday 4 December 2014

బంగారు చరితల కుండ నాగార్జున కొండ

బంగారు చరితల కుండ నాగార్జున కొండ
చారిత్రక భాండాగారంగా భాసిల్లుతున్న రమణీయ ప్రదేశం నాగార్జునకొండ. నాగార్జునసాగర్‌ జలాలపై లాంచ్‌లో 14 కి.మీ. ప్రయాణించి నాగార్జున కొండకు చేరుకోవచ్చు. దీన్నే పూర్వం 'శ్రీపర్వతం' 'విజయపురి' అని పిలిచేవారు. ఆచార్య నాగార్జునుని బోధనలు వెల్లివిరిసిన చోటు కావడంతో దీనికి నాగార్జున కొండ అనే పేరు వచ్చింది. ఒకవైపు కృష్ణానది నీటితో, మిగిలిన మూడువైపులా నల్లమల కొండలతో పరివేష్టితమై ఈ నాగార్జునకొండలోయ 25 కి.మీ విస్తీర్ణంలో ఉంది. తొలిసారిగా 1926లో మద్రాసు పురావస్తు శాఖలో పనిచేసే ఎ.ఆర్‌. సరస్వతి నాగార్జున కొండను కనుగొన్నాడు. ఈ ప్రాంతంలో తొలిసారిగా త్రవ్వకాలు నిర్వహించిన వ్యక్తి ఎ. హెచ్‌. లాంగ్‌ హార్ట్‌. అనంతరం టి.ఎన్‌. రామచంద్రన్‌, ఆర్‌. సుబ్రహ్మణ్యం ఇక్కడ త్రవ్వకాలు జరిపారు. మనదేశం తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చొరవతో భారత పురావస్తుశాఖ 1954 తరువాత ఆరు సంవత్సరాలు త్రవ్వకాలు జరిపి అనేక అంశాలు వెలుగులోకి తెచ్చారు.
పూర్వయుగంనాటి అవశేషాలు
నాగార్జున కొండ త్రవ్వకాల్లో చరిత్ర పూర్వయుగ అవశేషాలు అనేకం బయల్పడినాయి. ఇవి భూమి ఉపరిభాగాన, నదీ తీరంలో లభించాయి. ప్రాచీన, మధ్య, నవీన, శిలాయుగ పరికరాలు ఇచ్చట దొరికాయి. రాతి గొడ్డళ్లు, మొనతేలిన రాతి పనిముట్లు, బూడిదరంగు కుండపెంకులు లభ్యమైనాయి. పెద్ద మట్టి పాత్రలో పసిపాపను పెట్టి పూడ్చిన సమాధి, రాగి ముక్కలుకూడా లభించాయి. ఇంకా పుర్రెలు, అస్థికలు, సమాధిలో కుండ సామాగ్రి దొరికాయి.

శాతవాహన యుగం నాటి అవశేషాలు
శాతావాహన యుగంనాటి నాణాలు, పూసలు, మట్టిబొమ్మలు, ఇనుపవస్తువులు, బంగారు ఆభరణాలు దొరికాయి. లభించిన నాణాలలో రోమన్‌ చక్రవర్తికి సంబంధించినవి రెండు, యజ్ఞశ్రీ కాలంనాటి సీసపు నాణాలు కూడా లభించాయి. బౌద్ధవిశ్వవిద్యా లయం, సింహళవిహారం బయల్పడినాయి.
ఇక్ష్వాకుల కాలంనాటి విశేషాలు
శాతవాహనుల -వీరాంధ్రలో ఇక్ష్వాకులు విజయపురిని రాజధానిగా చేసుకొని రాజ్యమేలారు. వీరిశాసనాలు దాదాపు 45 వరకు దొరికాయి. ఈ కాలంనాటి రాజులు వైదిక మతాన్ని అవలంభించారు. కానీ అంత:పుర స్త్రీలు బౌద్ధమతాన్ని ఆదరించారు. వీరి ఆదరణలో నాగార్జునకొండ సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రమైంది.

బౌద్ధ అవశేషాలు
నాగార్జున కొండలో లాంగ్‌హార్ట్స్‌ అనే వ్యక్తి నిర్వహించిన త్రవ్వకాల్లో అనేక సత్ఫలితాలు గోచరించాయి. ఒక మహాచైత్యము, ఆరు గజపుష్పాకార చైత్యగృహాలు, ఎనిమిది చిన్న స్తూపాలు, నాలుగు మంటపాలు బయల్పడినాయి. రామచంద్రన్‌ జరిపిన త్రవ్వకాల్లో రెండు చైతన్యగృహాలు, ఆర్‌. సుబ్రహ్మణ్యం జరిపిన త్రవ్వకాల్లో, 26 విహారాలు, 10 స్తూపాలు లభ్యమైనాయి.
స్థూపం:- నాగార్జున కొండపై బయల్పడిన స్తూపాలు చక్రాకృతిలో నిర్మించబడినాయి. ఆకులవలె నిర్మితమైన గోడల మధ్య ప్రదేశాన్ని మట్టితో నింపి, దాని చుట్టూ ఇటుక కట్టడం కట్టి దానిపై అండము నిర్మించారు. నిర్మాణంలో ఇటుకలు, సున్నం వాడబడినాయి. విహారాలు:- నాగార్జున కొండపై సింహళ విహారం బయల్పడింది. ఈ విహారంలోగల బోధివృక్షానికి బోధిశ్రీ ఒక వేదికను నిర్మింప జేసింది. నాగార్జున కొండలోని స్తూపాలు, చైత్యగృహాలు, విహారాలు, విహార నిర్మాణానికి కావలసిన శిల్పఫలకాలను అనేక మంది వర్తకులు, స్త్రీలు దానం చేసినవి.
బౌద్ధశిల్పాలు:- వీటిలో రెండురకాలున్నాయి. పూర్తిగా స్వదేశీయమైనవి. ఇది సాంచీ శిల్పాలకు సన్నిహితంగా ఉంటాయి. రెండో రకం శిల్పాలలో గాంధార లక్షణాలు కనిపిస్తాయి. లాంగ్‌ హార్ట్స్‌ జరిపిన త్రవ్వకాలలో 500పైగా శిల్పాలు వెలుగులోకి వచ్చాయి. ఈ శిల్పాల్లో బౌద్ధమతానికి చెందిన జాతక కథలు, బుద్ధుని జీవిత విశేషాలు కనిపిస్తాయి. ఇంకా అనేక భంగిమలలో బుద్ధుని ప్రతిమలు లభించాయి. నాగార్జున కొండలో కవచం ధరించిన ఒక వీరుని విగ్రహం లభించింది.
బ్రాహ్మణదేవాలయాలు:- ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధమతం తో పాటు బ్రాహ్మణమతం కూడా ఎంతో అభివృద్ధి చెం దింది. నాగార్జునకొండ త్రవ్వకాల్లో బయల్పడిన బ్రాహ్మణ దేవాలయాలు ఇక్ష్వాక రాజుల వైదికమత అభిమానానికి నిదర్శనాలు. ఇక్కడ నిర్మితమైన ఆలయాలలో భుజ స్వామి, పుష్పభద్రస్వామి, హారీతి, సర్వదేవ, కార్తికేయ, నవగ్రహ దేవళాలు, శిల్పాలలో కార్తికేయ, దేవసేన, సతిశిల్పం ఇత్యాది బ్రాహ్మణ శిల్పాలు ముఖ్యమైనవి.
మ్యూజియం:- ఇక్ష్వాక రాజ్య పతనానంతరం పల్లవుల కాలంలో బౌద్ధమతం క్షీణించడం ప్రారంభమైంది. పోయినవి పోగా మిగిలిన మట్టిపాత్రలు, శిల్పాలు, నాణాలను నాగార్జున కొండపై నిర్మితమైన మ్యూజియంలో పర్యాటకుల సందర్శనార్థం భద్రపరిచారు. నదీ ప్రవాహం మధ్యలో ఎత్తైన కొండమీద మ్యూజియం నిర్మించడం బహుశా నాగార్జున కొండపై ఇదే ప్రథమమని చెప్పవచ్చు.
సోరుసు --షేక్‌ అబ్దుల్‌ హకీం జాని, ఆంధ్రప్రభ పత్రిక

No comments:

Post a Comment