Wednesday 3 December 2014

అలనాటి నాయకురాలు


source  : Sakshi
అలనాటి  నాయకురాలు
ఆమెది ఒక సామాన్యమైన రైతుకుటుంబం. నా అన్న వారందరినీ కోల్పోయినా, కొండంత నిబ్బరం నిండిన ధీరురాలామె. రాజకీయాల వాసనలు, రాచరికపు పోకడలు లేశమంతైనా లేని మామూలు మహిళ. అయితేనేం, అసమానమైన ప్రతిభా సంపత్తితో మహామంత్రిగా ఎదిగిందామె. పురుషాహంకారాన్ని కాలదన్ని, ప్రజారంజకమైన పాలనతో చరిత్రకారుల ప్రశంసలు పొందింది.  దాయాదుల మధ్య చిచ్చుపెట్టి, కుతంత్రాలకు పాల్పడి, పల్నాటి యుద్ధానికి కారకురాలయిందన్నది ఆమెను మరోకోణంలో చూసేవారి మాట. నిజానిజాలు ఎలా ఉన్నా, ఒక స్త్రీ... అందులోనూ ఒక సాధారణ రైతు కుటుంబీకురాలు...   రుద్రమ దేవి, ఝాన్సీ లక్ష్మీ బాయిల కన్న ఎంతో ముందుగానే ఖడ్గం చేబూని, యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్న యోధురాలు. సంస్కృతం, కన్నడం, తమిళం, మళయాళం, తెలుగు భాషలను అనర్గళంగా మాట్లాగలిగిన మేధావి.

అపారమైన ధైర్యసాహసాలతో వీర, ధీర వనితగా పేరు తెచ్చుకోవడం మాత్రమే కాదు, పల్నాటి ప్రాభవం అంతరించినా, పల్నాటి యుద్ధం జరిగి ఇంతకాలమైనా తన పేరును శాశ్వతంగా నిలుపుకున్న ప్రజల మనిషి ఆమె. ఆ ప్రాంత ప్రజలు ఆమెను తమ గుండెల్లో నిలుపుకోవడమే కాదు, నాయకురాలు నాగమ్మగా ఆరాధిస్తున్నారు. ఆమెకు ఒక గుడి కట్టి పూజిస్తున్నారు.

 కారంపూడి పల్నాడుకి రణక్షేత్రమైతే, గురజాల రాజధాని. పల్నాటి యుద్ధవీరులను తలచుకుంటూ ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో సిడిమాను ఊరేగింపు ప్రధానమైనది. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ ఏకాదశి నుంచి మొదలై, కోరల పూర్ణిమ మరునాటి వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. పాతపాటమ్మ ఆలయంలో అమ్మవారికి పదహారు రోజులపాటు సంబరాలు జరుగుతాయి. ఈ నవంబరు ఆరు నుంచి, సిడిమోనోత్సవాలు జరగనున్నాయి. దేశంలో ఎక్కడెక్కడో ఉన్న ఊరి వాళ్లంతా ఈ ఉత్సవాలలో పాల్గొనేందుకు స్వగ్రామానికి రావడం విశేషం.
 - వై.హెచ్.కె. మోహనరావు

No comments:

Post a Comment