Friday 5 December 2014

పల్నాటి యుద్దం సినిమా

పల్నాటి యుద్ధం



కొత్త చిత్ర నిర్మాణ సంస్థలు ప్రారంభం కావడం, ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం పెంచిన వినోదపు పన్ను భారం అవుతోందని, నిర్మాణ వ్యయం కూడా పెరిగిపోయిందని భావించిన పాత నిర్మాణ సంస్థలు కొన్ని తెలుగు చిత్రాలు నిర్మించడం ఆపి, తమిళంలో చిత్రాలు నిర్మించడానికి సంకల్పించడం, రెండు స్టూడియోలను తెలుగువారు ప్రారంభించడం, విజయవాడలో నవయుగ ఫిలింస్‌ పంపిణీ సంస్థ ప్రారంభించడం 1947లోని ముఖ్యమైన విశేషాలు. ఈ ఏడాది పల్నాటియుద్ధం, యోగి వేమన, బ్రహ్మరథం, గొల్లభామ, రత్నమాల, రాధిక చిత్రాలు నిర్మించగా రత్నమాల తప్ప మిగతా చిత్రాలు విడుదల అయ్యాయి. వీటిలో యోగి వేమన పల్నాటి యుద్ధం, గొల్లభామ చిత్రాలకు పేరొచ్చింది. 1947 ఆగస్టు 15న మన దేశం బానిస శృంఖలాలనుండి విడివడి స్వతంత్రదేశంగా అవతరించడంతో దర్శక నిర్మాతలు సాంఘిక సమస్యలకు చిత్ర ఇతివృత్తాలు ప్రాధాన్యత యిచ్చే ప్రయత్నం వెంటనే ప్రారంభించారు.
చిత్ర దర్శకుడుగా తరువాత మారి మంచి చిత్రాలు రూపొందించిన వేదాంతం రాఘవయ్య ఈ ఏడాది విడుదలైన యోగివేమన, పల్నాటియుద్ధం చిత్రాలకు నృత్య దర్శకత్వం నిర్వహించడం విశేషం.
భానుమతి, రామకృష్ణ దంపతులకు జన్మించిన పుత్రుడు భరణి పేరున భరణి పిక్చర్స్‌ నిర్మాణ సంస్థను భానుమతి ప్రారంభించి 'రత్నమాల' చిత్రాన్ని భర్త రామకృష్ణ దర్శకత్వంలో చిత్ర నిర్మాణం ప్రారంభించారు.
పల్నాటి యుద్ధం
సహాయ సంపాదకుడుగా పనిచేసి, ప్రజామిత్రకు సంపాదకుడుగా వ్యవహరించిన గూడవల్లి రామబ్రహ్మం సినీరంగంలో ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌గా, పబ్లిసిటీలో సలహాలు యిచ్చేవానిగా వ్యవహరిస్తూ 'మాలపిల్ల' చిత్రానికి దర్శకులై, ఆ చిత్ర విజయంలో 'రైతుబిడ్డ' రూపొందించారు. 'రైతుబిడ్డ' కొందరు జమీందార్ల ఆగ్రహానికి బలి అయింది. తరువాత ఆ ధోరణి చిత్రాలు మాని 'ఇల్లాలు, అపవాదు, పత్ని, పంతులమ్మ, మాయాలోకం' చిత్రాలు రూపొందించారు. వీటిలో కొన్ని బయట సంస్థలు నిర్మించిన చిత్రాలు. 'పల్నాటియుద్ధం' రూపొందించాలనే కోరిక చాలా కాలంగా వుండేది. 'పల్నాటియుద్ధం' ప్రారంభించిన తరువాత అనారోగ్యం ఏర్పడింది. కొంత భాగం షూటింగ్‌ చేసాక ఈ చిత్రం పూర్తి చేసే బాధ్యతను ఎల్‌.వి.ప్రసాద్‌కి అప్పగించారు. గూడవల్లి రామబ్రహ్మం అక్టోబర్‌ 1946లో మరణించారు. మరణానంతరం 'పల్నాటియుద్ధం' సెప్టెంబర్‌ 47లో విడుదల అయింది. 'పల్నాటియుద్ధం' చిత్రం రూపొందించాలన్న ఆలోచన చాలా కాలం నుంచి గూడవల్లికి ఉన్నందున పల్నాటియుద్ధం బుర్రకథలను విని, అందుకు సంబంధించిన గ్రంథాలను చదివి, స్క్రిప్టు తయారు చేయించారు. బ్రహ్మనాయుడుగా డా. గోవిందరాజుల సుబ్బారావు, నలగామరాజుగా శ్రీవత్స వెంకటేశ్వరరావు, నరసింగరాజుగా లింగమూర్తి, బాలచంద్రుడుగా అక్కినేని నాగేశ్వరరావు, నాగమ్మగా కన్నాంబ, మాంచాలగా ఎస్‌.వరలక్ష్మి, కొమ్మరాజుగా గిడుగు సీతాపతి, మలిదేవరాజుగా సదాశివరావు, అలరాజుగా కోనేరు కుటుంబరావు, కన్నమదాసుగా వి. కోటేశ్వరరావు, సుబ్బన్నగా వంగర, రాజనర్తకిగా రాజబాల, పేరమ్మగా చంద్రకళ, ఐతాంబగా జి. విశ్వేశ్వరమ్మ నటించారు.
శ్రీ శారదా ప్రొడక్షన్స్‌ పతాకాన గూడవల్లి రామబ్రహ్మం నిర్మించి, కొంత చిత్రాన్ని దర్శకత్వం చేసి పక్షవాతం పాలవడంతో మిగతాది ఎల్‌.వి.ప్రసాద్‌ పూర్తి చేసారు. గూడవల్లి అనారోగ్యం కారణంగా బావమరిది కోగంటి వెంకట సుబ్బారావు నిర్మాణ బాధ్యతను చేబట్టారు. రామబ్రహ్మం, శారద దంపతులకు అంకితమిచ్చారు 24-9-47న విడుదల చేస్తూ.
బ్రహ్మనాయుడు వీరవైష్ణవుడు. నాగమ్మ వీర శైవ మతస్థురాలు. నాగమ్మ దురభిమానం 'పల్నాటియుద్ధం'కి కారణమౌతుంది.
పల్నాటిసీమ నలగామ రాజు పాలనలో వుంటుంది. నలగామరాజు సవితి తమ్ముళ్ళు నరసింగరాజు, మలి దేవరాజు. మలి దేవరాజుకు బ్రహ్మనాయుడు అంటే అపారమైన అభిమానం. పల్నాటి సీమలో అందరికీ బ్రహ్మనాయుడు అంటే అభిమానము అతని మాట వేదవాక్కు. బ్రహ్మనాయుడు మాచర్ల చెన్నకేశవ ఆలయంలో హరిజనులకు ప్రవేశం కల్పించడం, నిమ్నజాతికి చెందిన కన్నమదాసుని సైన్యాధికారుని చేయడంతో అగ్రవర్గాల లతో పాటు నాగమ్మకూడ కోపం వస్తుంది. బ్రహ్మనాయుడు మీద నాగమ్మ రాజసభలో ఆరోపణలు చేస్తే బ్రహ్మనాయుడు బదులివ్వక సభ వదలి వెళ్ళిపోతాడు. మలిదేవుడు బ్రహ్మనాయుడుతో వెళ్ళిపోతూ రాజ్యాన్ని పంచమనడంతో మాచెర్ల సీమను మలిదేవునికి ఇస్తాడు నలగామరాజు. మాచర్లను బ్రహ్మనాయుడు సహకారంతో పాలిస్తున్న మలిదేవుడుని చూసిన నాగమ్మకు కోపం తారాస్థాయికి చేరుతుంది. కోడిపందాలు పెట్టించి మలి దేవుణ్ణి ఓడిస్తుంది. ఫలితంగా ఏడేళ్ల వనవాసం చేయాల్సి వస్తుంది. వనవాసం అయ్యాక రాజ్యం కోరితే, నాగమ్మ ప్రేరణతో రాయబారి అలరాజు హత్యకు గురి అవుతాడు. యుద్ధం ప్రారంభమవుతుంది. బ్రహ్మనాయుడు కుమారుడు బాలచంద్రుడు భార్య మాటలతో యుద్ధరంగానికి వెళ్లి అలరాజుని చంపిన నరసింగరాజు తల నరుకుతాడు. ఇందులో సతీసహగమనం కూడా వుంది.
బాలచంద్రుడు మరణంతో బ్రహ్మనాయుడు చెలరేగిపోతాడు. పల్నాడు వల్లకాడుగా మారిపోవడంతో పశ్చాత్తాపం ఏర్పడుతుంది బ్రహ్మనాయుడు, నాగమ్మలకు.
'ఎవరవయా దేవా, తానా పంతము నాతోనా, ఝణఝణ కాలాంతకి', పాటలను కన్నాంబ, 'చందమామా ఓ చందమామా', 'ఈ కుహురాత్రి నా రాజు వేంచేయునా', 'రణములో తొడగొట్టి రాగోల బట్టి', 'రతిరాజ సుందరా, రణరంగ ధీరా' పాటలను ఎస్‌.వరలక్ష్మి మేత దారినబడ్డ మేలంపుటావ్‌, తీరిపోయనా... మాతా...' పాటలను ఘంటసాల, 'తెర తీయగా రాదా దేవా' పాటను ఘంటసాల, కన్నాంబ, 'చూతము రారయ్యా, చెన్నమ్మను' పాటను ఘంటసాల, అక్కినేని, వచ్చునటే రాజూ పాటను ఉడుతా సరోజిని, నేడే నిజమురా పాటను సుందరమ్మ ఓహో చారుశీలా పాటను అక్కినేని, ఎస్‌.వరలక్ష్మి ఆలపించారీ చారిత్రక చిత్రంలో.
మాటలు పాటలు సముద్రాల రాఘవాచార్య, సంగీతం గాలి పెంచల నరసింహారావు, ఛాయాగ్రహణం జితేన్‌ బెనర్జీ, సౌండ్‌ దిన్షా కె టెహ్రాని, కళ నాగూర్‌, ఎస్‌.వాళి సమకూర్చారు.
గొల్లభామ
మీర్జాపురం రాజా శ్రీ శోభనాచల గొల్లభామ సి. పుల్లయ్య దర్శకత్వంలో 'గొల్లభామ' చిత్రాన్ని నిర్మించారు. కృష్ణవేణి, ఈలపాట రఘురామయ్య ఈ చిత్రంలోని ముఖ్య పాత్రధారులు. దాసరి కోటిరత్నం, లీలాబాయి, సుందరమ్మ, గంగారత్నం, రామిరెడ్డి, వెల్లంకి, తీగల, రేలంగి, ఎ.వి.సుబ్బారావు, కోటేశ్వరరావు, మల్లికార్జునరావు, కె.వి.సుబ్బారావు, రామమూర్తి మిగతా పాత్రలు పోషించారు.
సంగీతం ఎస్‌.బి.దినకర్‌ రావు, ఛాయాగ్రహణం కొట్నిస్‌, కళ శర్మ, ప్రొడక్షన్‌ బి.ఎ.సుబ్బారావు నిర్వహించారు.
రాధిక
ఆర్‌. బాలసరస్వతి, పద్మనాభరావు ముఖ్యపాత్రలు పోషించిన 'రాధిక' చిత్రాన్ని శ్రీ ఛత్రపతి పతాకాన ఆర్‌.పార్థ సారథి నాయుడు నిర్మించారు. కాళ్ళకూరి సదాశివరావు ఈ చిత్రానికి దర్శకుడు. అంతకుముందు చింతామణి, కుచేల, సులోచన, లంకా దహనం చిత్రాలను డైరక్ట్‌ చేసారు కాళ్ళకూరి సదాశివరావు.
బ్రహ్మరథం
భక్త మార్కండేయ, మైరావణ, దక్షయజ్ఞం, భక్త ప్రహ్లాద, సంసారనారది చిత్రాలకు దర్శకత్వం నెరపిన చిత్రపునారాయణ మూర్తి దర్శకత్వంలో శ్రీ వెంకట్రామా పతాకాన 'బ్రహ్మరథం' చిత్రం నిర్మించారు. అద్దంకి, జయమ్మ ఈ చిత్రానికి ముఖ్య పాత్రధారులు.
సోర్స్- ఆంధ్రప్రభ న్యూస్,   వి.ఎస్‌.కేశవరావ్‌

నాడు కళకళ.. నేడు వెలవెల


సోర్స్-  Sakshi 
పల్నాటి చరిత్రకు సజీవసాక్ష్యాలుగా నిలిచిన చారిత్రక కట్టడాలు కనుమరుగవుతున్నాయి. నేటి తరానికి వాటి గురించి తెలియకపోవడం, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఆదరణ కోల్పోతున్నాయి. పల్నాటి చరిత్రలో ప్రాముఖ్యతను సంపాదించుకున్న కట్టడాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. దాచేపల్లి మండలం గామాలపాడులో ఉన్న చెన్నమల్లికార్జున స్వామి ఆలయం ప్రస్తుతం అలాంటి దుస్థితిని ఎదుర్కొంటోంది.

గలగలపారే జీవనది నాగులేరు ఒడ్డున, ఆధ్యాత్మికతను పెంపొందించేలా 12వ శతాబ్దంలో నాటి జిట్టగామాలపాడు గ్రామంలో శ్రీచెన్నమల్లికార్జునస్వామి దేవాలయాన్ని నిర్మించారు. పల్నాటి బ్రహ్మనాయుడు మాచర్లలో చెన్నకేశవస్వామి ఆలయాన్ని నిర్మిస్తే, పల్నాటి తొలి మహిళ మంత్రి నాయకురాలు నాగమ్మ ఈ ఆలయాన్ని సుందరంగా కట్టించారు. పూర్వీకుల ప్రభువు కల్యాణ చక్రవర్తుల వాస్తు ప్రకారం 32 అడుగుల ఎత్తు, 27 అడుగుల వెడల్పుతో ఆల యం నిర్మితమైంది. ఆలయానికి నాలుగువైపులా పార్వతి, భైరవుడు, గణపతి, దుర్గాదేవి ఆలయాలను కట్టించారు. ద్వార బంధాలపై దిండిమొండి విగ్రహాలను ఏర్పాటుచేశారు. ఆలయ పై భాగంలో గజలక్ష్మిలను రాళ్లపై చెక్కారు.

గర్భగుడి ముందు చెన్నమల్లికార్జున స్వామి దేవాలయంగా శిలాశాసనం చెక్కించారు. నైరుతి దిక్కున ఉమమహేశ్వరుల విగ్రహం, దక్షిణం, తూర్పున ఆలయంలో ప్రవేశించేందుకు మెట్లమార్గం, ఈశాన్యం వైపున కోనేరు, ఆగ్నేయం వైపు సప్తమాతల విగ్రహాలను ఏర్పాటుచేశారు. ఆలయం చుట్టూ 3 అడుగుల వెడల్పు, ఎనిమిది అడుగుల ఎత్తులో నిర్మించిన కోటగోడ కనిపిస్తుంటుంది. నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లపై అద్భుత శిల్పాలను చెక్కారు. క్షీరసాగర మదనం, గజలక్ష్మీలతో పాటు వివిధ రకాల శిల్పాలను రాళ్లపై చెక్కారు. అప్పట్లో ఆలయానికి వచ్చిన నలగామరాజు విశ్రాంతి తీసుకునేందుకు నాయకురాలు నాగమ్మ ఏర్పాట్లు చేసినట్లు చరిత్ర చెబుతోంది. అప్పుడు నాగమ్మ పనితీరును మెచ్చిన నలగామరాజు మంత్రి పదవి ఇచ్చినట్లు చెబుతుంటారు.

నేడు కళా విహీనం.: నాడు ఎంతో వైభవంగా వెలుగొందిన ఆలయం నేడు కళా విహీనంగా మారి వెలబెలబోతోంది. ఆలయ గర్భగుడిలో నిధులు ఉన్నాయనే అనుమానంతో కొందరు దుండగులు తవ్వకాలను జరిపారు. ఆలయం ముందున్న కోనేరులో చిన్నపాటి బ్లాస్టింగ్ చేసినట్లు అక్కడి పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. ఆలయం చుట్టూ కూడా తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు ఉన్నాయి. దేవాలయానికి 22 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా ఆక్రమణలు పోనూ ప్రస్తుతం 10.40 ఎకరాలే మిగిలింది. పురావస్తుశాఖ ఈ ఆలయాన్ని రక్షిత కట్టడంగా గుర్తించినా, రక్షణ కోసం తీసుకున్న చర్యలు తీసుకోలేదు.  పురావస్తుశాఖ, ప్రభుత్వం స్పందించి పల్నాటి చరిత్రకు సజీవసాక్ష్యంగా నిలిచిన ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

మార్మోగిన పల్నాటి రణ భేరి

 

సమ్మోహితులను చేసిన శ్రీదేవి సిస్టర్స్ బుర్రకథ

బ్రహ్మనాయుడు రోషంతో మీసం తిప్పితే నాయకురాలు నాగమ్మ ముంజేతి రోమాలు రోషాగ్నులై భగ్గుమన్నాయి. మగువ మాంచాల మానోహర సుందర రూపమే బ్రహ్మనాయుడి పుత్రుడి ప్రేమగీతమై పరవశించింది. అలరాజు ఆగ్రహం...నాయకురాలి కుతంత్రాలు...పద్యాలై పరవళ్లుతొక్కాయి. నరసింగుడి రాణువ... బాలచంద్రుడి తెగువ కత్తులు దూసి నెత్తురోడ్చి నేలకూలాయి. దాయాదుల రాజ్య కాంక్ష, ఆరాటాలు, పోరాటాలు, నాగులేటి నేలమీద చిత్తుగా ఓడి నెత్తురోడ్చాయి. గురుజాల నాగమ్మ పుంజు.. మాచర్ల బ్రహ్మన్న పుంజు.. కాళ్లకు కత్తులు కట్టి రెక్కలెత్తివచ్చి పోరాడుతున్నాయా అన్నట్టు పురమందిరంలో యుద్ధ వాతావరణం కనిపించింది. ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు నిర్వహించడంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న సింహపురి సంగీత సభ మంగళవారం రాత్రి వికృతి నామ సంవత్సర తెలుగు ఉగాది పర్వదిన వేడుకల సందర్భంగా బుర్రకథను ఏర్పాటుచేశారు. ఒంగోలు సాయి బుర్రకథ దళం శ్రీదేవి సిస్టర్స్ వేదవతి భాగవతారిణి (ప్రధాన కథకులు) శ్రీదేవీ భాగవతారిణి (హాస్యం), భారతి (వంత) ప్రదర్శించిన పల్నాటి యుద్ధం బుర్రకథ పుర మందిర ప్రేక్షకులను 900 సంవత్సరాల వెనక్కు తీసుకువెళ్లింది. లాగులేటి ఒడ్డున జరిగిన పల్నాటి యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూపించింది. టివిలు, సినిమాలతో విసిగి వేసారుతున్న నగర ప్రజలకు శ్రీదేవి సిస్టర్స్ తమ బుర్రకథతో ఆనందాన్ని కలిగించారు. కధాగమనం కరుణ, వీర రసాలు ప్రధానంగా సాగేదే అయినా సందర్భోచితమైన హాస్యం, లాస్యం, శృంగార రసాలుసైతం పండించింది. మరుగున పడిపోతున్న ప్రాచీన జానపద కళారూపాలను ఒక్కసారిగా తెరపైకి తెచ్చి వాటిలోని మాధుర్యాన్ని ప్రేక్షకులకు చవిచూపించారు. సాధారణంగా మహిళలు హరికథలు చెప్పడం అందరికీ తెలిసిన విషయమే అయినా బుర్రకథలు చెప్పే మహిళలు చాలా తక్కువమందే ఉంటారు. ఎక్కువ భాగం బుర్రకథలు వీర రస ప్రధానమైనవి కావడం వల్ల సహజసిద్ధమైన ఒడ్డుపొడుగు కలిగి, ఆకార, ఆహార్యాల్లో ప్రత్యేకత కలిగిన పురుషులే బుర్ర కథలు చెప్పడంలో రాణిస్తుంటారు. ఇందుకు పూర్తి భిన్నంగా ఆకార, ఆహార్యాల కంటే ప్రతిభా పాఠవాలే కథకులకు ప్రధాన అర్హతలని చాటి చెపుతూ శ్రీదేవి సిస్టర్స్ ప్రదర్శించిన పల్నాటి యుద్ధం బుర్రకథ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుని పల్నాటి యుద్ధాన్ని బుర్ర కథ రూపంలో అదికూడా కేవలం 3గంటల్లో చెప్పడం చాలా కష్టమైన విషయం. టివి, సినిమాలకు అతుక్కుపోయేవారిని సైతం పురమందిరానికి రప్పించి మూడు గంటలపాటు కూర్చోబెట్టగలిగిన ఘనత శ్రీదేవి సిస్టర్స్‌కే దక్కిందంటే అతిశయోక్తి కాదు. ఆకార, ఆహార్యాల్లోని లోపాలను సైతం అధిగమిస్తూ సహజసిద్ధంగా సంక్రమించిన హావ, భావ నాట్య, నటనా చమత్కార విన్యాసాలతో, కథకులు ఆద్యంతం కథా గమనాన్ని రక్తి కట్టించారు. నేటి తరానికి తగ్గట్టుగా సినిమా పాటలు, ధ్వన్యనుకరణ, జోకులు, పిట్టకథలు జోడిస్తూ కథను ముందుకు నడిపిన తీరు అద్భుతం. ముఖ్యంగా నలగామ నాయుడు గుర్రం ఎక్కి వేటకు వెళుతున్న దృశ్యాన్ని మిమిక్రీ ద్వారా కళ్లముందు ఆవిష్కరించిన తీరుకు ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు. గురుజాల మాచెర్ల కోడిపుంజలు వీర శివాలెత్తి పోరి తన్నుకున్న వర్ణన తరతరాల తెలుగు సంప్రదాయ లోటుపాట్లను ఎత్తి చూపింది. రాయబారంలో అలరాజు ఆగ్రహాన్ని అలవోకగా భరించిన నాగమ్మ అదును చూసి విషం ప్రయోగించడం ద్వారా అతడిని మట్టుపెట్టిన విధానం ఉత్కంఠత రేపింది. కదన కుతూహలంతో బాలచంద్రుడుర భార్య మాంచాల అందాన్ని చూసిన ఘట్టంలో కథకులు పండించిన సుకుమార శృంగారం అద్భుతంగా ఉంది. అంతలోనే ఫటఫట పళ్లు కొరుకుతూ బాలచంద్రుడు యుద్ధ రంగంలోకి ఉరికిన వైనాన్ని వీర రస ప్రధానంగా అభినయించిన తీరు ప్రేక్షకుల ఉత్కంఠ కలిగించింది. యుద్ధ భూమిలో నరసింహుడి కత్తివేటుకు బాలచంద్రుడి పేగులు బయటకు పెళ్లుకు రావడం ఆ పేగుల రక్తాన్ని నాగులేటి నీటితో కడిగి తిరిగి పొట్టలో కూర్చుకుని రక్తసిక్తమైన రూపంతోనే కదన కుతూహలుడైన విధానాన్ని వర్ణించిన తీరు ప్రేక్షకులకు గగుర్పాటు కలిగించింది. బాలచంద్రుడు మరణించడం, మరణవార్త తెలుసుకుని బాలచంద్రునిపైబడి తండ్రి బ్రహ్మనాయుడు రోధించిన విధానాన్ని కరుణ రసం ఉట్టిపడేలా హృద్యంగా పద్యంలో చెప్పిన తీరు ప్రేక్షకులను కన్నీటి పర్యంతం చేసింది. జనరంజకంగా మహిళలు బుర్రకథను చెప్పడం చాలా అరుదైన విషయం. ఆటను ఆధునికంగా, పాటను పాటవంగా, పద్యాన్ని హృద్యంగా, మాటను మధురంగా, సన్నివేశాన్ని సందర్భోచితంగా ఆడిపాడి పలికి, నటించి, నర్తించి నేటి తరానికి సైతం మెచ్చేలా ప్రేక్షకులను ఒంగోలు సిస్టర్స్ మంత్రముగ్థులను చేశారు. ఈకార్యక్రమంలో యజ్ఞనారాయణ కీబోర్డు, బాబూరావు డోలక్‌పై సహకరించారు. జిల్లా కలెక్టర్ కె రాంగోపాల్ దంపతులు, పలువురు అధికారులు, అనధికారులు, రాజకీయనాయకులు, పుర ప్రముఖులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. కథకులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమాన్ని సింహపురి సంగీత సభ అధ్యక్ష, కార్యదర్శులు వాకాటి విజయకుమార్‌రెడ్డి, బివి నరసింహం పర్యవేక్షించారు.

Thursday 4 December 2014

కన్నెగంటి హన్మంతు

పల్నాడు తాలూకాలో జరుగుతున్న పన్నుల నిరాకరణ, ప్రభుత్వ వ్యతిరేక సహాయ నిరాకరణోద్య మాన్ని చూసిన యువకుడు కన్నెగంటి హన్మంతు- జిల్లాలో అనేకమంది గ్రామాధికారులు రాజీ నామాలిచ్చి సహాయ నిరాకరణోద్యమానికి తోడ్పడు తుంటే- మించాలపాడు గ్రామాధికారులు మాత్రం ప్రభుత్వానికి విశ్వాసపాత్రులుగా వున్నారు.  గ్రామంలో ప్రజలందరినీ ఏకం చేసి పుల్లరి వ్యతిరేక ఉద్యమానికి నాందిపలికాడు. ఆజానుబాహుడు, ఆత్మబలశాలి, హన్మంతు ఆ గ్రామ ప్రజలందరికీ ఆప్తుడుగా వున్నాడు. హన్మంతు నాయకత్వాన ప్రజ లంతా కదిలారు. పుల్లరి లేదు గిల్లరి లేదు. అడవి సంపద మన పేద వాళ్లదేన న్నారు. ఇన్నాళ్ళు సాగిన దోపిడీ, దౌర్జన్యం ఇక చెల్లదన్నారు.
పుండాకోరు మునసబ్‌ ప్రభుత్వానికి రిపోర్టు పంపాడు. అది ప్రజలు గమనించారు. మునసబ్‌- కరణం ఉద్యమ ద్రోహులుగా భావించి-వారిని సాంఘికంగా బహిష్కరించారు. ఇంతకాలం సాగిన వారి పెత్తనం కూలిపోయింది. ప్రజలు మేలు కున్నారు. దీనంతటికీ కారణం హన్మంతేనని- లేనిపోనివన్నీ కల్పించి కలెక్టర్‌కు మొరపెట్టు కున్నాడు మున్సబు. జిల్లాకలెక్టర్‌ వెర్నన్‌, అడిషనల్‌ కలెక్టర్‌ పేరుమోసిన క్రూరుడు రూధర్‌ఫర్డు. మించాలపాడు ఘటనలు తీవ్ర రూపం దాల్చాయని ప్రకటించారు. అటవీ అధికారులు, పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. మాచర్లకు 20 మైళ్ళ దూరంలో వుంది మించాలపాడు. 1922 ఫిబ్రవరి 26, 20 మంది పోలీసు బలగంతో ఎస్‌.ఐ. మించాలపాడు చేరాడు. వారికి తోడుగా అసిస్టెంట్‌ ఫారెస్టు కంజర్‌వేటర్‌ - మరో 20 మంది పోలీసు బలగంతో వచ్చాడు. వారితోపాటు కరణం వున్నాడు. అడవిలో మేస్తున్న గేదెలు, ఆవులను తోలుకెళుతున్నారు. ఈ వార్త గ్రామంలో వున్న హన్మంతుకు, ప్రజలకు అందింది. వందలాది మంది స్త్రీలు, పురుషులు వెళ్ళి వారికి అడ్డునిలిచారు. పశువుల్ని, పశువుల కాపరులను వదిలేయమన్నారు. అధికార బలంతో పోలీసులు ప్రజలపై బలప్రయోగానికి పూనుకున్నారు. మాటల తో లాభంలేదు - పిరికి పందల్లా కూర్చోలే మన్నాడు హన్మంతు. ఆడ,మగ తేడాలేకుండా ప్రజలు దొరి కిందల్లా అందుకున్నారు. కర్రలు, రోకళ్ళు, రాళ్ళు, రప్పలు తీసుకొని పోలీసులపై విరుచుకుపడ్డారు. పశువులు, పశుల కాపరులను విడుదల చేసుకున్నారు. ఇది ప్రభుత్వానికి తలవంపు అయ్యింది. ఎలాగైనా హన్మంతును హతమార్చాలని కుట్ర పన్నారు.
అప్పుడు కారంపూడిలో బసచేసివున్న కలెక్టర్‌కు యీ వార్తచేరింది. అదనపు బలగాలు దిగాయి (స్వయంగా అడిషనల్‌ కలెక్టర్‌ రూధర్‌ఫర్డు 100 మంది సైనికులతో వచ్చాడని మరో చరిత్ర)
తిరిగి పోలీసుబలగాలకు ప్రజలకూ మధ్య పోరాటంసాగింది. పోలీసుల చేతుల్లో మారణా యుధాలున్నాయి. ప్రజల చేతుల్లో కర్రలు-రాళ్ళు మాత్రమే వున్నాయి. అయినా ప్రజల పట్టుదల - హన్మంతు నాయకత్వం వారిని రౌద్రమూర్తులను చేసింది. పోలీసులు తుపాకులను పేల్చారు. చెట్టు - రాయి అడ్డుపెట్టుకుని ప్రజలు రాళ్ళు విసిరారు. ''మీకేకాదురా మాకూ ప్రజాబలముంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా కదిలివచ్చి - మీ అంతం చూస్తారని'' ఆడవాళ్ళు హెచ్చరించారు.
పోరాటం సాయంత్రం 4-5గంటల మధ్య జరిగిందని జిల్లాకలెక్టర్‌ తన రిపోర్టులో తెలియ జేశాడు. అదే రిపోర్టులో తాను మాచర్ల నుండి జిల్లా పోలీసు సూపరింటెండెంటు, జిల్లా అటవీ అధికారి, యితర బలగంతో మించాలపాడు చేరుకున్నట్లు రాశారు. కాబట్టి పోరాటం కలెక్టర్‌ రూధర్‌ఫర్డు ప్రత్యక్ష పర్యవేక్షణలోనే జరిగిందనడంలో సందేహంలేదు. పోరాట యోధుడుగా, ధైర్యసాహ సాలు ప్రదర్శించిన హన్మంతు ప్రాణాలు తీయడం వారి ప్రధాన కర్తవ్యంగా ఎంచుకున్నారు. పోరాటం లో ముందు నిలిచిన హన్మంతు గుండెకు గురిపెట్టారు. వీరుడుగా హన్మంతు ఒరిగిపోయాడు. అతనితో పాటు మరో రైతుబిడ్డ - పోలీసు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, గుర్రాన్ని మేపే అమాయకుడు హతుల య్యారు. అనేకమంది గాయపడ్డారు. హన్మంతు మరణం తర్వాత చాలామందిని అరెస్టుచేశారు. స్వాతంత్య్ర సమరంలో తెలుగునేలపై తొలివీరుడు కన్నెగంటి హన్మంతు 1922 ఫిబ్రవరి 26న ఒరిగిపోయాడు. హన్మంతు మరణవార్త ఆంధ్రప్రదేశంలో అగ్నిజ్వాలలు రేపుతుందని ప్రభుత్వానికి తెలుసు. హన్మంతు, తాగుబోతు-తిరుగుబోతు- పేరుమోసిన రౌడీ, ప్రజల మాన - ప్రాణాలతో చెలగాటమాడే ద్రోహి అని, అధికారులను చంపడానికి ప్రయత్నించాడని ప్రచారం చేశారు. ఇదే విషయాన్ని కలెక్టర్‌ ప్రభుత్వ కార్యదర్శికి పంపిన రిపోర్టులో రాశాడు.
ప్రభుత్వంతోపాటు కాంగ్రెస్‌ నేతలు కూడా హన్మంతుకు అన్యాయం చేశారు. దాన్నొక అరాచకంగానే భావించారు. హన్మంతు త్యాగాన్ని గుర్తించలేదు. కానీ, మించాలపాడు, పల్నాడుప్రాంత ప్రజలు మాత్రం అమరవీరుడు హన్మంతుకు అశ్రునయనాలతో జోహారులర్పించారు. పలనాటి వీరుడిగా కొనియాడారు. తమ హృదయాల్లో ఆ వీరుని త్యాగాన్ని పదిలపరుచుకున్నారు. మించాలపాడులో స్మారక చిహ్నం నిర్మించుకున్నారు. హన్మంతు మరణించిన రెండు సంవత్సరాలకు - మరో ఆంధ్రవీరుడు అల్లూరి సీతారామరాజు అమరత్వమొందిన తర్వాత 1924 అక్టోబరు 19 నాడు - ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ హన్మంతు త్యాగాన్ని గుర్తించింది.
''1922 - ఆంధ్రప్రదేశ్‌లో సహాయ నిరాకరణోద్యమం ముమ్మరంగా సాగుతున్నపుడు, గుంటూరు జిల్లా, పల్నాడు తాలూకా మించాలపాడులో పుల్లరి చెల్లించలేదన్న కారణంగా కన్నెగంటి హన్మంతుని క్రూరంగా చంపిన కొంతమంది అధికారుల దుష్టచర్యను యీ మహాసభ ఖండిస్తున్నది. ఆ మహావీరునికి జోహారులర్పిస్తున్నది. వారి కుటుంబ సభ్యులకు సంతాప, సానుభూతిని తెలియజేస్తున్నది. ఆ వీరుని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నది. హన్మంతు మరణానంతరం అతని భార్య, కుటుంబసభ్యులు స్థూపంవద్ద అతని జీవిత విశేషాలతో నెలకొల్పిన ఫలకాన్ని ధ్వంసం చేసిన అధికారుల అక్రమచర్యను గర్హిస్తున్నది. ఆ ఫలకాన్ని తిరిగి నెలకొల్పాలని అందులో యీ విధ్వంస చర్యను కూడా రాయాలని యీ మహాసభ కోరుతున్నది. ఇందుకోసం పూనుకోవాలని తీర్మానిస్తున్నది''?
అభినవ బాలచంద్రుడు - అస్తమించాడు. సంవత్సరాలు గడిచాయి. హన్మంతు పేరు, హన్మంతు ఊరు, హన్మంతు త్యాగం చరిత్రలో మరుగున పడిపోయింది.

courtesy visalaandhra -కందిమళ్ళ ప్రతాపరెడ్డి

బంగారు చరితల కుండ నాగార్జున కొండ

బంగారు చరితల కుండ నాగార్జున కొండ
చారిత్రక భాండాగారంగా భాసిల్లుతున్న రమణీయ ప్రదేశం నాగార్జునకొండ. నాగార్జునసాగర్‌ జలాలపై లాంచ్‌లో 14 కి.మీ. ప్రయాణించి నాగార్జున కొండకు చేరుకోవచ్చు. దీన్నే పూర్వం 'శ్రీపర్వతం' 'విజయపురి' అని పిలిచేవారు. ఆచార్య నాగార్జునుని బోధనలు వెల్లివిరిసిన చోటు కావడంతో దీనికి నాగార్జున కొండ అనే పేరు వచ్చింది. ఒకవైపు కృష్ణానది నీటితో, మిగిలిన మూడువైపులా నల్లమల కొండలతో పరివేష్టితమై ఈ నాగార్జునకొండలోయ 25 కి.మీ విస్తీర్ణంలో ఉంది. తొలిసారిగా 1926లో మద్రాసు పురావస్తు శాఖలో పనిచేసే ఎ.ఆర్‌. సరస్వతి నాగార్జున కొండను కనుగొన్నాడు. ఈ ప్రాంతంలో తొలిసారిగా త్రవ్వకాలు నిర్వహించిన వ్యక్తి ఎ. హెచ్‌. లాంగ్‌ హార్ట్‌. అనంతరం టి.ఎన్‌. రామచంద్రన్‌, ఆర్‌. సుబ్రహ్మణ్యం ఇక్కడ త్రవ్వకాలు జరిపారు. మనదేశం తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చొరవతో భారత పురావస్తుశాఖ 1954 తరువాత ఆరు సంవత్సరాలు త్రవ్వకాలు జరిపి అనేక అంశాలు వెలుగులోకి తెచ్చారు.
పూర్వయుగంనాటి అవశేషాలు
నాగార్జున కొండ త్రవ్వకాల్లో చరిత్ర పూర్వయుగ అవశేషాలు అనేకం బయల్పడినాయి. ఇవి భూమి ఉపరిభాగాన, నదీ తీరంలో లభించాయి. ప్రాచీన, మధ్య, నవీన, శిలాయుగ పరికరాలు ఇచ్చట దొరికాయి. రాతి గొడ్డళ్లు, మొనతేలిన రాతి పనిముట్లు, బూడిదరంగు కుండపెంకులు లభ్యమైనాయి. పెద్ద మట్టి పాత్రలో పసిపాపను పెట్టి పూడ్చిన సమాధి, రాగి ముక్కలుకూడా లభించాయి. ఇంకా పుర్రెలు, అస్థికలు, సమాధిలో కుండ సామాగ్రి దొరికాయి.

శాతవాహన యుగం నాటి అవశేషాలు
శాతావాహన యుగంనాటి నాణాలు, పూసలు, మట్టిబొమ్మలు, ఇనుపవస్తువులు, బంగారు ఆభరణాలు దొరికాయి. లభించిన నాణాలలో రోమన్‌ చక్రవర్తికి సంబంధించినవి రెండు, యజ్ఞశ్రీ కాలంనాటి సీసపు నాణాలు కూడా లభించాయి. బౌద్ధవిశ్వవిద్యా లయం, సింహళవిహారం బయల్పడినాయి.
ఇక్ష్వాకుల కాలంనాటి విశేషాలు
శాతవాహనుల -వీరాంధ్రలో ఇక్ష్వాకులు విజయపురిని రాజధానిగా చేసుకొని రాజ్యమేలారు. వీరిశాసనాలు దాదాపు 45 వరకు దొరికాయి. ఈ కాలంనాటి రాజులు వైదిక మతాన్ని అవలంభించారు. కానీ అంత:పుర స్త్రీలు బౌద్ధమతాన్ని ఆదరించారు. వీరి ఆదరణలో నాగార్జునకొండ సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రమైంది.

బౌద్ధ అవశేషాలు
నాగార్జున కొండలో లాంగ్‌హార్ట్స్‌ అనే వ్యక్తి నిర్వహించిన త్రవ్వకాల్లో అనేక సత్ఫలితాలు గోచరించాయి. ఒక మహాచైత్యము, ఆరు గజపుష్పాకార చైత్యగృహాలు, ఎనిమిది చిన్న స్తూపాలు, నాలుగు మంటపాలు బయల్పడినాయి. రామచంద్రన్‌ జరిపిన త్రవ్వకాల్లో రెండు చైతన్యగృహాలు, ఆర్‌. సుబ్రహ్మణ్యం జరిపిన త్రవ్వకాల్లో, 26 విహారాలు, 10 స్తూపాలు లభ్యమైనాయి.
స్థూపం:- నాగార్జున కొండపై బయల్పడిన స్తూపాలు చక్రాకృతిలో నిర్మించబడినాయి. ఆకులవలె నిర్మితమైన గోడల మధ్య ప్రదేశాన్ని మట్టితో నింపి, దాని చుట్టూ ఇటుక కట్టడం కట్టి దానిపై అండము నిర్మించారు. నిర్మాణంలో ఇటుకలు, సున్నం వాడబడినాయి. విహారాలు:- నాగార్జున కొండపై సింహళ విహారం బయల్పడింది. ఈ విహారంలోగల బోధివృక్షానికి బోధిశ్రీ ఒక వేదికను నిర్మింప జేసింది. నాగార్జున కొండలోని స్తూపాలు, చైత్యగృహాలు, విహారాలు, విహార నిర్మాణానికి కావలసిన శిల్పఫలకాలను అనేక మంది వర్తకులు, స్త్రీలు దానం చేసినవి.
బౌద్ధశిల్పాలు:- వీటిలో రెండురకాలున్నాయి. పూర్తిగా స్వదేశీయమైనవి. ఇది సాంచీ శిల్పాలకు సన్నిహితంగా ఉంటాయి. రెండో రకం శిల్పాలలో గాంధార లక్షణాలు కనిపిస్తాయి. లాంగ్‌ హార్ట్స్‌ జరిపిన త్రవ్వకాలలో 500పైగా శిల్పాలు వెలుగులోకి వచ్చాయి. ఈ శిల్పాల్లో బౌద్ధమతానికి చెందిన జాతక కథలు, బుద్ధుని జీవిత విశేషాలు కనిపిస్తాయి. ఇంకా అనేక భంగిమలలో బుద్ధుని ప్రతిమలు లభించాయి. నాగార్జున కొండలో కవచం ధరించిన ఒక వీరుని విగ్రహం లభించింది.
బ్రాహ్మణదేవాలయాలు:- ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధమతం తో పాటు బ్రాహ్మణమతం కూడా ఎంతో అభివృద్ధి చెం దింది. నాగార్జునకొండ త్రవ్వకాల్లో బయల్పడిన బ్రాహ్మణ దేవాలయాలు ఇక్ష్వాక రాజుల వైదికమత అభిమానానికి నిదర్శనాలు. ఇక్కడ నిర్మితమైన ఆలయాలలో భుజ స్వామి, పుష్పభద్రస్వామి, హారీతి, సర్వదేవ, కార్తికేయ, నవగ్రహ దేవళాలు, శిల్పాలలో కార్తికేయ, దేవసేన, సతిశిల్పం ఇత్యాది బ్రాహ్మణ శిల్పాలు ముఖ్యమైనవి.
మ్యూజియం:- ఇక్ష్వాక రాజ్య పతనానంతరం పల్లవుల కాలంలో బౌద్ధమతం క్షీణించడం ప్రారంభమైంది. పోయినవి పోగా మిగిలిన మట్టిపాత్రలు, శిల్పాలు, నాణాలను నాగార్జున కొండపై నిర్మితమైన మ్యూజియంలో పర్యాటకుల సందర్శనార్థం భద్రపరిచారు. నదీ ప్రవాహం మధ్యలో ఎత్తైన కొండమీద మ్యూజియం నిర్మించడం బహుశా నాగార్జున కొండపై ఇదే ప్రథమమని చెప్పవచ్చు.
సోరుసు --షేక్‌ అబ్దుల్‌ హకీం జాని, ఆంధ్రప్రభ పత్రిక

నాగార్జునకొండ మ్యూజియం

    చరిత్రకు సాక్ష్యం..
    నాగార్జునకొండ మ్యూజియం
    అపారమైన కళా సంపద లభ్యం
    విశేషంగా ఆకట్టుకుంటున్న పురావస్తు ఆధారాలు
    దేశ, విదేశాల నుంచి పర్యాటకుల రాక
    నేడు వరల్డ్ మ్యూజియం డే 
    చరిత్రకు నిలువెత్తు నిదర్శనంగా నాగార్జున కొండ మ్యూజియం నిలుస్తోంది. ఇక్కడ పురాతన వస్తువులు, చరిత్రకు సంబంధించిన ఆధారాలు, బుద్ధుడి విశేషాలు లభిస్తున్నాయి. వీటి గురించి తెలుసుకునేందుకు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. నేడు వరల్డ్ మ్యూజియం డే సందర్భంగా ఒకసారి నాగార్జున కొండ మ్యూజియం గురించి తెలుసుకుందాం..

    - టీ మీడియా, నాగార్జునసాగర్
    నాగార్జునసాగర్‌కు సమీపంలో కష్ణానది రిజర్వాయర్ మధ్యనున్న నాగార్జునకొండ మ్యూజియం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచింది. ఇక్కడికొచ్చిన పర్యాటకులు బుద్ధుడి ప్రతిమకు ప్రత్యేక ప్రార్థనలు, పూజలు నిర్వహిస్తుంటారు. ప్రపంచంలో మానవ నిర్మిత జీవి మ్యూజియంలో ఇది మూడోది. మహాయాన బౌద్ధ ప్రవక్త ఆచార్య నాగార్జునుడి మహా విశ్వవిద్యాలయం, బుద్ధుడి మహాస్తూపం, విశాలమైన వివిధ భిక్షు విహారాలు మొదలైన వాటితో ఇక్షాకుల రాజధానిగా విరసిల్లిన విజయపురి ప్రాంతం సాగర్ గర్భంలో ముంపునకు గురికాకుండా పురావస్తు శాఖ అక్కడి విశేష సామాగ్రిని పరిరక్షించి నాగార్జునకొండ మ్యూజియంలో భద్రపరిచింది.

    అందులోని రాజ్యచౌదాలు, సింహాల విహారం, పాతరాతి యుగం, నాటి సమాధుల మధ్య కొత్తరాతి యుగంలోని పరికరాలు ఆకాలంలో వాడుకలోని బంగారు నగలు, నాణేలు, ఇతర పనిముట్లు, శిలాశాసనాలు, తదితర వస్తువులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నాగార్జునకొండ లోయలో బౌద్ధ శిథిల అవశేషాలు, ఇక్షాకుల విజయపురి శిథిలాలు ఏవిధంగా బయట పడ్డాయే వాటిని అదేవిధంగా పొందుపర్చారు. 
    ఇక్షాకుల శిలాశాసనలు, వారి జీవిత విశేషాలు, చౌదా స్తంభాలు, తదితరమైనవి సైతం మ్యూజియంలో ఉన్నాయి. విరిగిపోయిన శిల్పాలను అతికించి వాటి పూర్వపు ఆకారాన్ని కళ్లకు కట్టడం ఈ మ్యూజియంలోని ప్రత్యేకత. ఇక్కడి శిలలు, గౌతమ బుద్ధుని జీవిత విశేషాలు, ఆయన జాతక కథలు, మొదలైన వాటిని విపులంగా విశదీకరిస్తాయి. ఇవి నాటి శిల్పుల పనితనానికి నిదర్శనంగా నిలుస్తాయి. మ్యూజియం చుట్టుపక్కల ఉన్న కొన్ని కట్టడాలు వాటి పరిస్థితులను కళ్ల ముందు నిలుపుతాయి. 

    నాగార్జున విశ్వవిద్యాలయం..
    నాగార్జున విశ్వవిద్యాలయ శిథిలాల శేషాలు నాగార్జునకొండ లోయలో ఏవిధంగా ఉండేవో అదే విధంగా తిరిగి అమర్చారు. కష్ణానది తీరాన విశాల విస్తీర్ణంలో ఈ విశ్వవిద్యాలయం ఉండేది. ఇది ప్రాచీన కాలపు గురుకులం. ఇక్కడ గురుశిష్యు నివాసాలు ఒకే దగ్గర ఉండేవి. సకల శాస్త్ర విజ్ఞాన కేంద్రమైన ఇది సమస్త విద్యలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఈ విశ్వ విద్యాలయంలో చైత్యగహానికి తూర్పున మూడు భాగాల ద్వారం ఒకటి ఉంది. ఒకే విహార భాగం ఐదు గదులు కలిగి మధ్య భాగంలో 55అడుగుల చతురాస్ర్తాకార మండపం ఉంది. దీన్ని విశ్వవిద్యాలయ లెక్చరర్ హాల్‌గా భావించేవారు. ఇక్కడ ఉన్న మరో మూడు గదులు బుద్ధ ధర్మ సంఘం, బౌద్ధ ఇక్షాక చిహ్నాలు కావచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయంలో సర్క, తంత్ర, ఖనిజ, రసాయన, ఔషధ శాస్త్ర, శాస్ర్తాలు, మాధ్యమిక వాద, మహాయాన వాదాలను చిత్తశుద్ధులైన పండితులు, ఆచార్యులు బోధించే వారు. విశ్వ ఇక్షాక గ్రంథం, విషుధమగు రచయిత బుద్ధగోషుడు, ఆర్యదేవుడు, రాహువుడు, సిద్ధ నాగార్జునుడు మొదలైన వారు ఇక్కడ ఆచార్యులుగా పని చేసేవారు. ఇక్కడ విద్యను అభ్యసించేందుకు వివిధ దేశాల నుంచి తండోపతండాలుగా వచ్చేవారు. 

    హారతి దేవాలయం..
    విశ్వవిద్యాలయానికి కొద్ది దూరంలోనే హారతి దేవాలయం, దాని కింద చతురస్ర్తాకారంలో ఓ పెద్ద సరస్సు ఉంది. దీనికి నలు వైపులా మొట్లతో ఓడ్డు ప్రాంతాలు ఉన్నాయి. మెట్లపై గ్యాలరీ మాదిరిగా ఉండడంతో దీన్ని క్రీడాప్రాంతంగా భావించినా క్రీడా ప్రాంగణం మరో ప్రాంతంలో బయల్పడింది. 

    స్థాన వేదికం..
    నాగార్జున కొండపై ఇక్షాకుల రాజ్యసౌధ ప్రాగణ్యంలో కష్ణానదిని ఆనుకొని నిర్మించిన స్నానగట్టాల వేదికలు ఉన్నాయి. ఇది కేవలం స్నానాలకే కాక బస్సు సామాగ్రిని, నౌకల ద్వారా రవాణా చేయడానికి కాను రేవుగా సైతం వాడి ఉంటారని తెలుస్తుంది. ఈ స్నానపు గట్టాలు నునుపైన నాపరాళ్లతో చేయబడి నది స్నానానికి ఎంతో సౌకర్యంగా ఉండేవి. 

    కాకతీయ కట్టడాలు.. 
    మ్యూజియానికి సమీపంలోని కోట గోడలాంటి పెద్ద రాతి కట్టడం కాకతీయుల నాటి కట్టడంగా పరిగణిస్తున్నారు. కాకతీయులు ఈ ప్రాంతాన్ని సరిహద్దు సైనిక స్థావరంగా ఉపయోగించుకున్నరు అనడానికి ఈకోట గోడలు ఇప్పటికి సైతం చెక్కుచెదరకుండా ఉన్నాయి. 
    హిందూ దేవాలయాలు..
    కోట గోడలకు సమీపంలో పక్కపక్కనే రెండు హిందూ దేవాలయాలు ప్రాచీనమైనవి దర్శనమిస్తున్నాయి. కాకతీయుల కాలంలో వీటిని నిర్మించారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. ప్రస్తుతం వీటి ఆలనాపాలన లేకపోవడంతో పాడుబడ్డ గబ్బిలాలకు ఆవాసాలుగా మారాయి. 

    మహా చైత్యం 
    ఇది బుద్ధధాతువుపై కట్టిన అందాల చైత్యం. ఈ స్తూపం నుంచి తవ్వి తీసిన ధాతువును ప్రస్తుతం బుద్ధుడి మొదటి ప్రసంగం చేసిన స్థారానదిలో ఉంచి పూజలు చేస్తున్నారు. ఇది శరీరక స్థూప జాతికి చెందినది. దీన్ని అంతర్భాగంలో బుద్ధ భగవానుడి అస్తికలు అమర్చబడి ఉన్నాయి. ఇది ప్రాచీన శిల్ప నిర్మాణ ప్రావీణ్యానికి నిదర్శనం. చక్రం, దాని ఆకులను ఇటుక గోడల్లా నిర్మించి ఆకుల మధ్య ఖాళీ స్థలాన్ని మట్టితో కప్పి స్తూపాకారంగా తయారు చేసి ఉపరితల భాగాన్ని చుట్టుపక్కల పాలరాతి పలకలు కట్టి అర్థగోలాకారంగా ఆశ్చర్యపోయేంత అందంగా దీనిని నిర్మించారు. 

    సింహాల విహారం..
    మహాచైత్యం పక్కనే సింహాల విహారం శిథిలాలు ఉన్నాయి. ఈ విహారంలో బుద్ధుడి విగ్రహాన్ని స్థాపించారు. శాంతి సిరి ఈ విహారానికి ఎన్నో ధానధర్మాలు చేసినట్లు చరిత్ర చెబుతుంది. ఇవికాక ఇంకా కుర్మశతికుండ, ఇక్షాకుల రాజసైదాలు, పతీసహజమణగట్టం, ఆశ్వమేధ యాగశాల, తదితర కట్టడాలు సైతం నాగార్జునకొండలో నిక్షిత్తమై ఉన్నాయి. నాగార్జునకొండ చూడడానికి విజయపురి సౌత్ నుంచి కష్ణానదిలో 14కి.మీ లాంచీ ద్వారా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే పర్యాటకులు ఇక్కడ ఉండేందుకు, చూడడానికి కానీ సమయం కేవలం గంట మాత్రమే ఉండడంతో ఇందుకు సంబంధించిన విశేషాలు పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు. అంతేగాక బుద్ధుడి ధాతువుని దర్శించే యోగం అందరికీ లేదు. ప్రముఖులు, అతిథులకు మాత్రమే అవకాశం కల్పించడం యాత్రికులను నిరుత్సాహ పరుస్తోంది. 
    source: namathe telangana.com

Wednesday 3 December 2014

అలనాటి నాయకురాలు


source  : Sakshi
అలనాటి  నాయకురాలు
ఆమెది ఒక సామాన్యమైన రైతుకుటుంబం. నా అన్న వారందరినీ కోల్పోయినా, కొండంత నిబ్బరం నిండిన ధీరురాలామె. రాజకీయాల వాసనలు, రాచరికపు పోకడలు లేశమంతైనా లేని మామూలు మహిళ. అయితేనేం, అసమానమైన ప్రతిభా సంపత్తితో మహామంత్రిగా ఎదిగిందామె. పురుషాహంకారాన్ని కాలదన్ని, ప్రజారంజకమైన పాలనతో చరిత్రకారుల ప్రశంసలు పొందింది.  దాయాదుల మధ్య చిచ్చుపెట్టి, కుతంత్రాలకు పాల్పడి, పల్నాటి యుద్ధానికి కారకురాలయిందన్నది ఆమెను మరోకోణంలో చూసేవారి మాట. నిజానిజాలు ఎలా ఉన్నా, ఒక స్త్రీ... అందులోనూ ఒక సాధారణ రైతు కుటుంబీకురాలు...   రుద్రమ దేవి, ఝాన్సీ లక్ష్మీ బాయిల కన్న ఎంతో ముందుగానే ఖడ్గం చేబూని, యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్న యోధురాలు. సంస్కృతం, కన్నడం, తమిళం, మళయాళం, తెలుగు భాషలను అనర్గళంగా మాట్లాగలిగిన మేధావి.

అపారమైన ధైర్యసాహసాలతో వీర, ధీర వనితగా పేరు తెచ్చుకోవడం మాత్రమే కాదు, పల్నాటి ప్రాభవం అంతరించినా, పల్నాటి యుద్ధం జరిగి ఇంతకాలమైనా తన పేరును శాశ్వతంగా నిలుపుకున్న ప్రజల మనిషి ఆమె. ఆ ప్రాంత ప్రజలు ఆమెను తమ గుండెల్లో నిలుపుకోవడమే కాదు, నాయకురాలు నాగమ్మగా ఆరాధిస్తున్నారు. ఆమెకు ఒక గుడి కట్టి పూజిస్తున్నారు.

 కారంపూడి పల్నాడుకి రణక్షేత్రమైతే, గురజాల రాజధాని. పల్నాటి యుద్ధవీరులను తలచుకుంటూ ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో సిడిమాను ఊరేగింపు ప్రధానమైనది. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ ఏకాదశి నుంచి మొదలై, కోరల పూర్ణిమ మరునాటి వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. పాతపాటమ్మ ఆలయంలో అమ్మవారికి పదహారు రోజులపాటు సంబరాలు జరుగుతాయి. ఈ నవంబరు ఆరు నుంచి, సిడిమోనోత్సవాలు జరగనున్నాయి. దేశంలో ఎక్కడెక్కడో ఉన్న ఊరి వాళ్లంతా ఈ ఉత్సవాలలో పాల్గొనేందుకు స్వగ్రామానికి రావడం విశేషం.
 - వై.హెచ్.కె. మోహనరావు