Friday 5 December 2014

నాడు కళకళ.. నేడు వెలవెల


సోర్స్-  Sakshi 
పల్నాటి చరిత్రకు సజీవసాక్ష్యాలుగా నిలిచిన చారిత్రక కట్టడాలు కనుమరుగవుతున్నాయి. నేటి తరానికి వాటి గురించి తెలియకపోవడం, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఆదరణ కోల్పోతున్నాయి. పల్నాటి చరిత్రలో ప్రాముఖ్యతను సంపాదించుకున్న కట్టడాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. దాచేపల్లి మండలం గామాలపాడులో ఉన్న చెన్నమల్లికార్జున స్వామి ఆలయం ప్రస్తుతం అలాంటి దుస్థితిని ఎదుర్కొంటోంది.

గలగలపారే జీవనది నాగులేరు ఒడ్డున, ఆధ్యాత్మికతను పెంపొందించేలా 12వ శతాబ్దంలో నాటి జిట్టగామాలపాడు గ్రామంలో శ్రీచెన్నమల్లికార్జునస్వామి దేవాలయాన్ని నిర్మించారు. పల్నాటి బ్రహ్మనాయుడు మాచర్లలో చెన్నకేశవస్వామి ఆలయాన్ని నిర్మిస్తే, పల్నాటి తొలి మహిళ మంత్రి నాయకురాలు నాగమ్మ ఈ ఆలయాన్ని సుందరంగా కట్టించారు. పూర్వీకుల ప్రభువు కల్యాణ చక్రవర్తుల వాస్తు ప్రకారం 32 అడుగుల ఎత్తు, 27 అడుగుల వెడల్పుతో ఆల యం నిర్మితమైంది. ఆలయానికి నాలుగువైపులా పార్వతి, భైరవుడు, గణపతి, దుర్గాదేవి ఆలయాలను కట్టించారు. ద్వార బంధాలపై దిండిమొండి విగ్రహాలను ఏర్పాటుచేశారు. ఆలయ పై భాగంలో గజలక్ష్మిలను రాళ్లపై చెక్కారు.

గర్భగుడి ముందు చెన్నమల్లికార్జున స్వామి దేవాలయంగా శిలాశాసనం చెక్కించారు. నైరుతి దిక్కున ఉమమహేశ్వరుల విగ్రహం, దక్షిణం, తూర్పున ఆలయంలో ప్రవేశించేందుకు మెట్లమార్గం, ఈశాన్యం వైపున కోనేరు, ఆగ్నేయం వైపు సప్తమాతల విగ్రహాలను ఏర్పాటుచేశారు. ఆలయం చుట్టూ 3 అడుగుల వెడల్పు, ఎనిమిది అడుగుల ఎత్తులో నిర్మించిన కోటగోడ కనిపిస్తుంటుంది. నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లపై అద్భుత శిల్పాలను చెక్కారు. క్షీరసాగర మదనం, గజలక్ష్మీలతో పాటు వివిధ రకాల శిల్పాలను రాళ్లపై చెక్కారు. అప్పట్లో ఆలయానికి వచ్చిన నలగామరాజు విశ్రాంతి తీసుకునేందుకు నాయకురాలు నాగమ్మ ఏర్పాట్లు చేసినట్లు చరిత్ర చెబుతోంది. అప్పుడు నాగమ్మ పనితీరును మెచ్చిన నలగామరాజు మంత్రి పదవి ఇచ్చినట్లు చెబుతుంటారు.

నేడు కళా విహీనం.: నాడు ఎంతో వైభవంగా వెలుగొందిన ఆలయం నేడు కళా విహీనంగా మారి వెలబెలబోతోంది. ఆలయ గర్భగుడిలో నిధులు ఉన్నాయనే అనుమానంతో కొందరు దుండగులు తవ్వకాలను జరిపారు. ఆలయం ముందున్న కోనేరులో చిన్నపాటి బ్లాస్టింగ్ చేసినట్లు అక్కడి పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. ఆలయం చుట్టూ కూడా తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు ఉన్నాయి. దేవాలయానికి 22 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా ఆక్రమణలు పోనూ ప్రస్తుతం 10.40 ఎకరాలే మిగిలింది. పురావస్తుశాఖ ఈ ఆలయాన్ని రక్షిత కట్టడంగా గుర్తించినా, రక్షణ కోసం తీసుకున్న చర్యలు తీసుకోలేదు.  పురావస్తుశాఖ, ప్రభుత్వం స్పందించి పల్నాటి చరిత్రకు సజీవసాక్ష్యంగా నిలిచిన ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

No comments:

Post a Comment