Thursday 4 December 2014

కన్నెగంటి హన్మంతు

పల్నాడు తాలూకాలో జరుగుతున్న పన్నుల నిరాకరణ, ప్రభుత్వ వ్యతిరేక సహాయ నిరాకరణోద్య మాన్ని చూసిన యువకుడు కన్నెగంటి హన్మంతు- జిల్లాలో అనేకమంది గ్రామాధికారులు రాజీ నామాలిచ్చి సహాయ నిరాకరణోద్యమానికి తోడ్పడు తుంటే- మించాలపాడు గ్రామాధికారులు మాత్రం ప్రభుత్వానికి విశ్వాసపాత్రులుగా వున్నారు.  గ్రామంలో ప్రజలందరినీ ఏకం చేసి పుల్లరి వ్యతిరేక ఉద్యమానికి నాందిపలికాడు. ఆజానుబాహుడు, ఆత్మబలశాలి, హన్మంతు ఆ గ్రామ ప్రజలందరికీ ఆప్తుడుగా వున్నాడు. హన్మంతు నాయకత్వాన ప్రజ లంతా కదిలారు. పుల్లరి లేదు గిల్లరి లేదు. అడవి సంపద మన పేద వాళ్లదేన న్నారు. ఇన్నాళ్ళు సాగిన దోపిడీ, దౌర్జన్యం ఇక చెల్లదన్నారు.
పుండాకోరు మునసబ్‌ ప్రభుత్వానికి రిపోర్టు పంపాడు. అది ప్రజలు గమనించారు. మునసబ్‌- కరణం ఉద్యమ ద్రోహులుగా భావించి-వారిని సాంఘికంగా బహిష్కరించారు. ఇంతకాలం సాగిన వారి పెత్తనం కూలిపోయింది. ప్రజలు మేలు కున్నారు. దీనంతటికీ కారణం హన్మంతేనని- లేనిపోనివన్నీ కల్పించి కలెక్టర్‌కు మొరపెట్టు కున్నాడు మున్సబు. జిల్లాకలెక్టర్‌ వెర్నన్‌, అడిషనల్‌ కలెక్టర్‌ పేరుమోసిన క్రూరుడు రూధర్‌ఫర్డు. మించాలపాడు ఘటనలు తీవ్ర రూపం దాల్చాయని ప్రకటించారు. అటవీ అధికారులు, పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. మాచర్లకు 20 మైళ్ళ దూరంలో వుంది మించాలపాడు. 1922 ఫిబ్రవరి 26, 20 మంది పోలీసు బలగంతో ఎస్‌.ఐ. మించాలపాడు చేరాడు. వారికి తోడుగా అసిస్టెంట్‌ ఫారెస్టు కంజర్‌వేటర్‌ - మరో 20 మంది పోలీసు బలగంతో వచ్చాడు. వారితోపాటు కరణం వున్నాడు. అడవిలో మేస్తున్న గేదెలు, ఆవులను తోలుకెళుతున్నారు. ఈ వార్త గ్రామంలో వున్న హన్మంతుకు, ప్రజలకు అందింది. వందలాది మంది స్త్రీలు, పురుషులు వెళ్ళి వారికి అడ్డునిలిచారు. పశువుల్ని, పశువుల కాపరులను వదిలేయమన్నారు. అధికార బలంతో పోలీసులు ప్రజలపై బలప్రయోగానికి పూనుకున్నారు. మాటల తో లాభంలేదు - పిరికి పందల్లా కూర్చోలే మన్నాడు హన్మంతు. ఆడ,మగ తేడాలేకుండా ప్రజలు దొరి కిందల్లా అందుకున్నారు. కర్రలు, రోకళ్ళు, రాళ్ళు, రప్పలు తీసుకొని పోలీసులపై విరుచుకుపడ్డారు. పశువులు, పశుల కాపరులను విడుదల చేసుకున్నారు. ఇది ప్రభుత్వానికి తలవంపు అయ్యింది. ఎలాగైనా హన్మంతును హతమార్చాలని కుట్ర పన్నారు.
అప్పుడు కారంపూడిలో బసచేసివున్న కలెక్టర్‌కు యీ వార్తచేరింది. అదనపు బలగాలు దిగాయి (స్వయంగా అడిషనల్‌ కలెక్టర్‌ రూధర్‌ఫర్డు 100 మంది సైనికులతో వచ్చాడని మరో చరిత్ర)
తిరిగి పోలీసుబలగాలకు ప్రజలకూ మధ్య పోరాటంసాగింది. పోలీసుల చేతుల్లో మారణా యుధాలున్నాయి. ప్రజల చేతుల్లో కర్రలు-రాళ్ళు మాత్రమే వున్నాయి. అయినా ప్రజల పట్టుదల - హన్మంతు నాయకత్వం వారిని రౌద్రమూర్తులను చేసింది. పోలీసులు తుపాకులను పేల్చారు. చెట్టు - రాయి అడ్డుపెట్టుకుని ప్రజలు రాళ్ళు విసిరారు. ''మీకేకాదురా మాకూ ప్రజాబలముంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా కదిలివచ్చి - మీ అంతం చూస్తారని'' ఆడవాళ్ళు హెచ్చరించారు.
పోరాటం సాయంత్రం 4-5గంటల మధ్య జరిగిందని జిల్లాకలెక్టర్‌ తన రిపోర్టులో తెలియ జేశాడు. అదే రిపోర్టులో తాను మాచర్ల నుండి జిల్లా పోలీసు సూపరింటెండెంటు, జిల్లా అటవీ అధికారి, యితర బలగంతో మించాలపాడు చేరుకున్నట్లు రాశారు. కాబట్టి పోరాటం కలెక్టర్‌ రూధర్‌ఫర్డు ప్రత్యక్ష పర్యవేక్షణలోనే జరిగిందనడంలో సందేహంలేదు. పోరాట యోధుడుగా, ధైర్యసాహ సాలు ప్రదర్శించిన హన్మంతు ప్రాణాలు తీయడం వారి ప్రధాన కర్తవ్యంగా ఎంచుకున్నారు. పోరాటం లో ముందు నిలిచిన హన్మంతు గుండెకు గురిపెట్టారు. వీరుడుగా హన్మంతు ఒరిగిపోయాడు. అతనితో పాటు మరో రైతుబిడ్డ - పోలీసు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, గుర్రాన్ని మేపే అమాయకుడు హతుల య్యారు. అనేకమంది గాయపడ్డారు. హన్మంతు మరణం తర్వాత చాలామందిని అరెస్టుచేశారు. స్వాతంత్య్ర సమరంలో తెలుగునేలపై తొలివీరుడు కన్నెగంటి హన్మంతు 1922 ఫిబ్రవరి 26న ఒరిగిపోయాడు. హన్మంతు మరణవార్త ఆంధ్రప్రదేశంలో అగ్నిజ్వాలలు రేపుతుందని ప్రభుత్వానికి తెలుసు. హన్మంతు, తాగుబోతు-తిరుగుబోతు- పేరుమోసిన రౌడీ, ప్రజల మాన - ప్రాణాలతో చెలగాటమాడే ద్రోహి అని, అధికారులను చంపడానికి ప్రయత్నించాడని ప్రచారం చేశారు. ఇదే విషయాన్ని కలెక్టర్‌ ప్రభుత్వ కార్యదర్శికి పంపిన రిపోర్టులో రాశాడు.
ప్రభుత్వంతోపాటు కాంగ్రెస్‌ నేతలు కూడా హన్మంతుకు అన్యాయం చేశారు. దాన్నొక అరాచకంగానే భావించారు. హన్మంతు త్యాగాన్ని గుర్తించలేదు. కానీ, మించాలపాడు, పల్నాడుప్రాంత ప్రజలు మాత్రం అమరవీరుడు హన్మంతుకు అశ్రునయనాలతో జోహారులర్పించారు. పలనాటి వీరుడిగా కొనియాడారు. తమ హృదయాల్లో ఆ వీరుని త్యాగాన్ని పదిలపరుచుకున్నారు. మించాలపాడులో స్మారక చిహ్నం నిర్మించుకున్నారు. హన్మంతు మరణించిన రెండు సంవత్సరాలకు - మరో ఆంధ్రవీరుడు అల్లూరి సీతారామరాజు అమరత్వమొందిన తర్వాత 1924 అక్టోబరు 19 నాడు - ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ హన్మంతు త్యాగాన్ని గుర్తించింది.
''1922 - ఆంధ్రప్రదేశ్‌లో సహాయ నిరాకరణోద్యమం ముమ్మరంగా సాగుతున్నపుడు, గుంటూరు జిల్లా, పల్నాడు తాలూకా మించాలపాడులో పుల్లరి చెల్లించలేదన్న కారణంగా కన్నెగంటి హన్మంతుని క్రూరంగా చంపిన కొంతమంది అధికారుల దుష్టచర్యను యీ మహాసభ ఖండిస్తున్నది. ఆ మహావీరునికి జోహారులర్పిస్తున్నది. వారి కుటుంబ సభ్యులకు సంతాప, సానుభూతిని తెలియజేస్తున్నది. ఆ వీరుని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నది. హన్మంతు మరణానంతరం అతని భార్య, కుటుంబసభ్యులు స్థూపంవద్ద అతని జీవిత విశేషాలతో నెలకొల్పిన ఫలకాన్ని ధ్వంసం చేసిన అధికారుల అక్రమచర్యను గర్హిస్తున్నది. ఆ ఫలకాన్ని తిరిగి నెలకొల్పాలని అందులో యీ విధ్వంస చర్యను కూడా రాయాలని యీ మహాసభ కోరుతున్నది. ఇందుకోసం పూనుకోవాలని తీర్మానిస్తున్నది''?
అభినవ బాలచంద్రుడు - అస్తమించాడు. సంవత్సరాలు గడిచాయి. హన్మంతు పేరు, హన్మంతు ఊరు, హన్మంతు త్యాగం చరిత్రలో మరుగున పడిపోయింది.

courtesy visalaandhra -కందిమళ్ళ ప్రతాపరెడ్డి

No comments:

Post a Comment