Wednesday 26 November 2014

పల్నాటివీరులకథ

పల్నాటివీరులకథ

ద్రుతతాళంబున వీరగుంభి తకధుం ధుం ధుం కిటాత్కార సం
గతి వాయింపుచు నాంతరాళిక యతిగ్రామాభిరామంబుగా
యతిగూడం ద్విపదప్రబంధమున వీరానీకముం బాడె నొ
క్కత ప్రత్యక్షరముం గుమారకులు ఫీట్కారంబునం దూలగన్‌

గర్జించి యరసి జంఘా కాండయుగళంబు
వీరసంబెటకోల వ్రేయునొకడు
ఆలీఢ పాదవిన్యాస మొప్పగ వ్రాలి
కుంతాభినయము గైకొను నొకండు
బిగువు గన్నుల నుబ్బు బెదరుచూపుల తోడ
ఫీట్కార మొనరించు బెలుచ నొకడు
పటుభుజావష్టంభ పరిపాటి ఘటియిల్ల
ధరణి యాస్ఫోటించి దాటు నొకడు

ఉద్ది ప్రకటింప నొక్కరుండోలవాడు
బయలు గుర్రంబు భంజళ్ళ బరపు నొకడు
కొడుము దాటింపుచును బెద్దగొలువు లోన
పడతి పల్నాటివీరుల పాడునపుడు

కులము దైవతంబు గురిజాల గంగాంబ
కలని పోతులయ్య చెలిమికాడు
పిరికికండ లేని యరువదియేగురు
పల్లెనాటి వీరబాంధవులకు

ఆరువల్లి నాయినారి దుర్మంత్రంబు
కోడిపోరు చాపకూటి కుడుపు
ప్రథమకారణములు పల్నాటి యేకాంగ
వీరపురుష సంప్రహారమునకు

పచ్చనిపిండి గందమును బాలముసేసయు నెర్రపూవులన్‌
గ్రుచ్చిన కంఠమాల్యములు గొప్పుగ నల్లిన వేణిబంధముల్‌
కచ్చుల వీరసంబెటయు క్రొత్త మణుంగగు కాసెపుట్టమున్‌
రచ్చల కెక్కినట్టి రసణంబులు వీరకుమార కోటికిన్‌

నల్లంగొండయు నాగరి
కల్లును ధరణీస్థలిం బ్రగల్ఫస్థలముల్‌
పల్లేరు నాగులేరును
పల్లె క్ష్మాకాంత యెల్ల ప్రారంభంబుల్‌

ఇచ్చోట భుజియించి రేకకార్యస్తులై
సామంతనృపతులు చాపకూడు
ఇచ్చోట జింతించె నిచ్చ నుపాయంబు
నళిణాక్షి యార్వెల్లి నాయురాలు
నిజ మనుశుద్ధికై నిప్పులయేటిలో
నోలాడె నిచ్చోట బీలసాని
ఇచ్చోట బోరిరి యిల పణంబుగ గొల్ల
సవతితల్లుల బిడ్డ లవనిపతులు

ధీరులగు వారలేవురు వీరపురుషు
లై మదోద్ధతి నిచ్చోట నాజి బడిరి
యనుచు జెప్పుదు రైతిహ్య మచట నచట
జనన పెద్దలు పల్లెదేశములయందు

చిత్తము గూర్చి మాచెరలచెన్నుడు శ్రీగిరిలింగముం గృపా
యత్తత జూడ ముల్కివిషయంబునకా మహిమంబు చెల్లెగా
కుత్తరలోన మింట జలముట్టిన మాత్రన నాపరాలలో
విత్తిన యావనాళ మభివృద్ధి ఫలించుట యెట్లు చెప్పుమా

మగసింగంబులు సంగరాంగణములన్‌ మత్తిల్లి రున్మత్తులై
జగదేకస్తుతు లంచు నేమిటికి సంశ్లాఘింప నా భూమిలో
చిగురుంబోడుల కాపుగుబ్బెతల నక్షీణప్రభావంబునన్‌
మగసింగంబులగా నెరుంగుదురు పుంభావ ప్రసంగంబులన్‌

No comments:

Post a Comment