Wednesday 14 January 2015

శుభములనీయవే సుబ్బీ గొబ్బెమ్మ


శుభములనీయవే  సుబ్బీ గొబ్బెమ్మ
శ్రీ సూర్యనారాయణా మేలుకో... హరిసూర్యనారాయణా మేలుకో పొడుస్తు బాలుడు పొన్నపూవు ఛాయ... పొన్న పూవుమీద పొగడంపు ఛాయ ఉదయిస్తు బాలుడు ఉల్లిపూవు ఛాయ... ఉల్లిపూవు మీద ఉగ్రంపు పొడి ఛాయ

ప్రత్యక్ష దైవంగా కొలిచే సూర్యుడు దక్షిణాయనం నించి ఉత్తరాయణంలోకి మారుతూ మకరరాశిలోకి ప్రవేశిస్తూ తీక్షణమైన తన కొత్త వెలుగులని ప్రపంచానికి ప్రసరించే పండుగ సంక్రాంతి పండుగ. ప్రతీ పండుగకీ ఓ దేవతకో దేవుడికో ప్రత్యేకత ఉన్నట్లే సంక్రాంతి పూర్తిగా అన్నింటికీ సాక్షీభూతమైన సూర్యనారాయణమూర్తిని కొలిచే పండుగ. ఆరోగ్య ప్రదాత సూర్యదేవుడు. మన భారతీయులు ప్రకృతి ఆరాధకులు. ఈ ప్రకృతి ఆరాధన సంక్రాంతి పండుగ రోజుల్లో కూడా మనకి కనిపిస్తుంది. భోగికి ముందర తొమ్మిది రోజుల ముందునించి లోగిళ్ళు చక్కగా శుభ్రంచేసి అందమైన ముగ్గులు పెట్టి వాటిపైన లక్ష్మీదేవిగా భావించే ఆవుపేడతో చేసిన గొబ్బిళ్ళు పెట్టి వాటిపై పూలతో అలంకరించి కన్నెపిల్లలు, చిన్నపిల్లలు పెద్దల సహకారంతో చప్పట్లు కొడుతూ ఆడడం ఓ అద్భుతమైన సన్నివేశం.

గొబ్బియల్లో సఖియా వినవె
చిన్నికృష్ణుని చరితము వినవె
కృష్ణుని చరితము వినరే...
ఔనట అక్కల్లారా చంద్రగిరి భామల్లారా
భామలగిరి గొబ్బిళ్ళ గొబ్బీయల్లో....
సుబ్బీ గొబ్బెమ్మ శుభములీయవే

సుబ్బీ గొబ్బెమ్మ మొగలిపువంటి మొగుడినీయవే...  లాంటి పాటలు, ఆటలతో పదిమందితో స్నేహ సంబంధాలు కలుపుకుంటూ ఊర్లో ఒక్కొక్కరి ఇంటిముందు తొమ్మిదిరోజులు అందరు కలుసుకుని ఆడుకుని, గుల్లశనగపప్పు, అటుకులు, బెల్లం వంటివి నైవేద్యాలు పెట్టి ప్రసాదాలు పంచుకుంటూ ఆనందంగా గడుపుతారు. ఈ రోజుల్లో ఈ ఆధునిక పరికరాల మధ్య మనకి ‘ఏవిటది సిల్లీగా’ అనిపించవచ్చు కానీ, ఆధునీకరణ లేని రోజుల్లో ఆడపిల్లలని బయటికి వెళ్ళనిచ్చేవారు కాదు. మహిళలకి మరొక వ్యాపకం లేక ఇంటికే అంకితమయ్యేవారు. ఇలా పండగల్లో, పబ్బాల్లో నోములని, వ్రతాలని గొబ్బిళ్ళని పసుపుకుంకుమలని ఇచ్చిపుచ్చుకుంటూ రోజూవారి దినచర్య నుంచి బయటపడి ఆనందం పొందేవారు. అలాంటి వేడుకే భోగి పళ్ళు పోయడం. ఇంట్లో అయిదేళ్ళు పదేళ్ళ లోపు పిల్లలకి భోగిపళ్ళు పోసేవారు. చెరుకుముక్కలు, రేగిపళ్ళు, చిల్లరడబ్బులు, పూలు మొదలైనవి ఓ పళ్ళెంలో కలిపి పిల్లల తలలపైన మూడుసార్లు తిప్పుతూ పాటలు పాడుతూ భోగిపళ్ళు పోసేవారు. ముత్తైవలు ఒకరికొకరు పసుపు కుంకుమలిచ్చుకుంటూ తమ సాన్నిహిత్యాన్ని ఇరుగుపొరుగులతో సాటి మహిళలతో చాటుకొనేవారు. ఒక విధంగా ఇవి అలనాటి కిట్టీ పార్టీలని చెప్పొచ్చు.
 ఇక ఈ సంక్రాంతి పండుగ రైతన్నకి ఇచ్చే ఆనందం అంతాఇంతా కాదు. దేశానికి వెన్నెముక రైతు. రైతు పండిస్తేనే మనందరికి మెతుకు గొంతులో దిగేది. సంవత్సరమంతా పడ్డ కష్టం ఇంటికి పంట రూపంలో వస్తుంది. రోజూ అన్నం తినే ముందు దేవుడి తరువాత రైతన్నకి ఓ మాటు దణ్ణం పెట్టుకుంటే మనకెంతో మేలు. దేశానికి ఎంతోమేలు.

సంక్రాంతి రోజుల్లో మనకి కనిపించే వారిలో హరిదాసులు ఒకరు. హరె హరెలొరంగ హరె.... హరెలోరంగ హరె... హరె.... అంటూ పాడుకుంటూ కృష్ణార్పణం అని దీవిస్తూ వెళతారు. వీరినే జియ్యరులు అని కూడా పిలుస్తారు. వీరు మామూలు రోజుల్లో కనిపించరు. సంక్రాంతి రోజుల్లోనే దర్శనమీయడం విశేషం. అలాగే ఈ రోజుల్లో మనల్ని పలుకరించే నేస్తం డూడూ బసవన్న.

 డూడూడూడూ బసవన్న... దొడ్డా దోరండి బసవన్నా... అంటూ  పాడుకుంటూ బసవన్నని ఇంటింటా ఆడిస్తూ వారిచ్చే పాతబట్టలు, బియ్యం, పిండివంటలని తీసుకుని వెళ్ళే బసవన్నలు రాకపోతే అసలు సంక్రాంతికి అందమే రాదు. అలాగే పిట్టల దొర, బుడబుక్కలవాడు, జంగమదేవరలు వారి పాత్రలని వారు ఈ పండుగ దినాల్లో పోషిస్తూ మనకి శుభాశీస్సులు ఇవ్వడం సంక్రాంతిలో ఓ భాగమే.

ఎటు చూసినా వెల్లివిరిసే ఈ పండగలని యధాశక్తి జరుపుకుంటూ మన పెద్దలబాటని అనుసరిద్దాం. కొత్త ఆనందాలని నింపుకుంటూ కొత్త ఆశలతో క్రాంతి పథంలో పయనిద్దాం. ఎన్నో సంక్రాంతులని జరుపుకుందాం. కృష్ణార్పణం.
source: sakshi

No comments:

Post a Comment