Thursday, 8 December 2016

నాయకురాలు నాగమ్మ కుటిల నీతికి దర్పణం 'కోడిపోరు..

నాయకురాలు నాగమ్మ కుటిల నీతికి దర్పణం 'కోడిపోరు..

పల్నాటి రాజ్యం కోడిపోరులో.  మాచర్లను  ఏలు బ్రహ్మనాయుని నేతృత్యంలో మలిదేవాదులు, గురజాలను పరిపాలించే నలగామరాజు, మంత్రి నాగమ్మ చేతిలో ఓడిపోయి అరణ్యవాసం చేయగా. మహా భారతంలో పాండవులు ధర్మరాజు నేతృత్వంలో, కౌరవులతో ఆడిన జూదంలో ఓడిపోవటంతో వనవాసం చేయాల్సి వచ్చింది. దీంతో భారతంలోని ఘటనలు. పల్నాటి సంఘటనలు సామరూప్యతక కల్గివుండటంతో. అందుకే దీనిని పల్నాటి మినీ భారతం" గా అభివర్ణించారు. పౌరుషాల పురిటి గడ్డగా ఖ్యాతి గడించిన పల్నాడులో నాయకురాలు నాగమ్మ కుటిల నీతికి దర్పణం 'కోడిపోరు..
అల నాడు మాచర్ల రాజు మలిదేవని సైన్యంలోని అలరాజుకు గురజాల రాజు నలగాముడి కుమార్తెను ఇచ్చి వివాహం సందర్భంలో సరదాగా కోడి పందేలు సాగాయి. ఇది పంతాలకు దారి తీసి నిజమైన కోడిపోరుకు ముహూర్తం ఖరారవుతుంది, దీంతో రెంచింతల మండలంలోని పాలు వాయి వద్ద గల పాడేరు గుట్టల్లో కోడిపోరు నిర్ణయిం చారు. దీంతో గురజాల, మాచర్ల రాజ్యాల్లో పందెపు కోళ్లన్నీ నాగమ్మ కొనేసిన క్రమంలో దేవానుగ్రహంతో బ్రహ్మన్న చిట్టిమల్ల అనే కోడిని సాధిస్తాడు. నిర్ణయిం చిన ప్రకారం కోడిపోరు మొదలవగా రెండుసార్లు బ్రహ్మన్న పంజు పోటీల్లో గెలుపొందుతుంది. దీంతో ఆగ్రహించిన నాగమ్మ మంత్రకట్టు తో   బ్రహ్మన్న కోడి చిట్టి మల్లను నిర్వీర్యం చేసి గురజాల కోడైన సేవంగి డేగ పోరులో గెలిచేలా చేస్తుంది. ఓడిన బ్రహ్మన్న సారథ్యం లోని మాచర్ల రాజులు మలిదేవాదులు అరణ్యవాసం అనుభవిస్తారు.
► follow us@ fb.com/palnaticharitra
► follow us@ http://palnaducharitra.blogspot.in/
► Subscribe Our Channel: www.youtube.com/palnaticharitra

Wednesday, 7 December 2016

మందాడి ఫై నాగమ్మ కన్నుతోనే మంద' పోరు'

మందాడి ఫై నాగమ్మ కన్నుతోనే మందపోరు



కోడి పందెములో ఓడిపోయిన మలిదేవాదులు బ్రహ్మానాయుని నేతృత్యంలో మందాడికి చేరుకొని అక్కడ నివసిస్తుంటారు. మూడేండ్ల తరువాత నాయకురాలు నాగమ్మ మలిదేవాదులు ఎలావున్నారు అన్నవిషయం పై వేగుల ద్వారా వాకబు చేస్తుంది. అక్కడవారు గోసంపద (ఆవులమంద)తో సుఖశాంతులతో జీవిస్తున్నారని తెలుసుకొని ఆమెకు కన్నుగుట్టిం ది.ఏదో విధంగానైనా మలిదేవాదులను చీకాకు పరచాలని నలగామరాజుకు దుర్నితిని కల్లించేలా చేస్తుంది.తొలుత నలగామరాజు అంగీకరించకపోయినా నాయకురాలు నాగమ్మ మాటలకు ప్రలోభపడతారు.దీంతో బ్రహ్మానాయునిపై శతృత్వం పెంచుకొంటారు. మందాడిలో ఆవుల మందతో వుంటున్న బ్రహ్మన్నపై యుద్ధం చేయించాలని సమరుడైన అర్ధవీటిలోని వీధుల పల్నీడు అను చెంచు నాయకున్ని నాగమ్మ కబురు పంపుతుంది. గతంలో పల్నీడు తండ్రిదాబుచేనిని బ్రహ్మనాయుడు ఓయుద్ధంలో ఓడిస్తారు. పగతీర్చుకోవాలని రగిలిపోతున్న ఆతనికి నాగమ్మ పిలుపుతో తన అనుచరులతో పాటు పరివారాన్ని వెంటతీసుకొని గురజాల వెళ్లారు. ఈ కార్యంను విజయవంతంగా పూర్తి చేసుకొని వచ్చే నీకు మాచర్ల రాజ్యాన్నికానుకగా ఇస్తామని చెపుతుంది, దామినీడు,పల్లన్నమల్లన్నఅనేవేగులద్వారా మందాడి పట్టణంలోనికి హరిదాసుల వేషంలో వెళ్లి మలి దేవాదుల ఆవుల మందలపై దాడిచేసేందుకు వ్యూహం పన్నుతారు.ఆవులమందకు కాపలాగా లంకన్నను నాయకుడిగా బ్రహ్మనాయుడు నియమి స్తారు. వీధుల పల్నీడు తన సైనిక బలంతో పాటు నలగామరాజు అందించి సైన్యాన్ని తీసుకొని మూకుమ్మడిగా గోవుల మందలపై దాడిచేస్తారు.ఈ దాడిలో లంకన్న వీరావేశంతో నలగాముని సైన్యాన్నిహతమారుస్తారు.వీధలపల్నీడు పన్నిన పద్మవ్యూహంలో చికుకున్న లంకన్న అభిమన్యునిలాగా వీరోచితంగా ఒంటరి పోరాటంచేస్తూ పల్నీడు తలను తెగనరికిన ఆనందంలోకల్గివుండా నలుమూలల నుంచి చాటుమాటు నుంచి బాణాలను ఒకేసారి వేయటంతో లంకన్న నేలకొరుగుతారు. ఈ విషయాన్ని లంకన్న అనూయయుల్లో మిగిలి వున్నపెయ్యల పేర్నీడు బ్రహ్మనాయునికి  తెలియ జేస్తారు. బ్రహ్మనాయుడు తన మానస పుత్రుడైన మాల కన్నమ దాసును వెళ్ళి మందాడిని రక్షించాల్సిందిగా ఆజ్ఞాపిస్తారు.దీంతో కన్నమదాసు నలగామ రాజు సైన్యాన్ని చెంచుల సేనలను ఓడించి ఆలమందలను రక్షిస్తారు.
► follow us@ fb.com/palnaticharitra
► follow us@ http://palnaducharitra.blogspot.in/
► Subscribe Our Channel: www.youtube.com/palnaticharitra

Saturday, 3 December 2016

అలరాజు రాయబారం వికటించుటయే.. పల్నాటి యుద్దానికి బీజం.!

అలరాజు రాయబారం వికటించుటయే
పల్నాటి యుద్దానికి బీజం.!





మాచర్లను పరిపాలిస్తున్న బ్రహ్మనాయుడు నేతృత్వంలోని మలిదేవాదులు తమ ప్రాంతాన్ని  అప్పగించాలంటూ గురజాలను పాలిస్తున్న నలగామ రాజును కోరుటకు గాను అలరాజును " (రాయభారం)రి" పంపగా అది కాస్త వికటించటంతోనే పల్నాటి యుద్దానికి తొలి బీజం పడిందని చారిత్రక ఇతి వృత్తాంతం.
మలిదేవాదులు కోడిపందెంలో ఓడిపోవుటతో ముందసుగా జరిగిన ఒప్పందం మేరకు బ్రహ్మనాయుని అనూయులు రాజ్యం వదలి ఏడు సంవత్సరముల వనవాసము పూర్తిచేసుకొని మేడపి ( ప్రకాశం జిల్లా )లో  వుంటున్నారు. గడువు తీరి ఆరునెల కావటంతో రాజ్యాన్ని తిరిగి పొందేందుకు గాను నలగామరాజు అల్లుడు పేరిందేవి భర్త "అలరాజు" ను గురజాలకు బ్రహ్మనాయుడు "రాయభారం" పంపుతాడు. అలరాజును  రాయభారం పంపే సమయంలో అతని తల్లి  బ్రహ్మనాయునితో  వీరాగ్రేసులైన పెద బాలరాజునుగాని, నీ మాసన పత్రుడైన సర్వసైనాధ్యక్షులు మాల కన్నమదాసు, నీ కుమారుడు బాలచంద్రుడ్నిగాని పంపంవచ్చగా అని పేర్కొంటుంది. కోడి పందెములో గురజాల వారు చేసిన మోసమును, దుర్మాగమును తెలిసి కూడా ధర్మం పేరిట న్యాయం పేరిట మనలను ఓటమి అంగీకరించమన్నప్పుడు నిష్పక్షపాతంగా వ్యవహరించిన ధర్మమూర్తి అలరాజు అని బ్రహ్మనాయుడు కొనియాడతాడు. అలరాజుకు అంగరక్షకుడిగా కన్నమదాసు ను పంపటమే కాకుండా మహీన్వితమేన 'తులసి మాలను వేసి గురజాలకు రాయభారం వంపుతానని బ్రహ్మనాయుడు తెలపటంతో అలరాజు తల్లి వెళ్ళేందుకు అంగీకరిసుంది. రాయభారమునకు వెళ్ళిన వారు మార్గమధ్యలో కందేరు వాగు దాటవలసివస్తుంది. ఆ మార్గంలోనే బాలచంద్రుడు అటుగా వస్తాడు. ఆ ఇరువరు ఏరు దాటువిషయంలో సరదాగా పందేం కాసారు. ఓడిన వారు నిలువ దోపిడి గావించాలని షరతు. పందేంలో అలరాజు ఓడిపోవుటతో నిలువ దోపిడిగా అన్ని అభరణములతో పాటు తులసిమాలను కూడా తీసాడు. తదుపరి అలంకరణ పూర్తి చేసుకొనిన అలరాజు తులసిమాలను మర్చిపోయి గురజాలకు బయలుదేరుతారు. 'నరసింగరాజు" నాగమ్మలు దౌత్యమునకు సహకరించకపోగా "సూదిమోపినంత నేల కూడా ఇవ్వమని నలగామరాజు క్రోపోద్రేకము వ్యక్తం చేస్తాడు. దీంతో సహనానికి విలువలేకుండా పోయింది. పల్నాట రక్తము ఏరులై పారవలసిందే నంటూ అలరాజు యుద్ధ ప్రకటన చేస్తూన్నాను సిద్దంకండీ. విజయమో. వీరస్వర్గమో. తెల్చుకుందాం...! అని తన "సూర్య భేతాళ ఖడ్గము" ను తీసి వీరావేశమును ప్రదర్శించేను. రాయబారిగా వచ్చాన్నవిషయం గురు_కువచ్చి ఎత్తిన ఖడ్గమును దించకూడదన్న నియమము చేత సభలోని స్తంభమును తెగనరికి వెను తిరుగుతారు. మార్గ మధ్యలో చర్లగుడిపాడు సమీపాన నాయకురాలు నాగమ్మ కుతంత్రంములతో తంబళ్ళజీయర్ ద్వారా అలరాజును విష ప్రయోగం చేత చంపిస్తుంది. ఈ సంఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన బ్రహ్మనాయుడు యుద్ధ ఆసన్నమైందని ప్రకటన  చేస్తారని చారిత్రక కధనం.
► follow us@ fb.com/palnaticharitra
► follow us@ http://palnaducharitra.blogspot.in/
► Subscribe Our Channel: www.youtube.com/palnaticharitra

Monday, 14 November 2016

పల్నాటి వీరారాధన ఉత్సవాలకు శ్రీకారం, కారంపూడి. (2016) ( veeraradhana uttav) karempudi

పల్నాటి వీరారాధన ఉత్సవాలకుశ్రీకారం(2016)


కారంపూడి పల్నాటి వీరారాధన ఉత్సవాలకు పల్నాటి వీరాచార పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ కార్తీక పౌర్ణమి సోమ వారం రాత్రి శ్రీకారం చుట్టారు. వీరుల గుడి ఆవర ణలో ఉన్న పోతురాజుకు పూలమాల వేశారు. ఉత్స వాలు పూర్తయ్యే వరకు గుడిని వీడి వెళ్లవద్దని పోతురాజుకు 101 పోగులతో ఆనకట్టు కట్టే ప్రక్రియ నిర్వహించారు. మొదట చెన్నకేశవస్వామి ఆలయంలో బ్రహ్మనాయుడు ఆయుధం నృసింహకుంతం, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మరో ఏడు వీరుల ఆయుధా శుభ్రపరిచిన అనంతరం అలం కారాలు చేసి గ్రామోత్సవం చేశారు. అంకాళమ్మ గుడి ముఖ ద్వారానికి ఏర్పాటు చేసిన జ్వాలా తోరణం గుండా వీరుల ఆయు ధాలను గుడిలోకి తీసుకెళ్లారు. అనంతరం చెన్నకేశస్వామికి పూజలు చేసి బ్రహ్మనాయుడు విగ్రహం వద్ద వీరంగం వేశారు. అనంతరం పీఠాధిపతితో కలసి వీరులగుడికి చేరుకుని బ్రహ్మనాయుడు నృరసింహకుంతాన్ని పోతు రాజుకు అభిముఖంగా ఉంచి పడిగెం కట్టారు. 28 నుంచి పల్నాటి వీరారాధనోత్సవాలు ఈ ప్రక్రియతో ఉత్సవాల నిర్వహణ సన్నా హాలకు శ్రీకారం చుట్టామని, ఉత్సవాల్లో పాల్గొనవలసిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పల్నాటి వీరాచార, వీర విద్యావంతులకు వర్త మానాలు పంపుతామని పీఠాధిపతి చెప్పారు. ఉత్సవాలు కార్తీక అమావాస్య నవంబరు 28 నుంచి ఐదు రోజులపాటు జరుగుతాయని తెలిపారు. 28న రాచగావు. 29న రాయబారం, 30న మందపోరు(బ్రహ్మనాయుడు చాప కూడు సిద్దాంతం అమలు), డిసెంబరు 1న కోడిపోరు, 2న కళ్లిపాడు పేర్లతో ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు.

► follow us@ fb.com/palnaticharitra
► follow us@ http://palnaducharitra.blogspot.in/
► Subscribe Our Channel: www.youtube.com/palnaticharitra


వీరారాధన ఉత్సవాలు, కారెంపూడి ( Veeraradhna utsav , karempudi)

వీరారాధన ఉత్సవాలు ,  కారెంపూడి


ఈ నెల 28 న  కార్తిక అమావాస్య నుంచి 5 రోజులు పాటు పల్నాటి వీరోత్చావాలు జరుగుతాయి.
పల్నాటి యుద్ధం ముగిసిన తరువాత బ్రహ్మనాయుడు ఆశయసిద్ధి కోసం కారంపూడిలో వీరాచారపీఠము స్థాపించి దాని పీఠాధిపతులుగా పిడుగు వంశం వారిని నియమించారు. అప్పటి నుంచి పల్నాటి వీరోత్సవాలు జరుగుతున్నాయి. కార్తీక పౌర్ణిమి నాడు బ్రహ్మనాయుని న`సింహకుంతము, బాలచంద్రుని సామంతము, కన్నమదాసు భైరవఖడ్గములతో కొంతములను తీసికొని నాగులేరు లో శుభ్రం చేసి, అలంకరణలో గ్రమోత్సవం జరుపుతారు.
ప్రతి ఏడాది కార్తిక మాసం లో పల్నాటి వీరోత్చావాలు జరుగుతాయి. ఇది 800 ఏళ్ళ నుంచి కొనసాగుతున్న ఆచారం . ఈ నెల 28 కార్తిక అమావాస్య నుంచి 5 రోజులు పాటు పల్నాటి వీరోత్చావాలు జరుగుతాయి. యుద్ధంలో మరణించిన వీరులకు దైవత్వం అపాదించి వారికి గుడిలు కట్టి వారు ఉపయోగించిన ఆయుధాలు ను పూజించటం అనే సాంప్రదాయం భారతదేశంలో ఒక్క పల్నాడు ప్రాంతం లోనే జరుగుతుంది. వీర్ల సేవాస్థానములుపోతురాజుకు పిడిగెం కట్టడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. కార్తీక అమావాస్య నుంచి వరుసగా ఐదు రోజులు.. రాచగావు, రాయబారం, మందపోటు, కోడిపోరు, కల్లిపాడు అను పేర్లతో ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు రాష్ట్రం నుంచే గాగ ఇతర రాష్ట్రాలు నుంచి వీరాచార వంతులు తరలివస్తారు. వీర విద్యావంతులు శ్రీనాధని పల్నాటి వీర చరిత్రను ఈ ఐదు రోజుల పాటు గానం చేస్తారు.

► follow us@ fb.com/palnaticharitra
► follow us@ http://palnaducharitra.blogspot.in/
► Subscribe Our Channel: www.youtube.com/palnaticharitra

Sunday, 13 November 2016

నాయకురాలు నాగమ్మ ( Nayakuralu Nagmma )

నాయకురాలు నాగమ్మ ( Nayakuralu Nagmma )

సమకాలీన శాసనాలు, సాహిత్యం, జానపద సాహిత్య ఆధారాలనూ సమన్వయ పరచి అధ్యయనం చేసినప్పుడు నాయకురాలు నాగమ్మ అనే భారతదేశపు ప్రప్రథమ మంత్రిణి కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం ఆరెవెల్లి గ్రామస్తురాలని, ఆమె కాలం నుండే తెలంగాణాలో “రెడ్డి” అనే కులం ప్రవేశించిందని అర్థమవుతుంది. ఇవి ఇప్పటి వరకు తెలంగాణా చరిత్రకు కొత్త విషయాలు కాబట్టి వీటిని విపులీకరించే ప్రయత్నమే ఈ వ్యాస ఉద్దేశ్యం

శ్రీనాథుడు తన “పల్నాటి యుద్ధం” కావ్యంలో నాగమ్మను

“పంటరెడ్డివారి పణతి యనంగ

ఎలమి జగ్గారెడ్డి వేడుక పుత్రి

మేకపోతుల రెడ్డి మేనకోడలును

ఆరవెల్లి వారింటి అమర కోడలును”

అంటూ వర్ణించాడు. నాగమ్మది .పంటరెడ్డి కుటుంబం. అంటే ఆమె కులపు ప్రధాన వృత్తి పంటలు పండించడం అనేది సుస్పష్టం. ఆమె చేసిన పల్నాటి యుద్ధానికి మూలాలు పంటలకు సంబంధించినవి అనేది ఆమె రాజు నలగామరాజు తండ్రి అనుగురాజు పూర్వ చరిత్ర ద్వారా తెలుస్తుంది. అనుగురాజు ఉత్తర దేశపు బాలమాచాపురి లేదా జంభూపురి (నేటి జబల్పూర్) నుంచి దక్షిణ దేశ యాత్రకు వచ్చి గుంటూరు జిల్లాలోని పల్నాడులోని గురజాలలో స్థిరపడి అక్కడి నుండే రాజ్యపాలన చేస్తుంటాడు. అతని (రాజ్యపు) పశువులకు పశుగ్రాసం అవసరమయ్యి” అతని సేనాపతి తెప్పలినాయుని ఆధ్వర్యంలో భటులు నేటి కరీంనగర్ ఉత్తర ప్రాంతానికి వస్తారు. ఆ రోజుల్లో (ఈ రోజుల్లో కూడా) ప్రధాన పశుగ్రాసం చొప్ప. ఈ జొన్నచొప్ప దండిగా దొరికే ప్రాంతం చొప్పదండి. ఇది కరీంనగర్ కు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. తెప్పలినాయుని మందీమార్బలం తమకు కావలసినంత పశుగ్రాసాన్ని సేకరించాక ఆ జొన్న చొప్ప కంకులను చూసి మురిసిపోయి ఒక పంట రెడ్డిని వాటి విత్తనాలను తమకు ఇవ్వుమంటారు- తమ ప్రాంతంలో ఆ పంటను, పశుగ్రాసాన్ని పండించుకోవడానికి. అందుకు ఆ రెడ్డి నిరాకరించడంతో అనుగురాజు సైన్యానికి, స్థానిక Nagamma Sరాజు ఊరకోట ప్రభువు పేరమరాజు సైన్యానికి మధ్య ఆరణిగండ్లలో పెద్ద యుద్ధం జరుగుతుంది. ఈ ఆరణిగండ్లనే నేడు ఆర్నగొండ అని పిలుస్తున్నారు. ఇది చొప్పదండికి ఉత్తరాన 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అర్నగొండ, గుండిల మధ్య యుద్ధ వ్యూహాలను రచించుకోవడానికి అనువైన కొండలు, గుండ్లు, మైదానాలు ఉన్నాయి. ఈ యుద్ధంలో పేరమరాజు చనిపోయాడు. ఈ పేరమరాజు, విత్తనాలు ఇవ్వడానికి నిరాకరించిన పంటరెడ్డి నాగమ్మకు ఏదో ఒక విధంగా బంధువులు అయ్యుంటారు. వారి మరణం / ఓటమికి కారణమైన తెప్పలి నాయుడు మీద నాగమ్మకు కోపం వచ్చింది. నాగమ్మ తండ్రి పేరు జగ్గారెడ్డి. ఈయన కాకతీయ రాజు మొదటి ప్రతాపరుద్రుడు చేతిలో క్రీ.శ. 1159లో ఓడిపోయిన పొలవాస దేశపాలకుడు రెండవ మేడ రాజు కొడుకు జగ్గదేవుడు అయ్యుంటాడు. ఈ జగ్గదేవుడు తనను శత్రురాజులు (ప్రతాపరుద్రుడితో సహా) ఎవరూ గుర్తు పట్టకుండా ఉండడం కోసం తన పేరును జగ్గారెడ్డిగా మార్చుకుని ఉంటాడు. ఇలా జరగడానికి అవకాశమున్నట్లు కరీంనగర్ జిల్లాలోనే మనకు రెండు శాసనాలు కన్పిస్తాయి. మహదేవపూర్‌లో ‘ప్రతాపగిరికోట’ను కట్టించిన ‘ముచ్చ నాయకుడు’ మనకు రామగుండం మండలం అడవిసోమనపల్లిలో “రామేశ్వరీ దేవరకు” నైవేద్యానకూ ముగ్గునకూ’ పన్నప (భూదానం) చేసినప్పుడు “ముచ్చరడ్డి”గా కన్పిస్తాడు. నిజానికి ఈ రడ్డిలు లేదా రెడ్డిలు మహారాష్ట్ర (మహారట్ట) నుంచి వచ్చినవారు. పలకడంలో రట్ట అనే పదంలట్ట కూడా అవుతుంది. అందుకే వీరి బిరుదుల్లో ఒకటి “లట్టలూరు పురవరాధీశ్వర” ఈ లట్టలూరు మహారాష్ట్రలోని లాతూరు. ఆ ప్రాంతం నుంచి వచ్చిన వారే రట్టలు, రడ్డిలు, రెడ్డిలు. వీరినే తిరెవారు అని కూడా అంటారు. వారి తిరె భాషలో మరాఠీ భాషనే ఎక్కువ వారి ఊర్లే కరీంనగర్ దగ్గరి తిరెపల్లి (5 కి.మీ.) తిరెవెల్లి (25 కి.మీ.) ఈ విధంగా తెలంగాణాలో రెడ్డి కులజులు ప్రవేశించారని అర్థమవుతుంది. ఇది మొదలు తెలంగాణాలో ( నిశాసనాల్లో) రెడ్డి కులస్థులు చాలా మంది కన్పిస్తారు.

Templeపేరమరాజు చనిపోయిన కొన్నాళ్ళకు అతని కొడుకు ఉత్తురుడు స్థానిక రాజులందరిని పోగు చేసి అనుగురాజు మీద యుద్ధానికి సన్నద్ధుడు అవుతాడు. మళ్ళీ యుద్ధం ఆరణిగండ్లలోనే జరుగుతుంది. ఈ ఆరణిగండ్ల (ఆర్మకుండ) క్రీ.శ.1005 నాటికే ఏడు వేల ద్రమ్మల (ఆనాటి కరెన్సీ) ఆదాయం కలిగిన నగరమని దగ్గర్లోని కడపర్తి శాసనంలో ఉంది. కాబట్టే ఇక్కడ స్థానిక రాజులందరూ కూడారు. కాని అనుగురాజు తరపున యుద్ధం చేసిన బ్రహ్మనాయుడి చేతిలో వీరందరూ ఓడిపోయి కప్పం కట్టడానికి ఒప్పుకున్నారు. అయితే యుద్ధం జరుగుతున్న సమయంలో వీరిలో ఎందరో చనిపోయారు కూడా. అలా చనిపోయినవారిలో నాగమ్మ భర్త (సింగారెడ్డి), తల్లిదండ్రులు, అత్తమామలు కూడా ఉన్నారు. అప్పటికి ఆమె పెళ్ళయి రెండు మూడు రోజులే అవుతుంది. ఈ ఘోరానికి కారణమైన బ్రహ్మనాయుడి మీద నాగమ్మకు ద్వేషం పెరిగింది. ఆమె తండ్రి జగ్గారెడ్డి భూమిలో బ్రహ్మనాయుడు బావి తవ్వించి, అందుకు వ్యతిరేకించినందుకు జగ్గారెడ్డిని చంపించాడని, అందుకే బ్రహ్మనాయుడిపై నాగమ్మకు ద్వేషం పుట్టిందని కొన్ని వాదనలున్నాయి. అదీగాక బ్రహ్మనాయుడు వైష్ణవాన్ని ప్రచారం చేశాడని, ఆయన బృందం వెలమలని, వాటికి వ్యతిరేకంగా నాగమ్మ వీరశైవాన్ని ప్రచారం చేసిందని, రెడ్డి కులస్థులను బలపర్చిందని, ఈ కారణాల నేపథ్యంలోనే పల్నాటియుద్ధం జరిగిందని చరిత్రకారులు నమ్ముతున్నారు. కవిబ్రహ్మ ఏటుకూరి వారి క్రింది పద్యంలో ఇందుకు ఆధారాలు కనిపిస్తున్నాయి నాగమ్మ “కట్టించినది కోట గడ్డలకెదురుగా జంగమ వృద్ధుల సత్రశాల…. సృష్టించినది వీరశివభక్తులకుగాను స్థావరమ్మున యందు శైవవీధి” అని చెప్పడంలో ఆమె వీర శైవమతాన్ని పోషించిన విషయం విదితమవుతుంది. పల్నాటి యుద్ధంలో (క్రీ.శ.1180 ప్రాంతంలో జరిగింది) ఎవరు రాజకీయంగా గెలిచినా సామాజికంగా అందరూ ఓడారు. అపార ధన, ప్రాణ నష్టం జరిగింది. అందుకు వెరసి నాగమ్మ తన ముసలితనంలో తన సొంతూరు ఆరెవెల్లికి వచ్చి ప్రజల యోగక్షేమాల సాధనకై కృషి చేసిందని గుర్రం చెన్నారెడ్డి తన ‘పల్నాటి చరిత్ర’లో వ్రాశాడు. అంతేకాదు. “కొండకోనల నివసించు కోయవారు బాటసారుల హింసించు బందిపోటు అక్రమంబగు చర్యల విక్రమింపనణచివేసె నాగమ్మ సాహసము చూపి” అని డా. కోడూరు ప్రభాకరరెడ్డి తన ‘పల్నాటి భారతం’ (పద్యం 85)లో రాయడంలో ఆమె దొంగల నుంచి ప్రజలనెలా రక్షించిందో తెలుస్తున్నది (నేటికీ ఆదిలాబాద్ జిల్లాలలో గొత్తికోయలు సీజనల్ దొంగతనాలను ఆశ్రయించడం గమనార్హం) అందుకే ఆమె దొంగలకు శత్రువుగా మారింది. ఆ సాంప్రదాయం ఎంతవరకు కొనసాగిందంటే, ఆమె తరువాత ఐదు వందల సంవత్సరాల తరువాత విజృభించిన కొండల్రాయుడు అనే గజదొంగ కూడా ఆమెను మాయలమారిగా తలంచాడని బుడిగ జంగాల కథలో చెప్తారు. నాగమ్మకు ‘నా’ అన్న వారు లేరు కాబట్టి “పల్లె ప్రగతికి ధన మెల్ల వ్యయముజేసె’నని సాహిత్యాధారాలు తెలుపుతున్నాయి. ‘ఆమె యొనసరించినట్టి నిస్వార్థసేవ సర్వజనులకు మిగుల హర్షమ్ముగూర్చె” కాబట్టి ఆమెను స్థానికులు దేవతగా కొల్చారు. కనుకనే ఆమెకు ఆమె ఊరు ఆరెవెల్లిలో గుడికట్టారు. అది ఇప్పటికీ ఉంది. ఇక్కడికి దగ్గరలో ఉన్న పొలవాసలో కూడా ఒక స్త్రీ శివలింగాన్ని పట్టుకున్నట్లుగ విగ్రహముంది. అది శివభక్తురాలు నాగమ్మదే అయ్యుంటుంది. పక్క జిల్లా నిజామాబాదు జిల్లా బాన్సువాడ దగ్గరి దుర్కి సోమేశ్వరాలయ గర్భగుడిలో కూడా నాగమ్మ విగ్రహముంది. శాసనాలున్నాయి. వాటిని చదివితే మరిన్ని ఆధారాలు లభించవచ్చు. ఆరెవెల్లిలోని గుడికి తూర్పున నాయకురాలి వాగు, నాయకురాలి మడుగు ఉన్నాయి. వాటిని ఆమె తవ్వించినందుకుగాని, లేదా ఆమె సంక్షేమ కార్యక్రమాలకు గుర్తుగా గాని నాయకురాలు నాగమ్మ పేరుతో పిలుస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా లక్షెట్టిపేట దగ్గరలోని కన్నెపల్లి గుడిల నాగమ్మ విధవలకు, విడిపోయినవారికి మళ్లీ వివాహం జరిపించే సాంప్రదాయాన్ని నెలకొల్పింది. అది ఇప్పటివరకూ కొనసాగుతున్నది. ఇలా నాగమ్మ వచ్చి మండలం అంతటా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఈ విధంగా నాయకురాలు నాగమ్మ తెలంగాణ అందించిన మొట్టమొదటి మహిళా మంత్రిణే కాకుండా, ఆమె ఉత్తర తెలంగాణలో రెడ్డి కులాన్ని, వీరశైవాన్ని ప్రవేశపెట్టినదిగా, దొంగలను, దోపిడీలను పారదోలి ప్రజాసంక్షేమానికి పాటుపడినదిగా చరిత్రలో గుర్తుండిపోతుంది.
 – ద్యావనపల్లి సత్యనారాయణ,
చరిత్రకారుడు, 9490957078.

Saturday, 12 November 2016

తేరాల సిద్దేశ్వరస్వామి ( Sidheswara Swamy, Terala )

తేరాల సిద్దేశ్వరస్వామి ( Sidheswara Swamy, Terala )



దుర్గి  మండలంలోని తేరాల గ్రామంలో  భ్రమరాంబ సమేత సిద్దేశ్వర స్వామి ఆలయం ఉంది.      కోరిన కోర్కెలు తీర్చే చల్లని దైవంగా ప్రసిద్ధి చెందిన సిద్దేశ్వరస్వామి ఆలయానికి ఎంతో పురాతన చరిత్ర ఉంది. గంగవల్లి, మల్నాయుడు, నవీననాయుడు, దేవ ర్నాయుడు, సోమనాధ దేవరరాజదీ షులు ఈ ఆలయాన్ని క్రీశ 675 సంవత్సరంలో భాద్రపద బహుళ సూర్యగ్రహణ కాలంలో నిర్మించినట్లు ఇక్కడి శిలాశాసనంలో ఉంది.





పరుశు రాముడు ఈ ఆలయ ప్రాంతంలో తపస్సు చేసి ఇక్కడ గుడి కట్టించాలని సంకల్పం చేశాడు. శివలింగం కోసం వెళ్ళి వచ్చే లోపే సాక్షాత్తు పరమేశ్వ రుడే ఇక్కడ లింగరూపంలో ఆవిర్భివిం చాడని స్ధల పురాణం చెబుతుంది. అంతట పరుశురాముడు శివుడే స్వయం భూ అయిన వైనాన్ని తలుచు కొని ఇది దైవ సంకల్పమని భావించి, పక్కనే తాను తెచ్చిన లింగాకారాన్ని కూడా ప్రతిష్టించి పూజలు చేశాడు. ఇప్పటికీ ఈ ప్రాంత ప్రజలు ఈ దేవా లయంలో శివలింగాలలో ఒక దానిని పుట్టుడు లింగమని, మరొక దానిని పెట్టుడు లింగమని చెప్పుకుంటారు. ఆలయానికి తూర్పు దిశగా వాయు లింగేశ్వరస్వామి, పడమర దిశగా రుద్ర గుండం, దక్షణ దిక్కున తేరాల గ్రామం, ఉత్తరం గో గర్భం అనుస్ధాన గుండం ఉన్నాయి. ప్రస్తుతం తేరాలగా పిలవబడుతున్న పూర్వం బ్రాహ్మణ అగ్రహారంగా పిలుస్తారు. ఇక్కడి బ్రహ్మాణులు నలంద, తక్షశిల వంటి ప్రసిద్ధి పొందిన విశ్వవిద్యాలయాలలో ఆచార్యులుగా పనిచేసినట్లు ఇక్కడి శిలాఫలకం ద్వారా తెలుస్తొంది.



ఈ దేవాలయానికి ఎదురుగా కోనేరు ఉంది. ప్రకృతి సిద్దంగా నీరు ఊరి ప్రవహించే ఐదు బుగ్గలు కలసిన జలం ఈ కోనేరులోకి ఉబికి రావటం విశేషం. ఇది విబూది కోనేరుగా ప్రసిద్ది చెందింది. కోనేరు అడుగు బాగంలో సుద్దతో తయారైన విబూది ఉండలు సహజ సిద్దంగా ఏర్పడుతుంటాయి. ఈ విబూది వుండలను భక్తులు పరమ పవిత్రం భావించి తీసుకెళ్తూ ఉండటం జరుగుతుంది. ఆలయానికి పక్కన గో గర్భము అను సన్నని మార్గముంది. ఈ మార్గమునకు పొడవు, వెడల్పు ఒక అడుగుకు మించి కూడా వుండదు. అయినప్పటికీ పవిత్రమైన మనస్సుతో శివుని స్మరిస్తూ ఎంతటి స్ధూలకాయు లైన ఈ మార్గం ద్వారా తేలికగా వెళ్ళి స్వామి వారిని దర్శించుకొని రావచ్చు. ఈ దారి గుండా దైవ దర్శననాకి వెళ్ళి వస్తే కోరిన కోర్కెలు తీరుతాయని, సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాబ విశ్వాసం.



మాచర్ల మండలం రాయవరం  గ్రామ ప్రజలు శ్రీ భ్రమ రాంబ దేవి విగ్రహాన్ని తీసుకొచ్చి సిద్దేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి ష్టించి ఇలవేల్పుగా కొలుస్తూ ప్రతి సం వత్సరం శివరాత్రి పర్వదినాన ఆమెకు పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు, తలంబ్రాలు తీసుకొని భజనలు, కోలా టాలతో గుడి వద్దకు చేరుకుంటారు. శివరాత్రి రోజు నిర్వమించే శ్రీ భ్రమ రాంబ సమేత సిద్దేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలకు పల్నాడు ప్రాంతం నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. 

Friday, 29 July 2016

పల్నాటి విద్యాధాత కావూరి వెంకయ్య ( kavuri Venkaiah )

పల్నాటి విద్యాధాత కావూరి వెంకయ్య


గాంధీయవాదిగా నిరూపించుకున్న కావూరి వెంకయ్య పల్నాటి సీమలోని బడుగు బలహీన వర్గాలకు ఆరాధ్యదేవుడు. కొండ కోనల్లోని గిరిజన, దళిత, బడుగు, బలహీన వర్గాల పిల్లలను చేరదీసి వారిని విద్యాపరంగా అభివ`ద్ది చేసిన ఘనత వారికే దక్కింది. మారుమూల గ్రామల్లొని విద్యార్థుల కోసం పాఠశాలలు, హాస్టళ్లును ఏర్పాటు చేశారు. హాస్టళ్ల నిర్వాహన కొరకు గ్రామగ్రామాన తిరిగి పప్పు ధాన్యాలు, నిత్యవసర వస్తువులు సేకరించి విద్యార్థులకు బోజన ఏర్పాట్లు చేసేవారు. మాచర్లలో చెంచుబాలికల హాస్లళ్లు, కళామందిర్ సెంటర్ లోని చిన్నకాన్వెంట్ కు స్థలాన్ని ఇచ్చారు. నాగార్జనసాగర్ లో చెంచు బాలికల కోసం పాఠశాలను ఏర్పాటు చేశారు. వీటికి తోడు గురజాలలో హయ్యర్ గ్రేడు శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పారు. దీంతో పల్నాడులోని బాలబాలికలు దీనిలో శిక్షణ పొంది ఉపాధి పొందారు. కరువు సీమలో విధ్యాభివ`ద్దికి బాటలు వేసిన వెంకయ్య పల్నాటి విద్యాధాతగా వినుతినెక్కారు. మాచర్ల, గురజాల, కారంపూడి, పిడుగురాళ్ల, నాగార్జునసాగర్, కొత్తపుల్లారెడ్డి గూడెం, అలుగురాసుపల్లె తదితర గ్రామాలలో పాఠశాలల ద్వారా పేదవారికి విద్యాదానం చేశారు.

ప్రముఖులతో పరిచయం..

కావూరివెంకయ్య కి ఆనాటి ఎందరో ప్రముఖులతో పరిచయం ఉండేది. ఆ పరిచయం తో
ఆచార్య రంగా, గొళ్లపూడి సీతారామశాస్త్రి, గొపరాజు రామచంద్రరావు(గోరా)లను ఆహ్వానించి వారిచే విద్యార్థులకు సందేశాలు ఇప్పించేవారు. బూర్గుల రామక`ష్ణారావు, మర్రి చెన్నరెడ్డి, వల్లూరి బసవరాజు, కొండవీటి వెంకట రంగారెడ్డి, మాడపాటి హనుమంతరావు మొదలగు నేతలు వెంకయ్యగారి ఆశ్రయంలో గడిపి విధ్యార్థులకు తమ అమూల్య సందేశాలు ఇచ్చేవారు. వావిరాల గోపాలక`ష్ణయ్య తరుచూ వెంకయ్యగారి ఆశ్రమాన్ని సందర్శించి వారి క`షిని అభినందించేవారు. చదువుల వాసన ఎరగని మారుమూల అట్టడుగు పిల్లలను వెలుగులోెకి తెచ్చి వారికి విద్యను అందించారు. ఈయన పాఠశాలల్లో చదివిన ఎందరో విధ్యార్థులు గొప్పగొప్ప ఉద్యోగాలలో ఉన్నారు. ఇప్పటికి ఆయా కుంటుంబాల వారు వెంకయ్య పేరు చెప్పుకొని ఇంటి దీపం పెట్టుకుంటారు. వెంకయ్య అక్షరాల సోషలిస్టు. అందుకే ఆయన నిర్వహించిన పాఠశాలలు, హాస్లళ్లు భవనాలు, స్థలాలు ప్రభుత్వ పరం చేశారు. మాచర్ల ప్రస్తుతం నడుస్తున్న ఆర్ సీ ఎం పాఠశాలను ఆనాడు భననాలతో సహా యాజమాన్యానకి విరాళం అందించారు. విద్యాలయాలుగా ఉన్న స్వంత భవనాలను కూడా ఉచితం ప్రభుత్వ పరం చేసిన త్యాగ ధనుడు వెంకయ్యగారు. 1940 సత్యాగ్రహి, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్లోని జైలు జీవితం గడిపారు. గాంధీజి పిలుపు మేరకు స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొని పల్నాటి కి వెలలేని కీర్తని తీసుకొచ్చారు.

Friday, 13 February 2015

తేరాల సిద్దేశ్వరస్వామి ( Sidheswara Swamy, Terala )

తేరాల సిద్దేశ్వరస్వామి
సాధారణంగా ఏ శైవ క్షేత్రంలోనైనా గర్భాలయంలో ఒకే శివలింగం దర్శనమిస్తుంది. చాలా అరుదుగా .. అక్కడి స్థలమహాత్మ్యాన్ని బట్టి రెండు శివలింగాలు కనిపిస్తూ ఉంటాయి. అలా రెండు ఉన్న శివలింగాలు ... ఒకదాని పక్కనే మరొకటిగా కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా ఒకే గర్భాలయంలో ఒక శివలింగం వెనుక మరొక శివలింగం ఉండటం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 

అలాంటి ఆశ్చర్యానికి గురిచేసే క్షేత్రం గుంటూరు జిల్లా దుర్గి మండలం పరిధిలో దర్శనమిస్తుంది. సిద్ధేశ్వరుడుగా స్వామివారు పూజలు అందుకునే ఈ క్షేత్రం, 'తేరాల' గ్రామానికి సమీపంలో అలరారుతోంది. ఇక్కడి గర్భాలయంలో రెండు శివలింగాలు ఒకదాని వెనుక మరొకటి కనిపిస్తూ పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాయి. ఈ రెండింటిలో ముందుగా కనుపించేది స్వయంభువు శివలింగమనీ, దాని వెనుక కనిపించేది పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగమని స్థలపురాణం చెబుతోంది.

క్షత్రియ సంహారం వలన కలిగిన పాపాల నుంచి విముక్తిని పొందడానికిగాను పరశురాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి వస్తాడు. ఆయన సంకల్పానికి తన అనుగ్రహాన్ని అందిస్తూ శివుడు స్వయంభువుగా ఆవిర్భవిస్తాడు. అందుకు ఆనందాన్ని వ్యక్తం చేసిన పరశురాముడు, తాను తీసుకు వచ్చిన శివలింగాన్ని దాని వెనుకన ప్రతిష్ఠిస్తాడు. ఈ కారణంగానే ఇక్కడి శివలింగాలు ఒకదాని వెనుక ఒకటిగా దర్శనమిస్తుంటాయి.

పాపాలను హరించడం కోసం పరమశివుడు స్వయంభువుగా ఆవిర్భవించాడు కనుక ఈ క్షేత్రం మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. అరుదైన క్షేత్రం కనుక కార్తీకమాసంలో ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శిస్తూ వుంటారు. ప్రశాంతతకు ప్రతీకగా కనిపించే ఈ క్షేత్రం వనభోజనాలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అందువలన భక్తులు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుని మరీ ఇక్కడికి వస్తుంటారు. స్వామి సన్నిధిలో ఆధ్యాత్మిక పరమైన అనుభూతిని సొంతం చేసుకుని వెళుతుంటారు.

Friday, 16 January 2015

" పల్నాటివీరచరిత్ర " -- ద్విపదకావ్యం -10

భట్టు నలగామరాజునకు రాజనీతి విశేషంబులఁదెల్పుట

పగవృద్ధిబొందించు భ్రష్టులేకాని
అడగించునేర్పరు లవనిలోలేరు
నరసింగభూమీశు నమ్మికమీరు
తమ్ముడా మలిదేవధరణీశుకడకు
పంపుడికయేకమై పగలనునణచి
పలనాడుమొదలైన బహుభూములెల్ల
ఎదురెవ్వరునులేక యేలుడిసుఖిత
శృంగారయుతు నరసింగుభూమీశు
పంపుముమలిదేవ పతిగలయంగ
పోరుమంచిదిగాదు భూమినెక్కడను
పాడౌనుదేశంబు పగమించెనేని
ప్రజలెల్లనశియించి పారిపోవుదురు
బండారమునకును పైకంబులేదు
రాణువ అందుచే రహిచెడియుండు
చేజీతగాండ్లెల్ల జెలగికోపించి
యీగలజీతంబు లిమ్మందురపుడు
పతిబంటుమేరలు పరిహృతమగును
పంపినపనిచేయు పాలుమాలుదురు
తెలిసినశాత్రవుల్ ధీరతతోడ
భూమినిగొనుటకు బుద్ధిపెట్టుదురు
పగవారివార్తలు పరికింపలేరు
మేకొనిమీలొన మీరుపోరాడ
చూచెడువారికి జులకనయౌను
కోరిశాత్రవులుమీ గుట్టెఱుంగుదురు
పలువలుమిముజేరి పగజావనీక
చెప్పుచునుందురు చెనటివాక్యములు
ఐకమత్యముచెడు నద్దానితోడ
చెడునుబలంబును చెడునుభాగ్యంబు
చెడునుయశంబును చెడునుశౌర్యంబు
చెడునురాజ్యంబులు చెడ్డపిమ్మటను
దేశంబు పరనృపాధీనమౌసుమ్ము
పారతంత్ర్యంబు మీపైబడగలదు
పరతంత్రజనముల పాలికష్టములు
చెప్పంగనలవియే శివునకునైన
పంజరంబుననున్న పక్షులరీతి
బంధించిబుట్టలో పాములవాఁడు
వదలకపెట్టిన ఫణులచందమున
గంగిరెద్దులవాఁడు కావరమణచి
ముకుదాడుపొడిచిన పోతెద్దులట్లు
బోనులోనుంచిన పులులవిధంబు
స్వతంత్ర్యహీనఁత బడియుండవలయు
పరికింపగా మనోవాక్కాయములను
ప్రథమమ్ముపట్టగా రానిదిగాన
వాక్కాయములురెండు బంధింపబడును
మనసులోఁబుట్టిన మంచితలంపు
లాచరణమునందు అలవికాకున్న
జన్మఫలంబేమి చచ్చుటేమేలు
అవ్యక్తకీట తిర్యగనేకహీన
యోనులలో నెన్నియోమార్లు పుట్టి
పడయకపడయక పడిసినయట్టి
దుర్లభనరజన్మ దూషితంబగును
పార్థివాయిటువంటి పారతంత్ర్యంబు
కటకటా పగవారికైననువలదు
కుందబృందసితాబ్జ కుముదాప్తతార
హీరడిండీరనీ హారపటీర
ఘనమరాళంబుల కాంతినిమించు
సత్కీర్తివేగమే సరవినశించు
అపకీర్తిజగముల నధికమైయుండు
ఉభయవాదులుమీర లొక్కటైయున్న
సకలకార్యంబుల సమకూర్పవచ్చు
ప్రజలకుసుఖమౌను పంటలుపండు
ధనముసంపాదింప దగియుండునపుడు
సంపూర్ణకాములై సకలసేవకులు
కాపాడుదురుమిమ్ము కనిపెట్టియుండి
పరరాజులనుగొల్వ పైకొనిపోయి
అమితమ్ముగాగ ధనాదులనెల్ల
కొనవచ్చు ధర్మముల్ కూర్పంగవచ్చు
సత్కీర్తిజగముల సాంద్రమైనిల్చు
కలహించి వెనుకటి కౌరవులెల్ల
గతిచెడిపడినట్టి కష్టముల్ వినమె
పగపెరిగించుట భావ్యంబుగాదు
ఉభయవాదులుమీర లొకటికనుక
నయమొప్పజెప్పితి నామాటవినుడి
అనుచుజెప్పిననీతు లాలింపడయ్యె

నలగాముడు భట్టుమూర్తిచెప్పిన వాక్యంబుల నిరాకరించుట

కామభూపాలుండు కనులెర్రచేసి
కోపంబుమించగా కొలువెల్లజూచి
వింతిరేసభవారు వీరలతలపు
రాణువతో మును రణభూమినిలిచి
తమ్మునంపమటన్న ధర్మమాతమకు
విన్నవారలెల్ల వెరగందగలరు
మగతనంబునబుట్టి మగకాశగట్టి
మగటిమివిడనాడి మానంబువిడిచి
వారున్నతావుకు వచ్చుటతగవె
భటవృత్తివాడవై పల్కితివిట్లు
పూర్వకార్యంబుల పుట్టువుమరచి
ఈరీతిబల్కితి వేమందునిన్ను
అనరాదువినగూడ దామాతలిపుడు
తమభూమినిచ్చిన దక్కించుకొనగ
శక్తిగల్గినజాలు సదయుడనగుచు
ఇచ్చితితమభూమి యేలికొనంగ
అనుచువింతగబల్క ఆమాటలకును
భావం తెలియక పటురోషమంది
వవ్వుచుడగ్గరి నాయకురాలు

నాయకురా లేకాంతంబున నలగామునకు సంధివిముఖంబులైన మాటలుచెప్పుట

ఎవ్వరువినకుండ ఏకాంతమునను
పల్కెకామునితోడ ప్రావీణ్యమొప్ప
విను నరనాయక విన్నవించెదను
బాలరాజులుతాను బ్రహ్మనాయకుడు
కలిగినబలముతో కార్యమపూడి
కలనుప్రవేశించి కదనంబుజేయ
కనిపెట్టియున్నాడు గ్రక్కునమిమ్ము
రమ్మనిపిలిచిన రామనరాదు
కలిగినబలిమియు కలిమియువిడిచి
మగటిమివిడనాడి మానంబుదూలి
పంచిభూమినొసంగ పంతంబుగాదు
కయ్యంబుచేయుట ఘనవిచారంబు
ఇద్దరురాజులై యేర్పడిరేని
అవనిలోపలనాఙ్ఞ కమరికయౌనె
సిరిపొత్తుచేయిట చెల్లునుగాని
ఆఙ్ఞపొత్తిచ్చుట అదినీతిగాదు
చర్చించిచూచిన ఙ్ఞాతియుండంగ
అగ్నితోబనియేమి అన్నవాక్యంబు
వినవెపెద్దలుచెప్ప పృథ్వీతలేంద్ర
పరగకుజోటివ్వ పాదుకొనెదరు
తరువాతబెరుకంగ ధరనసాధ్యంబు
పాండవులకుభూమి పాలిచ్చిపిదప
కౌరవులేమైరి కార్యమర్మజ్ఞ
నీవెరుంగనినీతి నేనెరుంగుదునే
అనవినిభూమీశు డాత్మలోదెలిసి

" పల్నాటివీరచరిత్ర " -- ద్విపదకావ్యం -9

నలగామరాజు సభయందు విద్యా వినోదములు జరుగుట

వింతగాగాయనుల్ వీణలబూని
తంత్రులుబిగియించి తగసుతిబెట్ట
సరిగమేళములైన స్వరసప్తకంబు
ఆరోహణావరోహణ భేదములను
బహురాగసంప్రాప్తి పట్టుగాజేర్చి
సంచారిసంస్థాయి సరసభావముల
మృదుతరశబ్ధార్థ మిళితమైనట్టి
ఘనతరాలంకార గతిపరంపరలు
మూర్చనల్ మొదలైన ముఖ్యధర్మములు
జంత్రంబుగాత్రంబు జంటగావించి
చెలగియెండినచెట్లు చిగిరించునట్లు
పాడిరితమతమ ప్రావీణ్యమెసగ
పాకశాసనుకొల్వు పగిదినున్నట్టి
వేళనేతెంచిరి విద్యాధికతను
నాట్యమేళమువారు నవవిలాసముల
వచ్చినమ్రతమ్రొక్కి ప్రక్కగానిల్వ
ఘనవైభవంబున కామభూవిభుడు
నవ్వుచుసెలవిచ్చె నాట్యంబుచేయ
వరమృదంగములెస్స వాయించుమేటి
కుడిభాగమునయందు కుదురుగానిలిచె
తాళమానఙ్ఞులు దాపటిదిశను
నిలిచిరుత్సాహంబు నేరుపుమీర
ముఖవీణవాయించు ముఖ్యుడొకండు
రాగమాలాపించు రమణులిద్దరును
నిండువేడుకతోడ నిలిచిరివెనుక
కంజలోచనయను ఘనమైనపాత్ర
మదనుపట్టపుదంతి మంజులవాణి
భరతశాస్త్రోచిత బహురాగములను
గరిమతోనేర్చిన కంతుబాణంబు
వచ్చిసభాసదుల్ వర్ణించిచూడ
నిలిచినాట్యమునకు నేర్పరియైన
వేత్రపాణికిదగ వినయంబుజూపి
అతడొసంగినగజ్జ లతిభక్తితోడ
పాదములంగట్టి పంచవర్ణముల
కాశగట్టిగగట్టి కడుజపంబడర
మద్దెలతాళాల మధ్యనిల్చుండి
ఓరచూపునరాజు నొయ్యనజూచి
సమపాదయుతమైన స్థానకస్థితిని
తాత్పర్యమున దేవతలకునుమ్రొక్కి
పుష్పాంజలియొసగి ఘనకళాశైలి
కైముడికట్నముల్ కనుపింపజేసి
వెలయంగతొమ్మిది విధములయినట్టి
భూచారినాట్యంబు పొందుగాసలిపి
పదునారువిధములై పరగినయట్టి
ఆకాశచారియు నమరంగనాడి
అంగహారాఖ్యగలట్టి నాట్యంబు
విదితమౌతొమ్మిది విధములనాడి
గతిచారిభేదముల్ గనుపడునట్టు
బ్రమణసంయుతదీప్త పటిమమీరంగ
పాణిభేదములను బాటించిచూపి
స్థానకసంచయ సంయుక్తి అమర
ప్రేరణిదేశిని ప్రేంఖణశుద్థ
దండికాకుండలి తగుబాహుచారి
సప్తతాండవములు సల్పెచిత్రముగ
సభవారలాశ్చర్య సంయుక్తులైరి
తరువాతనిరుమేల దగుచెలులమర
సయుతాసంయుతా చలనసంకుచిత
నానార్ధకరములు నాట్యహస్తములు
శిరమునుచూపులు చెక్కిళ్ళుబొమలు
దంతోష్ఠకంఠముల్ తగు చుబుకంబు
ముఖరాగవక్షముల్ మొదలుగానెన్న
అంగంబులారు ఉపాంగంబులారు
ప్రత్యంగసముదాయం బారునుగూడి
యెనిమిదిపదియగు నెసగునంగంబు
లమరంగనభినయం బాశ్చర్యముగను
మాచర్లచెన్నుని మహిమంబుదెలుపు
ఆంధ్రసంస్కృతవాజ్మయాదిగీతముల
భావంబులెస్సగ ప్రకటంబుచేయ
చూచిరంభాదులు చోద్యంబునొంది
శిరసులువంచి సిగ్గునుచెంది
రపుడుభూమీశు డాదరంబొప్ప
వస్త్రభూషణములు వారలకిచ్చి
భట్టునురమ్మని పంపించెపిదప

రాయబారమునకు వచ్చిన భట్టు నలగామరాజుసభయందుఁ బ్రవేశించుట

తురగంబుపైనెక్కి దుమికించుకొనుచు
వచ్చికొల్వునుజేరి వాజినిడిగ్గి
భూమీశునెదుటను బొందుగానిలిచి
రాజాధిరాజ విరాజితకీర్తి
రాజవేశ్యావిట ప్రభావప్రకట
గండరగండాంక ఘనదానచతుర
ధైర్యనిర్జితమేరు ధరణీధరేంద్ర
శౌర్యవిక్రమకళా సంపూర్ణచంద్ర
భాస్కరసమతేజప్రౌఢగుణాఢ్య
మానదుర్యోధన మైలమ్మసుతుడ
అనుగుభూపతిపుత్ర అంచితగాత్ర
వీరకామనరేంద్ర విభవదేవేంద్ర
రాయబారమునకు రాజుపంపించ
వచ్చిన అల్లుని వధియించినారు
మనసునక్రోధించి మలిదేవరాజు
తమ్ములుతానును దనబంధుజనులు
వీరనాయకతతి విఖ్యాతిమెరసి
ఖరదూషణాదులు గతమైనచోటు
శ్రీశైలభూమిలో శ్రేష్ఠమైనట్టి
కార్యమపురిభూమి ఘనపుణ్యరాశి
పటుతరవిక్రమ వైభవంబలర
ధాటిమైనిల్చిరి దండుతోగూడ
అలరాజుతోడనే హతమౌదుమంచు
చలమునకోపంబు సంవృద్ధినొంద
వీరనాయకులును వేగిరపడగ
మలిదేవభూపతి మన్నించియిటకు
నన్నుబుత్తెంచెను నరనాధవినుము

" పల్నాటివీరచరిత్ర " -- ద్విపదకావ్యం -8

నాయుడు నలగామరాజువద్దకు భట్టును రాయబారమునకై పంపుట

భట్టునుపొమ్మన్న పయనమైతాను
వాయువేగముగల వాజిపైనెక్కి
బంగారుగుబ్బతో భాసిల్లుగొడుగు
పట్టుకముందర భటుడొకడేగ
విలసిల్లుజల్లుల వింజామరంబు
లీవలావలనుండి యిద్దరువీవ
గురిజాలకేతెంచి కువలయభర్త
తావుకుముందర తగచెప్పిపంపె
వినికామభూపతి విభవంబుమెరయ
కొలువుశృంగారింప గూర్చినవారి
పంపించెవారలు పరిచారజనుల
రప్పించితీర్చిరి రమణీయముగను
కస్తూరిచేతను గలయంగనలికి
మూత్యాలతోడుత ముగ్గులు వెట్టి
కర్పూరముదకంబు కలిపిముందటను
కలయంపిచల్లి నిష్కల్మషభంగి
శ్రీరామకథలను శ్రీకృష్ణకథలు
పన్నుగావ్రాసిన పటములదెచ్చి
కట్టిరిగోడలు కనుపడకుండ
మౌక్తికమంజీర పంజుపుంజంబు
వ్రేలాడుచుండెడు వివిధవర్ణముల
ఘనవితానమ్ములు కట్టిరిమీద
నిలువుటద్దంబులు నిలిపిరిదిశల
తంతుపటములు విస్తారముగబరచి
వన్నెలపటములు వానిపైబరచి
పరచినవానిపై పంచవర్ణముల
రత్నకంబళములు రంగుగాబరచి
కంచననవరత్న ఖచితమైనట్టి
పీఠమొకటిదెచ్చి పెద్దకొల్వునను
నిలిపిరిదిక్కుల నిగ్గులుదేర
చెలువుగా నీరీతి జేసినవార్త

నలగామరాజు కొల్వుకూటమున కేతెంచుట

వినినంత నలగామపృథీశ్వరుండు
సరసంపుపన్నీట జలకంబులాడి
ఘనశుచివస్త్రముల్ కటియందుదాల్చి
చిత్రాసనంబుపై జేరికూర్చుండి
నిలువుటద్దముజూచి నేరుపుమీర
తిలకంబునుదుట సుస్ఠితిమీరదీర్చి
సంధ్యాదికృత్యముల్ సమ్మతిజేసి
భుజియించితరువాత పునుగుజవ్వాజి
కస్తూరిరసమును గలిపినయట్టి
శ్రీచందనమును మేన చెలువుగాబూసి
తగటుకూనంబులు ధరియించితలకు
ఒకవింతయిష్టీష మొప్పుగాగట్టి
నవరత్నమాల కంఠంబునవ్రేల
డంబుగా కర్ణకుండలములు మెరయ
భుజకీర్తులనియెడు భూషలుదాల్చి
మేనికిరక్షయై మించుతాయెతులు
దండచేతులరెంట ధారణచేసి
మురుగులుగొలుసులు ముంజేతులందు
తిరముగావ్రేళ్ళ ముద్రికలనుబెట్టి
నవరత్నఖచితంపు నడికట్టుదాల్చి
గండపెండేరంబు కాలికిబెట్టి
బంగారుదుప్పటి పైననుగప్పి
పావుకోళ్ళనురెండు పదములదొడిగి
కటికివారలుమ్రోల కనుపించిపొగడ
ఈవలావలజేరి హెచ్చరింపంగ
వేత్రహస్తులుగూడి విచ్చలవిడిని
సందడిదూరమై చనునట్లుచేయ
రహిమించ నంతఃపురంబును వెడలి
కొలువునకేతెంచె కుతుకంబుమీర
నిలిచెశృంగారంబు నేర్పునుగనగ
అంతటకింకరు లతివేగమునను
తూలికాతల్పంబు దూర్చినయట్టి
ముఖమల్లుగుడ్డలు మునుకొనితెచ్చి
పరచిపీఠముమీద బాగైనదిండ్ల
ఉంచినగనుగొని యుర్వీశుడైన
కామభూమీశుండు గద్దెపైనుండె
వెనుకను నరసింగవిభుడు గూర్చుండె
నాగమయొకవంక నమ్రతనుండె
బంధుజనముచుట్టు బలిసికొల్వంగ
వేదశాస్త్రఙ్ఞులు విద్వంసులెల్ల
ఆశీర్వదించుచు ఆసీనులైరి
సకలదేశాధీశ సచివపుంగవులు
ముకుళితహస్తులై ముందరనుండ్రి
శాస్త్రపారగులును సంస్కారయుతులు
కవులునుభటులును కనిపెట్టియుండ్రి.

" పల్నాటివీరచరిత్ర " -- ద్విపదకావ్యం -7


ససైన్యముగ మలిదేవరాజు కార్యమపూడింజేరుట

భానుండుదిక్కుల ప్రబలెనావేళ
తరువాతమలిదేవ ధరణీశ్వరుండు
పొలుపొందకార్యమ పురికేగదలచి
తానుబ్రహ్మగలసి తగవిచారించి
ఘనమైనడెరాలు గట్టినబండ్లు
ఇతరవస్తులుమోసి యేతెంచునట్టి
యెద్దులనొంటెల నెల్లముందుగను
సాగించియంతట సంతోషమునను
కాలిబలంబుల ఘనఘోటకముల
మదమునవిలసిల్లు మంచిఏనుగుల
నాలుగుదిశలను నడువంగజేసి
వీరనాయకులూని వెసజుట్టినదువ
తమ్ముడునాయుడు తగుభందుజనులు
తమతమవాహనోత్తమములనెక్కి
వెంబడియేతేర విభవంబుమీర
తరచుగారత్నముల్ స్థాపించినట్తి
పాలకిలోనెక్కి బట్లునుతింప
ఇరువంకనరిగెల నెత్తిక్రమ్మంగ
పటువేత్రకుల్ బరాబరులొనరించి
"అవధారురాజేంద్ర" యని హెచ్చరింప
పూజ్యుండు మలిదేవభూపతిచనియె
ఐదువిధంబుల నమరువాద్యంబు
లాకాశమంతయు నదిరెడునట్లు
సాంద్రధ్వనుల్ హెచ్చె సంతసంబంది
కదనరంగంబైన కార్యమపూడి
పుణ్యభూమినిజేరి పొందుగాదండు
విడిసెనువైరులు వెక్కసంబంద
వేదశాస్త్రఙ్ఞులు విప్రులందరును
అధిపునాశీర్వాద మమరంగజేసి
సరసంపుభూమి ప్రశస్తంబొనర్ప
చెన్నకేశవదేవు శ్రీపాదజలము
తివిరిపూజారులు దెచ్చుటజేసి
తులసిపత్రంబులతోడ తీర్థంబు
అచ్చోతచల్లించి అలరు లగ్నమున
శంకుసంస్థాపన సమ్మతిజేసి
నిక్సేపముగరత్న నిచయంబులుంచి
తెచ్చినకంబంబు ధీరతతోద
నడికలనిన్నిల్పె నరనాథవరుడు
కాశ్మీరకస్తూరి కర్పూరయుక్త
పరిమళగంధంబు బాగుగాబూసి
మైసాక్షిగుగ్గులు మహితధూపంబు
అర్పించి అటమీద నారగింపంగ
మృగములమాంసంబు మెప్పుగావండి
పంచామృతంబులు పాయసాన్నములు
పేరైనపచ్చళ్ళు పిండివంటలును
భూతరాట్టునకప్డు భోజనంబిచ్చి
అఖిలభూతంబుల కాచారముగను
ఘనమైనపోతుల గావుచెల్లించి
తరువాత సర్పాఖ్య తటినిలోపల
పటుగంగధారనా బరగినమడుగు
పొంతకుజని వీరపుంగవులెల్ల
తమతమనామముల్ ధరలోనదరుచు
ప్రఖ్యాతినొందగ భక్తితోనందు
స్నానంబుజేసి విశాలతీరమున
నిలిపిరి లింగముల్ నేమంబుతోడ
తరువారమలిదేవ ధణీశ్వరుండు
నాయునితోడను నదికినేతెంచి
కాలోచితక్రియల్ క్రమముగాజేసి
నామతీర్థంబులు నయమొప్పదీర్చి
పటకుటీరములకు బన్నుగావచ్చి
సకలనాయకతతి సన్నిథినుండ
కొలువునగూర్చుండె కుధరారిరీతి
అప్పుడూబ్రహ్మన్న అవనీశుతోడ
ఉచితవిచారంబు నొనరించిపిదప
చెలగుచుసమరంబు చేయగావెలెను
తరచైనబలముతో తరలిరమ్మనుచు
పొలుపొందునలగామ భూమీశుకడకు.

" పల్నాటివీరచరిత్ర " -- ద్విపదకావ్యం -6

బ్రహ్మనాయుడు కార్యమపూడి యుద్ధరంగముఁ జేరబోవుట

అనుచునచ్చటివృత్త మఖిలంబుచెప్ప
వినిబ్రహ్మనాయుండు వీరధైర్యమున
ద్వాదశసూర్యులు ప్రబలినరీతి
నెవ్వరికెరిగింప కేగెనావేళ
పొలుపొందనారుద్ర భూమికేతెంచె
నాలుగుకరముల నాయుడునిలిచె
ఆరుద్రవసుమతి నాశ్చర్యముగను
కూలినశల్యముల్ కురుచతుండములు
సొక్కినచర్మముల్ చుట్టలైఉన్న
పేగులునరములు పెంటలైఉన్న
యేడుమాసంబుల యెముకలుపగిలి
రాలిదట్టంబైన రాసులుతరుచు
మునిగిదుర్గంధంబు మొనసినమెదడు
గాలికిదూలెడు ఘనశిరోజములు
కాలికుప్పలుబడ్ద కాయవిభూది
చిదిమినశవములు చెదురుకొరువులు
నానావిధంబుల నాట్యముల్ సలుపు
భూతకోటులతోడ పొందుగానుండె
తలకాయపుర్రెల దగుబంతులాడు
శాకినుల్ మొదలైన సకలభూతములు
బెదరకవాదించు భేతాళచయము
పిల్లాటలాడెడు పెనుపిశాచములు
మిణుగురుల్ దిక్కుల ముంచిరాల్పుచును
కొమరొప్పపరుగిడు కొరవిదెయ్యములు
వేదమంత్రంబులు వెసపఠించుచును
బ్రహ్మనాయునిజూచి భయసంభ్రమమున
ఆశీర్వదించుచు నళుకుచుతొలగి
పరుగులుపెట్టెడు బ్రహ్మరాక్షసులు
కలగిబ్రహ్మన్నను కనినంతలోన
పారిభయమున బలుదైత్యవితతి
ఇటువంటిరణభూమి నెసగనీక్షించి
ఘనకార్యములకెల్ల కారణంబగుచు
ఎముకలపెంటయై యేహ్యమైఉన్న
కార్యమాపురిపుణ్య ఖనియగునట్లు
కావింతుదేవతల్ గనిసంతసింప
ధీరతశ్రీవీరతిరుపతిసేయ
వలెనంచునూహించి వైరులపాలి
కాలమృత్యువువంటి ఘనుడుబ్రహ్మన్న
భయదమౌ రణభూమి ప్రబలుడైనిలిచి
మూడుకాలంబుల ముచ్చటలెల్ల
తెలిసినయెరుకల తెరవనీక్షించి
బలువైనబ్రహ్మండ పజ్త్కులనెల్ల
పుట్టింపరక్షింప పొలియింపనేర్చు
బ్రహ్మదేవునివిష్ణు ఫాలలోచనుల
ప్రార్ధించికీర్తించి ప్రణతులచేసి
హరియొక్క పదియైన యవతారములను
మనసునదలబోసి మానంబురోసి
భువనరక్షణచేయ బుద్ధిలోనిలిపి
పరమేశ్వరునిగూర్చి పలికెబ్రహ్మయ్య
"ఓచక్రధర!స్వామి ఓకంజనాభ
జలముపైపవళించు సర్వభూతేశ
ప్రమథావతారులు బలువీరవరులు
ప్రధ్నవసుమతిలోన ప్రాభవమొప్ప
ఇత్తుముప్రాణంబు లీయనినంచు
వచ్చియున్నారదె వైభవంబలర
వీరసింహంబులు వీరనాత్యంబు
చేయుదురిప్పుడు స్థిరబుద్ధితోడ
పూతత్వహీనత పొరయునీభూమి
నిర్దుష్టముగజేయ నిన్నువేడెదము
నీచరణంబున నెరిజనియించి
గంగయై ఖ్యాతినిగాంచి లోకముల
క్షాళతమ్మొనరించెగదా పూర్వమందు
ఆజలరూపమై యమరుమేఘంబు
వర్షించియీభూమి పరమపూతంబు
చేసెడునట్లుగా సెలవిమ్ముతండ్రి"
అనుచుబ్రహ్మనవేడ నాలించిహరియు
ఫణిశాయియైయుండి పంపెదేవేంద్రు
నతడుప్రేరేపింప నానీలమేఘు
మాకాశమెల్లను నల్లినట్లుండి
గాఢాందకారంబు గప్పెభూస్థలిని
ఘూర్ణిల్లుధ్వనులతో కుంభినిమీద
ఉరుములుపిడుగులు నొయ్యనబడగ
తళతళమెరుపులు తరచుగామెరయ
వడగండ్లురాలంగ వాయువువిసర
వాగువంతలనీళ్ళు వరదలైపార
గుంతమిట్టనరాక కుంభినినెల్ల
ముంచెదేవతలంత మూకలైచూడ
జలజనాభునిపాద జనితమైనట్టి
గంగలోకములెల్ల క్రమ్మెనోయనగ
ఏకార్ణవంబుగా హెచ్చివర్షించె
అప్పుడాజలమధ్య మందుండియెక్క
పునుకజలముపైన బొర్లాడికొంచు
పడమరగావచ్చి బ్రహ్మన్నవద్ద
నిల్చిహసించెను నిష్కారణముగ
అప్పుడుబ్రహ్మన్నయు నానవ్వుజూచి
తలపుర్రెతోననె దగువాక్యములను
నవ్వినహేతువు నాతోడజెప్పు
వీనులనిండగా వినగోరినాడ
అనిననాయునితోడ నాపుర్రెపలికె
నాపూర్వమంత విన్నపముచేసెదను
శంఖచక్రాంకిత సకలలోకేశ
ఇందిరామందిరా యినచంద్రనేత్ర
జలజజజనకుండ శార్ఙ్గశరానా
సకలవేదమయాత్మ శ్యామలవర్ణ
సకలధర్మంబులు సమసెడువేళ
తగినరూపముదాల్చి ధరబ్రోతువెపుడు
వేదశాస్త్రంబులు వినుతులుసేయ
చాలగజడనిధిశయనించుచుందు
దనుజేంద్రసంహార తార్క్ష్యవాహనుడ
యెత్తితీయవతార మీయుగమునందు
శోభిల్లునీమేను జూడంగగలిగె
తప్పజూదకవిను తగుమనముంచి
దానవుడనుగాను దయ్యముగాను
భూరిభయంకర భూతంబుగాను
వాసియౌయాకాశ వాణినిగాను
రహిమించగ బ్రహ్మరక్షస్సుగాను
జలనిధికోటయై చక్కనైయుండు
దక్షిణజలనిధి దండనున్నట్టి
రమపురమనుపేర రాజిల్లుచున్న
పట్టణంబేలెడు పరమధర్ముండ
జలనిధిసోముడనేను సర్వజ్ఙ్ఞతిలక
ద్వాపయుగమున ధైర్యంబుతోడ
బహుతరాక్షౌహిణుల్ బలములగూర్చి
ధూర్జటికెదిరించి దూరమొనరించి
కరులుగుర్రంబులు కాలిమానుషులు
హతమైనపిమ్మట నాలంబులోన
పడితినిపగవారి పంతంబుగెలువ
రణధూర్తుడనుగాను రాజునుగాని
సర్వయుగజనులు సమసినకలని
గతిగానకీలాగు కాలంబుబుచ్చు
చెదురుచూచుచునుంటి మెంతయుమేము
వీరాగ్రగణ్యత వెలసిననీవు
కదనవిక్రముడవై కలనికివచ్చి
శోధింపదిరిగితి శూరధర్మమున
పరమాత్మ మాజన్మ పావనంబాయె
వైకుంఠపట్టణ వైభవంబెల్ల
కంటినాయునిమూర్తి కన్నందుచేత
నీపాదములధూళి నెరసినకతన
పావనంబాయెనీ భండనభూమి
ఇటువంటికనిలో నేపునమీరు
కదననాట్యముసల్ప కడుసంతసిల్లి
శంకరుడింద్రుండు సకలదేవతలు
ఎదురుగాచనుదెంచి యిత్తురిష్టములు
ఘనపవిత్రులుగాగ కలియుగమందు
వీరపుంగవులయి వెలయంగగలరు
పరువడిచనిన భూపరులలోగలసి
దివికెగెదముమేము దేవదేవేశ
అనిచెప్పిబ్రహ్మచే నంపించికొనిరి
కరమొప్పపండ్రెండు గడియలతడవు
హుంభవర్షంబయ్యె కుంభినియందు
నీతిచేభూతముల్ నిల్చికొల్వంగ
కలనికికర్త్రియై ఘనమైనశక్తి
గరిమబ్రహ్మన్నను గాంచియునిల్చె
నిలిచినగనిగొని నీలవర్ణుండు
"ఓవిశ్వమయమూర్తి ఓవిశ్వకర్త్రి
ఓలోకపావనీ యోజగద్ధాత్రి
యోశాంభవీదేవి యోలోకసేవ్య
సమరంబునకునీవు సాక్షివైయుండు"
మనుచుప్రార్ధనజెసి యాబ్రహ్మనీడు
మగిడెమనోవేగ మానితగతిని
వేగుజాముకువచ్చి విడిదిలోనిలిచె
తెల్లవారగనప్డు దివిజులుప్పొంగ
చుక్కలకాంతులు శూన్యమైయడగె
కలువలమిత్రుని కాంతులుతగ్గె
చీకటిగుహలలో జేరియుదాగె
గుడ్లగూబలుపోయి (గొందులనణగె)
చక్రవాకంబులు సంతసంబందె
కమలముల్ వికసించె గలువలుమొగిడె
తమతమకార్యముల్ తగజెసికొంచు
మోదంబునొందిరి భూజనులెల్ల
వేదమంత్రంబుల వినుతులుజేసి
అఖిలభూసురతతి ఆర్ఘ్యంబులియ్య
పూర్వపర్వతశిరః పూజ్యాగ్రమందు
ఘనతరమాణిక్య ఖచితసౌవర్ణ
కుంభంబువలెనిల్చి గురుతేజమునను

" పల్నాటివీరచరిత్ర " -- ద్విపదకావ్యం -5

కార్యమపూడి రణరంగమును బరీక్షించుటకై బ్రహ్మనాయఁడు కన్నమనీని నర్ధరాత్రమునఁ బంపుట

అంతటబ్రహ్మన్న యానడిరాత్రి
కనుకులదాసుండు ఘనబాహుబలుడు
కన్నమయనువాని గ్రక్కునబిలిచి
వెనకటిరాజులు విక్రమస్ఫూర్తి
పోరాడిసమసిన బూడిదవెంట
యిలభీమమైనట్టి యెముకలపోగు
లెసగినరణమ్హూమి యెన్నికగాను
పావనంబుగజేసి బహుకాలమందు
కనిపెట్టియున్నట్టి ఘనరాజవితతి
దూరములోపలనుండి తొలగింపవలయు
ఇరవుగాకలనిలో ఈరాత్రివేళ
ఎవ్వరెవ్వరుగాచి యెట్లున్నవారో
అరసిరమ్మనిపంప నావీరఘనుడు
వాసనపెల్లైన వనమాలగదల
కరములగుజ్జరి కడియముల్ మెరయ
నేటైనపిడిఘంత నెమలిసొగసులును
నల్లనిదట్టిని నయమొప్పగట్టి
అర్థనారీఝుల్ల కాదులునమర
ఘోరభైరవగద కోరమీసములు
ఎగుభుజంబులుమించు వెరజేరుగ్రుడ్లు
ఘనమైనదేహంబు కాలిపెండెరము
వెరవైనభీకర వేషంబుతోడ
కదలెకన్నెమనీడు కదనభూమికిని
కాటుకకొండయై కదసినయట్లు
గరిమతోచీకటి గ్రమ్మినయట్లు
హరిహరాదులమూర్తి యతనికిగలిగి
నడకలనింజొచ్చి నలుదెసల్ జూచె
అక్కడకాపున్న యఖిలరాక్షసులు
గండభైరవమూర్తి ఘనభూతవితతి
గుంపులైయున్నట్టి కొరవిదెయ్యములు
ఇరవుననున్నట్టి యెరుకలసాని
యున్నతావుకువచ్చి యొయ్యనననియె
వింటివేవార్తలు వినచిత్రంబు
గొల్లెనలచ్చటకుదురుగాజేసి
యీరుద్రభూమికి నీతడువచ్చె
ఏమికార్యమొకాని యెరుగంగరాదు
ముదముననున్నాడు మముజూచివీడు
తెలిసికోవలెవీని తెరగెల్లనిప్పు
డనిఉగ్రకోపాన నార్పులనిగూడ
కత్తులుద్రిప్పుచు గదిసికూయుచును
గట్టిగానిలిచిరి కన్నమమీద
అంతటకన్నమ అధికరోషమున
కాలాగ్నిరుద్రుడై కత్తినిదీసి
మెరపుకైవడినిల్వ మెచ్చెభూతములు
వల్లకాటికిధైర్య వైభవంబెసగ
ఎవ్వడేతెంచెనో యెరుదరాదిప్పు
డీశ్మశానములోన నెసగురుద్రుండొ
బ్రహ్మవిష్ణుడో పాకశాసనుడో
అగ్నిహోత్రుదో లేక యమధర్మరాజొ
అలనైరృతుడొ లేక అంభుదిపతియొ
పవనుడోధనదుడో ఫాలనేత్రుండొ
మునివితతికినెల్ల ముఖ్యుడోయేమొ
తెలియదమంచును దిన్నగాననిరి
ఎవడవురాయోరి యీభూమిజొచ్చి
యేమికార్యముకొర కేతెంచినాడ
వేరాజుబంటువో యెరిగింపుమనిన
పలికెగన్నమనీడు పటుశక్తిమెరయ
సోమవంశమున శోభిల్లుచున్న
అనుగురాజేంద్రున కంగనయైన
విద్యలదేవికి విభవంబుమీర
ముక్కంటివరమున ముగ్గురుసుతులు
మల్లికార్జునుయొక్క మానసరూపు
లనగజన్మించిరి అందులోమేటి
పెదమలిదేవుడు పృథ్వీతలేశు
దారాజునకుమంత్రి ఆదిదేవుండు
దొరసినరేచర్ల దొడ్డనాయునికి
పడతిశీలమయను పద్మనేత్రకును
కలికికృష్ణుండైన కారుణ్యమూర్తి
పుట్టెనుబ్రహ్మన్న భూలోకమందు
అతనికిదాసుడ నౌదునునేను
మాలలకునుబుట్టి మాలనైపోక
విష్ణుపాదముబట్టి విశ్వంబులోన
తెప్పలినాయుడు తెరవయైనట్టి
వికచాబ్జలోచన పెమ్మసానికిని
శ్రీమించుమాచర్ల చెన్నునిమేన
పెంపొందెడుతులసి పెదవనమాల
వరముగన్నట్టి వరపుణ్యసుతుడ
కన్నమనాపేరు కమలాక్షివినవె
కామునికెదిరించి కదనంబుగోరి
పగరపైదండెత్తి బవరంబునకును
వచ్చిరిమావారు వైభవంబలర
భండనక్రియకిది పట్టైనచోటు
వెనకటిరాజులు విక్రమస్ఫూర్తి
పోరాడివచ్చిన పునుకలపెంట
తొలగించిశుచిచేయ వలెనంచుదలచి
కామునిబలముల ఖండించివైచి
మడియంగవచ్చిరి మన్నెనాయకులు
పరభయంకరమైన భందనభూమి
అరసిరమ్మనిపంపె నవతారపురుషు
డైనట్టిబ్రహ్మన్న యనుచుచెప్పంగ
వినియెరుకలసాని విస్మయంబంది
ప్రళయకాలేశుండు పార్వతీశ్వరుని
పాదసేవకులైన ప్రమథులువార
లిప్పుడిటు బెసగెసంతసము
మనసులోకోరిక మాకుసిద్ధించె
బ్రహ్మనాయుడువచ్చి భాండనభూమి
పాదరేణువుచేత పావనత్వమ్ము
వెలయింపవలసిన వేళయేతెంచె
కడువేగరమ్మను కన్నమానేడె
అనినకన్నమవిని యాశక్తికపుడు
దండనమస్కృతుల్ తగజేసిమగిడి
బ్రహ్మనాయునిజూచి పదములకెరగి
కమలవల్లభవిను కంటినివింత
కంతినెరుకసాని కంటిదైత్యులను
జయమగువెంచేయు జలజలోచనుడ

" పల్నాటివీరచరిత్ర " -- ద్విపదకావ్యం -4

నాయకులు శకటంబులకుఁ బూన్చుటకై యెద్దులనుఁ బేరు పేరున బిలుచుట

అనివీడుకొలిపిన నంతంతవారు
పేరుపేరునవాని బిలిచిరీరీతి
అందెలబసవన్న అదినాధుండ
నందులపిడిఘంట నాగవాసయ్య
గోవులవిటకాడ గోగుబయ్యన్న
వంటరిపలిజంకు వరపెరుమాళ్ళు
కట్టనికలుకోట కరినందిరంకె
అకలంకగాత్రుండ అంబుధిశయన
బిరుదుగరుత్మంత భీమునిగజమ
గోవర్ధనాచల గోపాలదేవ
కరినందిబసవన్న కంచివరదుడ
నెలబాలచంద్రుండ నీలవర్ణుండ
కల్లులదర్దజ జయకంఠనాద
వైకుంఠవాసుడ వాసుదేవయ్య
పుట్టలభూపతి పెంజెల్గుపెద్ద
ఇంద్రునివజ్రమా ఇప్పగిరీశ
గోగుభైరవమూర్తి గోవిందరాజ
చెంచులయోబయ్య చెన్నమల్లయ్య
కంచియేకామ్రుడా కాళికానాథా
మధురాపురిప్రియ మానందినాథా
కాముడాసోముడా కాయజవరుడ
రాముడాభీముడా రంకెలుసలుపు
మీరీతిపిలిచిన నేపుమీరంగ
వచ్చినయెద్దుల వరుసతోజూచి
వన్నెలుచిన్నెలు వడిజెప్పికొనుచు
నెత్తురుకొమ్ముల నేటైనవాని
గణుపుతోకలుగల కరిబొల్లివాని
అచ్చగాకరివన్నె లమరినవాని
మూపురంబులతోడ మొనసినవాని
నుదుటచుక్కలుగల నునుపైనవాని
తెల్లవన్నెల తెలివైనవాని
పచ్చనివన్నెలు ప్రబలినవాని
ఇటువంతిఎద్దుల నెంతయునేర్చి
గంతలుగజ్జలు గణగణమ్రోయ
గ్రక్కునయెద్దున గాండ్లగట్టించి
మోకులబంధించి ముందుగానపుడు
పంచవన్నెలకూడు పైబారదివిచి
కంబంముదర్లించె కమలనాభుండు
మర్రివేములుదాటి మండలేశుండు
ఘూర్ణిల్లురవముతో గుమ్మడంపాడు
చేరియచ్చటనిల్వ చిత్తంబువిడిచి
గరికెపాటికివచ్చి కాలూనకచట
కంకణంబులపల్లె కడనునాఘనులు
కంకణంబులుగట్తి కదలిరావేళ
పట్టభద్రులు పైడిపాటికివచ్చి
పరగవీరులకెల్ల వైనంబు చెప్పి
మెరసినమన్నీలు మేటినాయకులు
ప్రభువులుదొరలును బంధువర్గంబు
వీరవర్యులుగొప్ప విద్యలవారు
మిక్కిలిబిరుదులు మెరయుసాహసులు
కవులునుజెట్టీలు కలిసియందంద

మలిదేవరాజాదులు త్రిపురాంతకమునుండి మేళ్ళవాగుఁ జేరుట

మేళ్ళవాగుననిల్చె మించినదండు
అందరుగొల్లెన లమరంగనెత్తి
యుండిరినాయకు లుత్తలపడక
అంతలోదినకరు డస్తాద్రికరగె
సాంద్రమైచీకట్లు జగమెల్లగప్పె
విలసిల్లెచుక్కలు వినువీథియందు
గుమిగూడిపక్షులు గూళ్ళలోజేరె
చక్రవాకంబుల సంతసంబడగె
ఘనచకోరంబులు కౌతుకంబందె
కొలకులకమలముల్ కుందుచుమొగిడె
వికసించెకుముదముల్ విచ్చలవిడిని
జారకామినులెల్ల సంతోషమునను
మగలనిద్దురబుచ్చి మనసులుబెదర
కెరలివిటులగూడి గృహములువెడలి
మించిసాహసమున మేరలుమీరి
తోడికోడండ్రును తోడివారలును
గురువులుబంధులు గుర్తెరింగినను
నిందింతురనిశంక నిలుపకమదిని
వాగులవంతల వనములయందు
ఇసుకదిబ్బలయందు నిరవైనపొదల
కుంటెనకత్తెలు కూడికాపాడ
మనసులతమిమించ మదనుడావేళ
పూబాణములువింట బూనిసంధించి
మర్మముల్ నొవ్వంగ మాటికినేయ
మంచిగంధముబూయ మనసుభీతిల్ల
పువ్వులుముడువను బుద్ధియులేక
ఘననఖక్షతదంత ఘాతలువీడి
రతికుంజితంబుల రంతులుమాని
బంధచాతురియందు భావంబువిడక
కొందరునేలను గొందరునిలచి
నయముతోగొందరు నానావిధముల
కలసిరిమేనుల కంపంబులలర
చోరులుసాహస స్పూర్తులతోడ
ప్రాణంబులకుదెగి భార్యలనుమరచి
బ్రతికివచ్చెదమను భావంబువదలి
పట్టణంబులయందు పల్లెలయందు
ధనికులగృహముల తార్కొనిదోచి
సారెకుదిరుగంగ సాగిరావేళ

" పల్నాటివీరచరిత్ర '" -- ద్విపదకావ్యం -3

మలిదేవరాజు, బ్రహ్మనాయుడు త్రిపురాంతకము జేరుట

త్రిపురాంతకమునకు తిన్నగావచ్చి
మహితచారిత్రుడు మలిదేవనృపతి
రాజులుమంత్రులు రసికులుదొరలు
పాటించిసుంకర వారితోగూడ
ఆవేళనీశ్వరు నతిభక్తిజూచి
సాష్టాంగదండముల్ చెయ్యనజేసి
హస్తముల్ముకుళించి అనియెబ్రహ్మన్న
గౌరీమనోహర గంగోత్తమాగ
నాగకంకణశివ నందివాహనుడ
కాంచనగిరిచాప కంధితూణీర
గరుడాసనాంబక కైలాసవాస
ఘనగజాసురభంగ కామభస్మాంగ
లాలితశ్రీకంఠ లయకాలకర్త
సకలభూతేశ్వర శభావతార
ఫాలాక్షభూతేశ పరమేశయిపుడు
విన్నవించెదనేను వినుముసత్కరుణ
శివపురిలోనుండి చేర్చినయట్టి
భూతరాట్త్సంభంబు పొందుగానుంచి
మితిచేసిచనితిమి మీనగరంబు
మృతివచ్చెనేటికి మీకృపచేత
కార్యమీడేర్పంగ కర్తలేమీర
యనుచుప్రార్ధనజేసి యచ్చటనున్న
కంబముగనుగొని కడుభక్తిమ్రొక్కి
యినుముపిత్తళికంచు హేమతామ్రముల
పంచలోహంబుల ప్రబలినదాన
నాలుగుముఖముల నయమొప్పమరియు
ఎనిమిదిముఖముల నెన్నికైనావు
ముగురుమూర్తులునొక్క ముఖమందునిలిచి
ఒకటసిద్ధులుమరి మొక్కటమునులు
గంగయుదుర్గయు కాలభైరవుడు
నిలిచిభూదేవియు నీయాననముల
గంధర్వపతులతో కాచుచునుందు
రనుచుప్రార్ధనజేసి ఆబ్రహ్మపలికె
ఘనకార్యమపూడి కలనులోపలను
నలగామరాజుతో నయముగాబోరి
మడియంగవచ్చిరి మన్నెనాయకులు
రణరంగపట్టపు రాజువైనీవు
సాక్షివైయుండవే సర్వభూతేశ
భుక్తినిచ్చెదనీకు భూతేశుడెరుగ
దాహంబుదీర్చుకో తడుచురక్తమున
ఇప్పుడాహారంబ యిదిగికొమ్మంచు
కంబమునకునిట్లు గట్టిగాజెప్పి
పెక్కువిధంబుల పిండివంటలును
పరమాన్నమునుమంచి పప్పుకూరలును
పానకంబులుజున్ను పచ్చళ్ళునెయ్యి
ఖండశర్కరతియ్య కందగడ్దలును
కొనితెచ్చికుంభము కొండలరీతి
కస్తూరికర్పూర కాశ్మీరసహిత
చందనలేపంబు సరివియొనర్చి
మైసాక్షిసాంబ్రాణి మంచిగుగ్గిలము
తోడుగలెస్సగ ధూపమర్పించి
ఘనమైనపోతుతో గావుజెల్లించి
ఆహారమంతట అర్పించిపిదప
కంబముంచినయట్టి ఘనశకట
నిచయంబుదరలింప నిలిచిబ్రహ్మన్న
శకటచక్రంబులు సమ్మతిగావ
నాయకావళినెల్ల నయముతోబిలిచి
వితరణచతురుడై విడియంబులిచ్చి
యెనయంగమనవీట నెసగునెద్దులను
కనుగొనితెప్పించి కాండ్లకుగట్టి
చయ్యనబండ్లను సాగింపుమనియె.

పల్నాటివీరచరిత్ర '" -- ద్విపదకావ్యం -2

మలిదేవరాజు, బ్రహ్మనాయుడు మెదలయినవారు కార్యమపూడి యుద్ధరంగమునకు బయలుదేరిపోవుట

అటమీదభూమీశు డధికోత్సవముల
ఘనకార్యమపూడి కదనరంగంబు
చేరబోవుటకునై చింతించియపుడు
ప్రజలతోమేడపి బదిలంబుసేసి
పరగమువ్వురుపతుల్ పైనంబుగాగ
ఎలమిభూసుర పురోహితులెల్లపూని
జయముహూర్తముబెట్టి చనుమని చెప్ప
తొల్లియేకాదశి దురమౌనటంచు
రణభేరివేయించె రమణీయముగాను
అతులసాహసవృత్తి నాదండువెడలె
గొల్లెనల్ గట్టిన గొప్పలౌబండ్లు
బల్లానిపెట్టెలు పట్టెమంచములు
తరుచైనపీటలు తమ్మిపడిగెలును
వింతమందసములు వెలయుగొడ్గులును
కాశ్మీరకస్తూరి గంధకర్పూర
మాదిగావాసన లమరుపెట్టెలును
బొక్కసంబులబల్వు బోనగావళ్ళు
జవ్వాదిపిట్తలు శారికాకీర
పంజరములువట్టు పరిచారకులును
కోడెకాండ్రదలించి కొట్టెడురెడ్లు
పడివాగెతేజీలు పాలకీజోళ్ళు
అష్టభాగ్యంబుల అంగళ్లవారు
సందడిపడదండు చయ్యనగదలె
పెంపైనపాలకి పెదమల్లుగదలె
పినమల్లుగదలె పృధ్వీశువెనుక
తమ్ముడుగదలెను ధరణీశువెంట
పచ్చలులింగాలు పట్టుగాజెక్కి
బాగుచేసినయట్టి పాలకియెక్కి
పలుమారుపుత్రుకై పలివరింపుచును
కొలువులోనాయుడు కొనరెట్టవట్టి
కులపగదీర్పని కొడుకితడంచు
పెట్టెనాచేతిలో ప్రియతనూజాతు
బాలునితెగువ యేపాటిదోయనుచు
కొమ్మభూమీశుండు గొబ్బునగదలె
అల్లాణరాజులు అచ్చోటినృపులు
అన్నలుదమ్ములు అందరుగూడి
సూర్యవంశమువారు సొంపుతోచనిరి.
వారికివీరికి వరమంత్రియైన
నీలవర్ణుండును నియతచిత్తుండు
బ్రహ్మన్నగదలెను పాయనివేడ్క
పట్టిరిగొడుగులు పాలకినెత్తి
సూర్యతాపంబు పైసోకనియట్లు
పాలకీలకురెండు పార్శ్వంబులందు
అందంబుగాబట్టి రరిగెలజోళ్ళు
వింజామరంబులు వెలయగానెమిలి
కుంచలవారును గూడువీవంగ
నాయడురాజులు నయముతోచనగ
ముందుడమాయీలు మురజసంఘంబు
బూరలుభేరీలు పోటుధారలును
కాహళవంకిణి కాలికొమ్ములును
శంఖసమూహంబు ముఖవీణవితతి
నరగలుతప్పెటల్ నయమైనడోళ్ళు
తమ్మటమ్ములునెంచదగువీరణములు
ఘనమైనరుంజలు కనకతప్పెటలు
చేగంతలును మరి చిరుగంటచయము
ఘనమైనమ్రోతచే గగనంబుగప్ప
కుంభిణివణకంగ కులగిరులెల్ల
మారుమ్రోతలనీదు మనసులుప్పొంగ
ఆవాలవారును ఆణెమువారు
కొండ్లవిందులవారు గోవిందువారు
ముతసానివారును ముయ్యూరువారు
నర్మాలవారును నాయనివారు
పైడిచుక్కల పాలపర్తివారలును
పాలుమూరివారును పాలెమువారు
రేవనూళ్ళలవారు రేచెర్లవారు
అట్లూరి ముట్లూరి యాఖ్యలవారు
చెవులవారునుమరి చిల్లరవారు
గురియైననాయకుల్ గూడియేతేర
గుండువారేగురు గదిసినవేడ్క
చనిరిబిరుదులతో సహసమడర
ఒప్పుగానిందరు నురువైనబండ్లు
ఘోటకంబులుమేటి కుంజరావళులు
ఉత్సాహమున హుటాహుటినడువంగ
భట్టువారలమించి బహువిధంబులను
బిరుదుపద్యంబులు పెళ్ళుగాజదువ
ఉద్ధతిమస్టీలు నొనరనిర్వంక
భైరవఖడ్గముల్ పట్టుకరాగ
శీలమ్మతనయుని సింహవిక్రముడు
కరమర్ధికనుకుల కన్నమనడిచె
సకలవీరచయంబు సంతతోత్సాహ
పొరుషంబులుమీర బ్రహ్మకిట్లనియె
"మముజూడునాయుడా మాలావుకొలది
మముజూడుబ్రహ్మన్న మాశౌర్యపటిమ
సింధూరంబులమీద జెన్నుగాదుమికి
కుంభస్థలంబులు క్రుంగజేసెదము
కొదమసింగబుల గూలద్రోసెదము
గండభేరుండాల ఖండింతుమలుక
వాయువుబోనీక వాడినాపగలము
జాతవేదునుబట్టి చమిరివేసెదము
ఘనసముద్రముజొచ్చి కలుగజేసెదము
కుంభినికాళ్ళతో క్రుంగదన్నెదము
కులగిరిలైనను కొట్టివేసెదము
గురిజాలనేలెడు కువలయేశ్వరుని
కులపగకైపట్టి క్రొవ్వణగించి
చలమునవిడువక చంపగాగలము"
అనిపెక్కుపంతంబు లాడుచునడువ
చూచినవారలు చోద్యంబుగాగ
పటువిక్రమాఢ్యులు పలనాటివీర
వరులంచుబొగడుచు వర్ణించిపలుక
మలదేవభూతి, మంత్రిబ్రహ్మన్న
కంపింపభూస్థలి కదలిరావేళ.