నాయకురాలు నాగమ్మ ( Nayakuralu Nagmma )
సమకాలీన శాసనాలు, సాహిత్యం, జానపద సాహిత్య ఆధారాలనూ సమన్వయ పరచి అధ్యయనం చేసినప్పుడు నాయకురాలు నాగమ్మ అనే భారతదేశపు ప్రప్రథమ మంత్రిణి కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం ఆరెవెల్లి గ్రామస్తురాలని, ఆమె కాలం నుండే తెలంగాణాలో “రెడ్డి” అనే కులం ప్రవేశించిందని అర్థమవుతుంది. ఇవి ఇప్పటి వరకు తెలంగాణా చరిత్రకు కొత్త విషయాలు కాబట్టి వీటిని విపులీకరించే ప్రయత్నమే ఈ వ్యాస ఉద్దేశ్యం
శ్రీనాథుడు తన “పల్నాటి యుద్ధం” కావ్యంలో నాగమ్మను
“పంటరెడ్డివారి పణతి యనంగ
ఎలమి జగ్గారెడ్డి వేడుక పుత్రి
మేకపోతుల రెడ్డి మేనకోడలును
ఆరవెల్లి వారింటి అమర కోడలును”
అంటూ వర్ణించాడు. నాగమ్మది .పంటరెడ్డి కుటుంబం. అంటే ఆమె కులపు ప్రధాన వృత్తి పంటలు పండించడం అనేది సుస్పష్టం. ఆమె చేసిన పల్నాటి యుద్ధానికి మూలాలు పంటలకు సంబంధించినవి అనేది ఆమె రాజు నలగామరాజు తండ్రి అనుగురాజు పూర్వ చరిత్ర ద్వారా తెలుస్తుంది. అనుగురాజు ఉత్తర దేశపు బాలమాచాపురి లేదా జంభూపురి (నేటి జబల్పూర్) నుంచి దక్షిణ దేశ యాత్రకు వచ్చి గుంటూరు జిల్లాలోని పల్నాడులోని గురజాలలో స్థిరపడి అక్కడి నుండే రాజ్యపాలన చేస్తుంటాడు. అతని (రాజ్యపు) పశువులకు పశుగ్రాసం అవసరమయ్యి” అతని సేనాపతి తెప్పలినాయుని ఆధ్వర్యంలో భటులు నేటి కరీంనగర్ ఉత్తర ప్రాంతానికి వస్తారు. ఆ రోజుల్లో (ఈ రోజుల్లో కూడా) ప్రధాన పశుగ్రాసం చొప్ప. ఈ జొన్నచొప్ప దండిగా దొరికే ప్రాంతం చొప్పదండి. ఇది కరీంనగర్ కు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. తెప్పలినాయుని మందీమార్బలం తమకు కావలసినంత పశుగ్రాసాన్ని సేకరించాక ఆ జొన్న చొప్ప కంకులను చూసి మురిసిపోయి ఒక పంట రెడ్డిని వాటి విత్తనాలను తమకు ఇవ్వుమంటారు- తమ ప్రాంతంలో ఆ పంటను, పశుగ్రాసాన్ని పండించుకోవడానికి. అందుకు ఆ రెడ్డి నిరాకరించడంతో అనుగురాజు సైన్యానికి, స్థానిక Nagamma Sరాజు ఊరకోట ప్రభువు పేరమరాజు సైన్యానికి మధ్య ఆరణిగండ్లలో పెద్ద యుద్ధం జరుగుతుంది. ఈ ఆరణిగండ్లనే నేడు ఆర్నగొండ అని పిలుస్తున్నారు. ఇది చొప్పదండికి ఉత్తరాన 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అర్నగొండ, గుండిల మధ్య యుద్ధ వ్యూహాలను రచించుకోవడానికి అనువైన కొండలు, గుండ్లు, మైదానాలు ఉన్నాయి. ఈ యుద్ధంలో పేరమరాజు చనిపోయాడు. ఈ పేరమరాజు, విత్తనాలు ఇవ్వడానికి నిరాకరించిన పంటరెడ్డి నాగమ్మకు ఏదో ఒక విధంగా బంధువులు అయ్యుంటారు. వారి మరణం / ఓటమికి కారణమైన తెప్పలి నాయుడు మీద నాగమ్మకు కోపం వచ్చింది. నాగమ్మ తండ్రి పేరు జగ్గారెడ్డి. ఈయన కాకతీయ రాజు మొదటి ప్రతాపరుద్రుడు చేతిలో క్రీ.శ. 1159లో ఓడిపోయిన పొలవాస దేశపాలకుడు రెండవ మేడ రాజు కొడుకు జగ్గదేవుడు అయ్యుంటాడు. ఈ జగ్గదేవుడు తనను శత్రురాజులు (ప్రతాపరుద్రుడితో సహా) ఎవరూ గుర్తు పట్టకుండా ఉండడం కోసం తన పేరును జగ్గారెడ్డిగా మార్చుకుని ఉంటాడు. ఇలా జరగడానికి అవకాశమున్నట్లు కరీంనగర్ జిల్లాలోనే మనకు రెండు శాసనాలు కన్పిస్తాయి. మహదేవపూర్‌లో ‘ప్రతాపగిరికోట’ను కట్టించిన ‘ముచ్చ నాయకుడు’ మనకు రామగుండం మండలం అడవిసోమనపల్లిలో “రామేశ్వరీ దేవరకు” నైవేద్యానకూ ముగ్గునకూ’ పన్నప (భూదానం) చేసినప్పుడు “ముచ్చరడ్డి”గా కన్పిస్తాడు. నిజానికి ఈ రడ్డిలు లేదా రెడ్డిలు మహారాష్ట్ర (మహారట్ట) నుంచి వచ్చినవారు. పలకడంలో రట్ట అనే పదంలట్ట కూడా అవుతుంది. అందుకే వీరి బిరుదుల్లో ఒకటి “లట్టలూరు పురవరాధీశ్వర” ఈ లట్టలూరు మహారాష్ట్రలోని లాతూరు. ఆ ప్రాంతం నుంచి వచ్చిన వారే రట్టలు, రడ్డిలు, రెడ్డిలు. వీరినే తిరెవారు అని కూడా అంటారు. వారి తిరె భాషలో మరాఠీ భాషనే ఎక్కువ వారి ఊర్లే కరీంనగర్ దగ్గరి తిరెపల్లి (5 కి.మీ.) తిరెవెల్లి (25 కి.మీ.) ఈ విధంగా తెలంగాణాలో రెడ్డి కులజులు ప్రవేశించారని అర్థమవుతుంది. ఇది మొదలు తెలంగాణాలో ( నిశాసనాల్లో) రెడ్డి కులస్థులు చాలా మంది కన్పిస్తారు.
Templeపేరమరాజు చనిపోయిన కొన్నాళ్ళకు అతని కొడుకు ఉత్తురుడు స్థానిక రాజులందరిని పోగు చేసి అనుగురాజు మీద యుద్ధానికి సన్నద్ధుడు అవుతాడు. మళ్ళీ యుద్ధం ఆరణిగండ్లలోనే జరుగుతుంది. ఈ ఆరణిగండ్ల (ఆర్మకుండ) క్రీ.శ.1005 నాటికే ఏడు వేల ద్రమ్మల (ఆనాటి కరెన్సీ) ఆదాయం కలిగిన నగరమని దగ్గర్లోని కడపర్తి శాసనంలో ఉంది. కాబట్టే ఇక్కడ స్థానిక రాజులందరూ కూడారు. కాని అనుగురాజు తరపున యుద్ధం చేసిన బ్రహ్మనాయుడి చేతిలో వీరందరూ ఓడిపోయి కప్పం కట్టడానికి ఒప్పుకున్నారు. అయితే యుద్ధం జరుగుతున్న సమయంలో వీరిలో ఎందరో చనిపోయారు కూడా. అలా చనిపోయినవారిలో నాగమ్మ భర్త (సింగారెడ్డి), తల్లిదండ్రులు, అత్తమామలు కూడా ఉన్నారు. అప్పటికి ఆమె పెళ్ళయి రెండు మూడు రోజులే అవుతుంది. ఈ ఘోరానికి కారణమైన బ్రహ్మనాయుడి మీద నాగమ్మకు ద్వేషం పెరిగింది. ఆమె తండ్రి జగ్గారెడ్డి భూమిలో బ్రహ్మనాయుడు బావి తవ్వించి, అందుకు వ్యతిరేకించినందుకు జగ్గారెడ్డిని చంపించాడని, అందుకే బ్రహ్మనాయుడిపై నాగమ్మకు ద్వేషం పుట్టిందని కొన్ని వాదనలున్నాయి. అదీగాక బ్రహ్మనాయుడు వైష్ణవాన్ని ప్రచారం చేశాడని, ఆయన బృందం వెలమలని, వాటికి వ్యతిరేకంగా నాగమ్మ వీరశైవాన్ని ప్రచారం చేసిందని, రెడ్డి కులస్థులను బలపర్చిందని, ఈ కారణాల నేపథ్యంలోనే పల్నాటియుద్ధం జరిగిందని చరిత్రకారులు నమ్ముతున్నారు. కవిబ్రహ్మ ఏటుకూరి వారి క్రింది పద్యంలో ఇందుకు ఆధారాలు కనిపిస్తున్నాయి నాగమ్మ “కట్టించినది కోట గడ్డలకెదురుగా జంగమ వృద్ధుల సత్రశాల…. సృష్టించినది వీరశివభక్తులకుగాను స్థావరమ్మున యందు శైవవీధి” అని చెప్పడంలో ఆమె వీర శైవమతాన్ని పోషించిన విషయం విదితమవుతుంది. పల్నాటి యుద్ధంలో (క్రీ.శ.1180 ప్రాంతంలో జరిగింది) ఎవరు రాజకీయంగా గెలిచినా సామాజికంగా అందరూ ఓడారు. అపార ధన, ప్రాణ నష్టం జరిగింది. అందుకు వెరసి నాగమ్మ తన ముసలితనంలో తన సొంతూరు ఆరెవెల్లికి వచ్చి ప్రజల యోగక్షేమాల సాధనకై కృషి చేసిందని గుర్రం చెన్నారెడ్డి తన ‘పల్నాటి చరిత్ర’లో వ్రాశాడు. అంతేకాదు. “కొండకోనల నివసించు కోయవారు బాటసారుల హింసించు బందిపోటు అక్రమంబగు చర్యల విక్రమింపనణచివేసె నాగమ్మ సాహసము చూపి” అని డా. కోడూరు ప్రభాకరరెడ్డి తన ‘పల్నాటి భారతం’ (పద్యం 85)లో రాయడంలో ఆమె దొంగల నుంచి ప్రజలనెలా రక్షించిందో తెలుస్తున్నది (నేటికీ ఆదిలాబాద్ జిల్లాలలో గొత్తికోయలు సీజనల్ దొంగతనాలను ఆశ్రయించడం గమనార్హం) అందుకే ఆమె దొంగలకు శత్రువుగా మారింది. ఆ సాంప్రదాయం ఎంతవరకు కొనసాగిందంటే, ఆమె తరువాత ఐదు వందల సంవత్సరాల తరువాత విజృభించిన కొండల్రాయుడు అనే గజదొంగ కూడా ఆమెను మాయలమారిగా తలంచాడని బుడిగ జంగాల కథలో చెప్తారు. నాగమ్మకు ‘నా’ అన్న వారు లేరు కాబట్టి “పల్లె ప్రగతికి ధన మెల్ల వ్యయముజేసె’నని సాహిత్యాధారాలు తెలుపుతున్నాయి. ‘ఆమె యొనసరించినట్టి నిస్వార్థసేవ సర్వజనులకు మిగుల హర్షమ్ముగూర్చె” కాబట్టి ఆమెను స్థానికులు దేవతగా కొల్చారు. కనుకనే ఆమెకు ఆమె ఊరు ఆరెవెల్లిలో గుడికట్టారు. అది ఇప్పటికీ ఉంది. ఇక్కడికి దగ్గరలో ఉన్న పొలవాసలో కూడా ఒక స్త్రీ శివలింగాన్ని పట్టుకున్నట్లుగ విగ్రహముంది. అది శివభక్తురాలు నాగమ్మదే అయ్యుంటుంది. పక్క జిల్లా నిజామాబాదు జిల్లా బాన్సువాడ దగ్గరి దుర్కి సోమేశ్వరాలయ గర్భగుడిలో కూడా నాగమ్మ విగ్రహముంది. శాసనాలున్నాయి. వాటిని చదివితే మరిన్ని ఆధారాలు లభించవచ్చు. ఆరెవెల్లిలోని గుడికి తూర్పున నాయకురాలి వాగు, నాయకురాలి మడుగు ఉన్నాయి. వాటిని ఆమె తవ్వించినందుకుగాని, లేదా ఆమె సంక్షేమ కార్యక్రమాలకు గుర్తుగా గాని నాయకురాలు నాగమ్మ పేరుతో పిలుస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా లక్షెట్టిపేట దగ్గరలోని కన్నెపల్లి గుడిల నాగమ్మ విధవలకు, విడిపోయినవారికి మళ్లీ వివాహం జరిపించే సాంప్రదాయాన్ని నెలకొల్పింది. అది ఇప్పటివరకూ కొనసాగుతున్నది. ఇలా నాగమ్మ వచ్చి మండలం అంతటా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఈ విధంగా నాయకురాలు నాగమ్మ తెలంగాణ అందించిన మొట్టమొదటి మహిళా మంత్రిణే కాకుండా, ఆమె ఉత్తర తెలంగాణలో రెడ్డి కులాన్ని, వీరశైవాన్ని ప్రవేశపెట్టినదిగా, దొంగలను, దోపిడీలను పారదోలి ప్రజాసంక్షేమానికి పాటుపడినదిగా చరిత్రలో గుర్తుండిపోతుంది.
– ద్యావనపల్లి సత్యనారాయణ,
చరిత్రకారుడు, 9490957078.