సమ్మోహితులను చేసిన శ్రీదేవి సిస్టర్స్ బుర్రకథ
source: andhrabhoomi news
బ్రహ్మనాయుడు రోషంతో మీసం తిప్పితే నాయకురాలు నాగమ్మ ముంజేతి రోమాలు రోషాగ్నులై భగ్గుమన్నాయి. మగువ మాంచాల మానోహర సుందర రూపమే బ్రహ్మనాయుడి పుత్రుడి ప్రేమగీతమై పరవశించింది. అలరాజు ఆగ్రహం...నాయకురాలి కుతంత్రాలు...పద్యాలై పరవళ్లుతొక్కాయి. నరసింగుడి రాణువ... బాలచంద్రుడి తెగువ కత్తులు దూసి నెత్తురోడ్చి నేలకూలాయి. దాయాదుల రాజ్య కాంక్ష, ఆరాటాలు, పోరాటాలు, నాగులేటి నేలమీద చిత్తుగా ఓడి నెత్తురోడ్చాయి. గురుజాల నాగమ్మ పుంజు.. మాచర్ల బ్రహ్మన్న పుంజు.. కాళ్లకు కత్తులు కట్టి రెక్కలెత్తివచ్చి పోరాడుతున్నాయా అన్నట్టు పురమందిరంలో యుద్ధ వాతావరణం కనిపించింది. ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు నిర్వహించడంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న సింహపురి సంగీత సభ మంగళవారం రాత్రి వికృతి నామ సంవత్సర తెలుగు ఉగాది పర్వదిన వేడుకల సందర్భంగా బుర్రకథను ఏర్పాటుచేశారు. ఒంగోలు సాయి బుర్రకథ దళం శ్రీదేవి సిస్టర్స్ వేదవతి భాగవతారిణి (ప్రధాన కథకులు) శ్రీదేవీ భాగవతారిణి (హాస్యం), భారతి (వంత) ప్రదర్శించిన పల్నాటి యుద్ధం బుర్రకథ పుర మందిర ప్రేక్షకులను 900 సంవత్సరాల వెనక్కు తీసుకువెళ్లింది. లాగులేటి ఒడ్డున జరిగిన పల్నాటి యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూపించింది. టివిలు, సినిమాలతో విసిగి వేసారుతున్న నగర ప్రజలకు శ్రీదేవి సిస్టర్స్ తమ బుర్రకథతో ఆనందాన్ని కలిగించారు. కధాగమనం కరుణ, వీర రసాలు ప్రధానంగా సాగేదే అయినా సందర్భోచితమైన హాస్యం, లాస్యం, శృంగార రసాలుసైతం పండించింది. మరుగున పడిపోతున్న ప్రాచీన జానపద కళారూపాలను ఒక్కసారిగా తెరపైకి తెచ్చి వాటిలోని మాధుర్యాన్ని ప్రేక్షకులకు చవిచూపించారు. సాధారణంగా మహిళలు హరికథలు చెప్పడం అందరికీ తెలిసిన విషయమే అయినా బుర్రకథలు చెప్పే మహిళలు చాలా తక్కువమందే ఉంటారు. ఎక్కువ భాగం బుర్రకథలు వీర రస ప్రధానమైనవి కావడం వల్ల సహజసిద్ధమైన ఒడ్డుపొడుగు కలిగి, ఆకార, ఆహార్యాల్లో ప్రత్యేకత కలిగిన పురుషులే బుర్ర కథలు చెప్పడంలో రాణిస్తుంటారు. ఇందుకు పూర్తి భిన్నంగా ఆకార, ఆహార్యాల కంటే ప్రతిభా పాఠవాలే కథకులకు ప్రధాన అర్హతలని చాటి చెపుతూ శ్రీదేవి సిస్టర్స్ ప్రదర్శించిన పల్నాటి యుద్ధం బుర్రకథ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుని పల్నాటి యుద్ధాన్ని బుర్ర కథ రూపంలో అదికూడా కేవలం 3గంటల్లో చెప్పడం చాలా కష్టమైన విషయం. టివి, సినిమాలకు అతుక్కుపోయేవారిని సైతం పురమందిరానికి రప్పించి మూడు గంటలపాటు కూర్చోబెట్టగలిగిన ఘనత శ్రీదేవి సిస్టర్స్‌కే దక్కిందంటే అతిశయోక్తి కాదు. ఆకార, ఆహార్యాల్లోని లోపాలను సైతం అధిగమిస్తూ సహజసిద్ధంగా సంక్రమించిన హావ, భావ నాట్య, నటనా చమత్కార విన్యాసాలతో, కథకులు ఆద్యంతం కథా గమనాన్ని రక్తి కట్టించారు. నేటి తరానికి తగ్గట్టుగా సినిమా పాటలు, ధ్వన్యనుకరణ, జోకులు, పిట్టకథలు జోడిస్తూ కథను ముందుకు నడిపిన తీరు అద్భుతం. ముఖ్యంగా నలగామ నాయుడు గుర్రం ఎక్కి వేటకు వెళుతున్న దృశ్యాన్ని మిమిక్రీ ద్వారా కళ్లముందు ఆవిష్కరించిన తీరుకు ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు. గురుజాల మాచెర్ల కోడిపుంజలు వీర శివాలెత్తి పోరి తన్నుకున్న వర్ణన తరతరాల తెలుగు సంప్రదాయ లోటుపాట్లను ఎత్తి చూపింది. రాయబారంలో అలరాజు ఆగ్రహాన్ని అలవోకగా భరించిన నాగమ్మ అదును చూసి విషం ప్రయోగించడం ద్వారా అతడిని మట్టుపెట్టిన విధానం ఉత్కంఠత రేపింది. కదన కుతూహలంతో బాలచంద్రుడుర భార్య మాంచాల అందాన్ని చూసిన ఘట్టంలో కథకులు పండించిన సుకుమార శృంగారం అద్భుతంగా ఉంది. అంతలోనే ఫటఫట పళ్లు కొరుకుతూ బాలచంద్రుడు యుద్ధ రంగంలోకి ఉరికిన వైనాన్ని వీర రస ప్రధానంగా అభినయించిన తీరు ప్రేక్షకుల ఉత్కంఠ కలిగించింది. యుద్ధ భూమిలో నరసింహుడి కత్తివేటుకు బాలచంద్రుడి పేగులు బయటకు పెళ్లుకు రావడం ఆ పేగుల రక్తాన్ని నాగులేటి నీటితో కడిగి తిరిగి పొట్టలో కూర్చుకుని రక్తసిక్తమైన రూపంతోనే కదన కుతూహలుడైన విధానాన్ని వర్ణించిన తీరు ప్రేక్షకులకు గగుర్పాటు కలిగించింది. బాలచంద్రుడు మరణించడం, మరణవార్త తెలుసుకుని బాలచంద్రునిపైబడి తండ్రి బ్రహ్మనాయుడు రోధించిన విధానాన్ని కరుణ రసం ఉట్టిపడేలా హృద్యంగా పద్యంలో చెప్పిన తీరు ప్రేక్షకులను కన్నీటి పర్యంతం చేసింది. జనరంజకంగా మహిళలు బుర్రకథను చెప్పడం చాలా అరుదైన విషయం. ఆటను ఆధునికంగా, పాటను పాటవంగా, పద్యాన్ని హృద్యంగా, మాటను మధురంగా, సన్నివేశాన్ని సందర్భోచితంగా ఆడిపాడి పలికి, నటించి, నర్తించి నేటి తరానికి సైతం మెచ్చేలా ప్రేక్షకులను ఒంగోలు సిస్టర్స్ మంత్రముగ్థులను చేశారు. ఈకార్యక్రమంలో యజ్ఞనారాయణ కీబోర్డు, బాబూరావు డోలక్‌పై సహకరించారు. జిల్లా కలెక్టర్ కె రాంగోపాల్ దంపతులు, పలువురు అధికారులు, అనధికారులు, రాజకీయనాయకులు, పుర ప్రముఖులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. కథకులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమాన్ని సింహపురి సంగీత సభ అధ్యక్ష, కార్యదర్శులు వాకాటి విజయకుమార్‌రెడ్డి, బివి నరసింహం పర్యవేక్షించారు.
No comments:
Post a Comment