Friday, 13 February 2015

తేరాల సిద్దేశ్వరస్వామి ( Sidheswara Swamy, Terala )

తేరాల సిద్దేశ్వరస్వామి
సాధారణంగా ఏ శైవ క్షేత్రంలోనైనా గర్భాలయంలో ఒకే శివలింగం దర్శనమిస్తుంది. చాలా అరుదుగా .. అక్కడి స్థలమహాత్మ్యాన్ని బట్టి రెండు శివలింగాలు కనిపిస్తూ ఉంటాయి. అలా రెండు ఉన్న శివలింగాలు ... ఒకదాని పక్కనే మరొకటిగా కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా ఒకే గర్భాలయంలో ఒక శివలింగం వెనుక మరొక శివలింగం ఉండటం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 

అలాంటి ఆశ్చర్యానికి గురిచేసే క్షేత్రం గుంటూరు జిల్లా దుర్గి మండలం పరిధిలో దర్శనమిస్తుంది. సిద్ధేశ్వరుడుగా స్వామివారు పూజలు అందుకునే ఈ క్షేత్రం, 'తేరాల' గ్రామానికి సమీపంలో అలరారుతోంది. ఇక్కడి గర్భాలయంలో రెండు శివలింగాలు ఒకదాని వెనుక మరొకటి కనిపిస్తూ పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాయి. ఈ రెండింటిలో ముందుగా కనుపించేది స్వయంభువు శివలింగమనీ, దాని వెనుక కనిపించేది పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగమని స్థలపురాణం చెబుతోంది.

క్షత్రియ సంహారం వలన కలిగిన పాపాల నుంచి విముక్తిని పొందడానికిగాను పరశురాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి వస్తాడు. ఆయన సంకల్పానికి తన అనుగ్రహాన్ని అందిస్తూ శివుడు స్వయంభువుగా ఆవిర్భవిస్తాడు. అందుకు ఆనందాన్ని వ్యక్తం చేసిన పరశురాముడు, తాను తీసుకు వచ్చిన శివలింగాన్ని దాని వెనుకన ప్రతిష్ఠిస్తాడు. ఈ కారణంగానే ఇక్కడి శివలింగాలు ఒకదాని వెనుక ఒకటిగా దర్శనమిస్తుంటాయి.

పాపాలను హరించడం కోసం పరమశివుడు స్వయంభువుగా ఆవిర్భవించాడు కనుక ఈ క్షేత్రం మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. అరుదైన క్షేత్రం కనుక కార్తీకమాసంలో ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శిస్తూ వుంటారు. ప్రశాంతతకు ప్రతీకగా కనిపించే ఈ క్షేత్రం వనభోజనాలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అందువలన భక్తులు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుని మరీ ఇక్కడికి వస్తుంటారు. స్వామి సన్నిధిలో ఆధ్యాత్మిక పరమైన అనుభూతిని సొంతం చేసుకుని వెళుతుంటారు.